కుందేలు - ఏనుగు
తను చెప్పదలచుకొన్న నీతికథలు రెండూ ముగించిన తర్వాత హిరణ్యగర్భుడు. 'సరి సరి, ఇంతకీ నువ్వు చెప్పే సమాచారం పూర్తి కాలేదు. ఆ అడివి పక్షులన్నీ నిన్ను తిట్టిపోసి నీతో యుద్ధానికి దిగాయి అన్నావు. ఆ తర్వాత ఏం జరిగింది?' అన్నాడు.
దీర్ఘముఖుడు చెప్పసాగాడు:
'ఆ పక్షులన్నీ నామీదికి వచ్చి, 'కృతఘ్నుడా! ఇంట తిని ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు, మా దేశం వచ్చి మా రాజుని నిందిస్తావా? మేము చిత్రవర్ణుడి బంటులం. నిన్ను ఇప్పుడే చీల్చి చంపుతాం' అంటూ నా ఒళ్ళంతా కుళ్ళబొడిచారు. 'మీ రాజు హిరణ్యగర్భుడు, హంస. టివాడు. అలాంటివాడి కెవరూ భయపడరు. ఇంక అతను రాజ్యమెలా చేస్తాడు? రాజు అన్న తరువాత ఒకప్పుడు మృదువుగా, శాంతంగా ఉండాలి, ఒకప్పుడు కరుకుగా, క్రూరంగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడూ మెత్తగా ఉండే మీ బలహీనపు రాజు సవ్యంగా రాజ్యమెలా చేస్తాడు? చేరితే పెద్ద పళ్ళచెట్టు కింద చేరాలి. పళ్ళు కాకపోతే, నీడయినా దొరుకుతుంది. బలహీనుడయిన రాజు దగ్గర చేరటం దండగ. పొట్టకోసం అలాటి హీనుడి దగ్గర సేవ చేయటం కంటే, ఆకూ, అలమూ తింటూ అడివిలో పడుండటమే నయం. రాజు మనల్ని కష్టకాలంలో రక్షించగలిగి ఉండాలి. లేకపోతే, రాజెందుకు,రాజ్యమెందుకు ? పూర్వం కుందేళ్ళు ఏనుగుని మోసం చేసి. తమ పాటికి తాము హాయిగా బతకలేదూ? కావాలంటే ఆ కథ చెప్తాం, విను.
ఓ అడవిలో కొన్ని ఏనుగులుండేవి. ఓ ఏడు వానలు సరిగా పడక అడవిలో కొలను ఎండిపోయింది. ఏనుగులన్నీ వాటి రాజు దగ్గరికి వెళ్ళి, 'రాజా, మనం ఇన్నాళ్ళూ స్నానం, పానం చేస్తున్న చెరువు కాస్తా ఎండిపోయింది. తాగటానికి కూడా నీళ్ళు దొరకట్లేదు. ఈ కష్టం నించీ ఎలా బయటపడాలో తెలియటం లేదు. ఏదో ఉపాయం ఆలోచించి, మమ్మల్ని నువ్వే రక్షించాలి. ముంచినా, తేల్చినా ఇంక నువ్వే మాకు దిక్కు అన్నాయి.
రాజు ఒక సేవకుణ్ణి పంపి ఆ చుట్టుపట్ల ప్రాంతాలన్నీ వెతికించాడు. కొంతదూరంలో పెద్ద చెరువు కనిపించింది. ఏనుగులన్నీ ఆ చెరువు ప్రాంతానికి పోయి దప్పిక తీర్చుకోవడమే గాక హాయిగా స్నానాలు కూడా చేశాయి. కానీ, ఆ ఏనుగుల హడావిడిలో, తొక్కిసలాటలో, పాపం, ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్ళు చాలా నలిగిపోయాయి. కొన్ని కుందేళ్ళయితే ఏనుగుల కాళ్ళకింద పడి చచ్చేపోయాయి.
ఆ కుందేళ్ళ రాజు పేరు శిలీముఖుడు. మంత్రి పేరు రోమకర్ణుడు. తనతోటి కుందేళ్ళు అలా ఏనుగుల కాళ్ళకిందపడి చచ్చిపోతుంటే, రోమకర్ణుడి కెంతో బాధ కలిగింది. రాజు శిలీముఖుడి దగ్గరికి వెళ్ళి, 'రాజా! ఈ ఏనుగుల గుంపు రావటంతో మన కుందేళ్ళకు ప్రళయం వచ్చేసింది. ఏదయినా యుక్తితో మనల్ని మనం రక్షించుకోవాలి' అన్నాడు.
శిలీముఖుడు తన మంత్రులనందరినీ పిలిచాడు. "ఈ ఏడు వేసవి ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఈ ఏనుగులు తెగ తిరిగేస్తున్నాయి. ఇవి యిలా రోజూ మన అడవిలో తిరిగితే, అడవిలో కుందేళ్ళన్నీ వాటి కాళ్ళక్రిందపడి నలిగి చావవలసిందే. మీలో ఎవరయినా మంచి ఉపాయం చెప్పండి" . అన్నాడు. ఏ ఉపాయం తోచక కుందేళ్ళు ముఖం, ముఖం చూసుకొంటూ మౌనంగా కూర్చొన్నాయి. ఇంతలో విజయుడు అనే ముసలి కుందేలు లేచి, 'రాజా, ఇదో పెద్దపని కాదు. బలం లేకపోయినా, తెలివి ఉంటే ఎంత కష్టమయిన పనయినా చేయచ్చు. ఈ ఏనుగులను ఇక్కణ్ణించి తరిమివేసే పని నాకు అప్పజెప్పండి. నేను సాధించి వస్తాను' అంది. రాజు అనుమతించాడు. విజయుడు బయల్దేరాడు..
ఆలోచిస్తూ నడుస్తూ విజయుడు చెరువు పక్కనే ఉన్న కొండపైకి ఎక్కి కూర్చొని, ఏనుగుల గుంపు మళ్ళీ నీళ్ళ కోసం చెరువు దగ్గరికి వచ్చేదాకా వేచి ఉన్నాడు. అవి వచ్చి, నీళ్ళు తాగి తిరిగిపోతుండగా కొండ మీద నుంచీ ఒక కేక వేశాడు. 'ఓ ఏనుగు రాజా! ఇది ఒక్క మాట విని వెళ్ళు!' అని. ఏనుగులు రాజు కిందినుంచీ కొండమీదికి చూసి, 'ఇంతకీ నువ్వెవరివి? నాతో ఏం మాట్లాడాలి. త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి' అన్నాడు.
విజయుడు గంభీరంగా మొహం పెట్టి నేను సామాన్యశ్రీ కాదు. వెన్నెలతో లోకాలన్నింటినీ వెలిగించే ఆ చంద్రుడు మా మహారాజు. నేను మహాబలుడయిన ఆ మహారాజు దూతను. ఆయన సందేశం నీకు వినిపించడానికి వచ్చాను, విను! "ఈ చెరువు నా సామ్రాజ్యంలోది. ఎంతటి బలవంతుడయినా నా అనుమతి లేకుండా ఇక్కడికి రాకూడదు. మీరు వచ్చి, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తిరిగి, మా కుందేళ్ళను తొక్కి చంపి మహాపరాధం చేశారు. మీకు బతకాలని ఆశ ఉంటే, వెంటనే ఇక్కణ్ణించి పారిపొండి. ఇక ముందెప్పుడూ ఇటు పక్కలకు రావద్దు. మీ తప్పును తెలియక చేసిన తప్పుగా భావించి, క్షమిస్తున్నాను. నా ఆజ్ఞ పాటించకపోతే మిమ్మల్నందర్నీ భస్మం చేస్తాను" అని ఆయన మీకు చెప్పమన్నాడు. ఆయన మీమీద చాలా కోపంగా ఉన్నాడు. మీరొకసారి వెళ్ళి ఆయన కాళ్ళమీద పడి క్షమాపణ చెప్పుకొంటే చల్లబడతాడు. లేదంటే మీ ఇష్టం” అన్నాడు.
ఈ మాటలకు ఏనుగులు నిజంగా భయపడిపోయినాయి, ఏదో నక్కలతో, పిల్లులతో అంటే యుద్ధం చేయొచ్చు కానీ, సాక్షాత్తూ దైవ స్వరూపులయిన సూర్య చంద్రుల వంటి వాళ్ళతో శత్రుత్వమే?
"ఓ విజయుడా! మేము. మీరాజు కోపానికి తట్టుకోగల వాళ్ళం కాదు. తెలియక పొరపాటు చేశాం. ఇంకెప్పుడూ ఈ చెరువుజోలికి రాము. మమ్మల్ని క్షమించమని, నువ్వే మా తరఫున మీ రాజుకు చెప్పు, ఆయన ఎదుటబడే ధైర్యం మాకులేదు. నువ్వే ఎలాగయినా ఆయనకు నచ్చజెప్పి.. మమ్మల్ని కాపాడు. మేం వెళ్ళి వస్తాం" అన్నాయి ఏనుగులు.
"మా రాజు సన్మార్గుడు, చల్లనివాడు. తెలియక చేసిన తప్పులు ఆయన తప్పక క్షమిస్తాడు. భయపడకండి. ఆయన పేరునే ఈ సరస్సుని 'చంద్రసరస్సు' అంటారు. మేము ఆయన సేవకులం. ఆయన ఈ సరస్సు కాపలాకు మమ్మల్ని నియమించాడు. చంద్రుడికి కుందేళ్ళంటే చాలా ప్రేమ అని మీకు తెలుసు గదా! మీ మాటలు ఆయనకు నేను చెప్పొచ్చు.. కానీ ఇప్పుడాయన ఆకాశంలో తిరిగి రావడానికి వెళ్ళాడు. ఇప్పుడాయనను మనం చేరలేం. కానీ ఆయన అప్పుడప్పుడూ మన సరస్సుకు వచ్చిపోతుంటాడు. ఈ రాత్రికి వస్తాడు. మీ రాజు సాయంత్రం చీకటిపడుతుండగా వచ్చి, ఆయన్ని కలిసి క్షమాపణ చెప్పుకొంటే బాగుంటుంది" అన్నాడు విజయుడు.
అలాగేనని ఏనుగుల రాజు సాయంకాలం చీకటి పడుతుండగా ఒంటరిగా చెరువు దగ్గరికి వచ్చాడు. విజయుడు చెరువులో కదుల్తున్న చంద్రబింబం చూపించాడు. ఇంకా పూర్తిగా చీకటి పడకపోవటం వల్ల చంద్రబింబం కొంత ఎర్రగా కనిపించింది. “అదిగో చూడు, ఆయన ఎంత కోపంగా ఉన్నాడో, ఇలాంటప్పుడు మనం ఆయన్ని పలకరించటం ప్రమాదం.. పుటుక్కున చంపేసినా చంపేస్తాడు. అంచేత నువ్వు వెళ్ళిపో. ఇక్కణ్ణించే ఆయనకు ఒక్క నమస్కారం పెట్టి వెళ్ళిపో, నేను సరయిన సమయం చూసి, ఆయన చల్లబడ్డ తర్వాత నువ్వు చెప్పిందంతా ఆయనకు చెప్పి, మిమ్మల్ని క్షమించమని ఎలాగో నచ్చచెబుతాను. కానీ, మళ్ళీ ఎప్పుడూ మీలో ఎవరూ ఈ చుట్టు పక్కలకి కూడా రావద్దు. వస్తే ఆయన మీ ప్రాణాలు దక్కనీయడు!" అన్నాడు విజయుడు. ఓ నమస్కారం పెట్టి, ఏనుగుల రాజు, తన మందనంతా తీసుకొని ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయాడు.
ఈ కథతో చెప్పే నీతి బోధపడింది గదా? 'మీ రాజు వంటి బలహీనుడయిన రాజుని కొలిచే కంటే, ಬುದ್ಧಿ బలంతో యుక్తితో జీవించడం మేలు' అంటూ ఆ అడవి పక్షులు మా రాజువయిన నిన్ను బాగా తిట్టేశాయి.
నాకు చాలా కోపం వచ్చేసింది. అయినా దాన్ని అణుచుకొంటూ 'మా హంస రాజు హిరణ్యగర్భుడు పిరికివాడు కారు శత్రువుల్ని చెందాడటంలో ఆయన్ని మించిన పరాక్రమశాలి ఈ భూమి మీద లేదు. మీకాయన సంగతి శ్రీ శ్రీ తెలియదు. తెలియనప్పుడు ఆయన సంగతి మాట్లాడొద్దు. ఆయన గొప్పవీరుడు' అన్నారు.
ఆ పక్షులు మండిపడి, నన్ను కట్టి పడేసి కొట్టి, హింసించాయి. కొన ప్రాణంతో ఉన్న సన్ను వాళ్ళ రాజు. . చిత్రవర్ణుడి ముందుకు తీసుకెళ్ళాయి. "రాజా, ఈ కొంగ మదించి, మంచీ చెడూ లేకుండా, మిమ్మల్ని నిందించాడు. ఇతరుల్ని నిందించేవాడు తన పాపంలో తనే కాలిపోతారు, చచ్చినవాడిని చంపటం ఎందుకూ అని మీరు జాలి చూపొద్దు. వీడిని మేమే చంపుదుం. కానీ మీకు విషయం చెప్పి, మీ అనుమతితో చంపాలని ఇక్కడికి తెచ్చాం" అన్నాయి. కానీ చిత్రవర్ణుడు వాటిని వారించాడు. "వీడెవరూ? ఏ దేశం వాడు?" అని అడిగాడు, "వీడిది కర్పూరద్వీపమట, వీడి రాజు పేరు హిరణ్యగర్భుడట" అని అవి జవాబు చెప్పాయి. ఇంతలో చిత్రవర్ణుడి మంత్రి - దూరదర్శి అనే గడ్డ - కల్పించుకొని, మీ రాజ్యానికి మంత్రి ఎవరు?" అని నన్నడిగాడు. 'మా రాజ్యానికి మంత్రి సర్వజ్ఞడనే చక్రవాక పక్షి. ఆయన ధర్మజ్ఞుడూ, అనుభవం కలవాడూ, వీరుడూ, ప్రతిభాశాలీ', అని చెప్పాను.
ఇంతలో అక్కడే ఉన్న ఒక చిలుక - దానిపేరు అరుణముఖుడు - చిత్రవర్ణుడితో ఇలా అంది: "రాజా, ఈ కర్పూర ద్వీపంలాంటి చిన్న దీవులన్నీ జంబూద్వీపంలో భాగమే కాబట్టి, ఆరాజ్యంకూడా మనదే. ఆ హంసరాజు హిరణ్యగర్భుడు మీ కింద సామంతుడుగా ఉండాల్సినవాడే. ప్రతి ఏడు మీకు కప్పం కట్టాల్సిన వాడు. వెంటనే ఒక దూతని హిరణ్యగర్భుడి దగ్గరకు పంపి, మీకు కట్టవలసిన పన్ను కట్టించుకోండి. ఇలాంటి విషయాల్లో రాజులు జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మడికి అసంతృప్తి, రాజుకు తృప్తి పనికిరావు. రాజు ఏదో రకంగా శత్రువుల్ని లోబరచుకొని తనరాజ్యం పెంచుకోవాలి. అవసరమయితే మీరు సైన్యంతో బయల్దేరి వెళ్ళి కర్పూరద్వీపం ఆక్రమించాలి. ముందు దూతను పంపండి.
హిరణ్యగర్భుడు మంచిగా మాట విన్నాడా సరేసరి, లేకపోతే యుద్ధంలో ఓడి చస్తారు."
ఈ మాటలు చిత్రవరుడికి బాగా నచ్చాయి. సరేనన్నాడు.
చూడండి రాజా! వాళ్ళ మదమూ, దుర్మార్గమూ, దురాశా! ఆశ వల్లే కదా అన్ని అనర్థాలూ! ఆశను జయించి, తృప్తిగా ఉండేవాడే అదృష్టవంతుడు! నేను ఊరుకోలేక. చిత్రవర్ణుడితో యిలా అన్నాను: "రమ్మనంగానే సొమ్ము వస్తుందా? చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకముండాలి. బాడు దున్న ఈనిందంటే, నువ్వు దూడను కట్టేయమంటావా? హిరణ్యగర్భుడు మహావీరుడని మరచిపోకు. నిశ్చింతగా ఉన్నవాడివి ఉండక, చెట్టు కొట్టి నెత్తిన వేసుకొంటావెందుకు? వట్టి మాటలతో రాజ్యాలు రావు. ఇప్పుడు నీవాళ్ళు నీ మెప్పుకోసం వదరుతున్నారు. కానీ, రేపు వీళ్ళ సలహా వల్ల నువ్వు కష్టాలలో పడితే ఏం చేయాలో తెలీక చుక్కలు లెక్కపెట్టాల్సిందే, అయినా కర్పూర ద్వీపం మీద పూర్తి హక్కు మా రాజుదే".
అంటే చిత్రవర్ణుడు, ఓ విషపు నవ్వు నవ్వి, "తొందరపడకు, ఎవరి హక్కో యుద్ధంలోనే తేలుతుంది. నువ్విప్పుడే మీ దేశం వెళ్ళి మీ రాజుని యుద్ధానికి సిద్దం చేయి. నీతో బాటు నా దూతగా ఈ అరుణముఖుడిని పంపుతాను" . అన్నాడు. అరుణముఖుడు (చిలుక) దీనికి ఒప్పుకోలేదు. "రాజా! నా ఎత్తు ధనం ఇచ్చినా, నేను ఈ దుష్టుడితో, అహంభావితో ప్రయాణం చేయలేను. వాడిని ముందు వెళ్ళనివ్వండి. ఆ తర్వాత నేను వెళతాను. మీ మాట కాదన్నందుకు క్షమించండి. వీడితో వెళ్తే వీడు నన్ను దోవలోనే చంపే ప్రమాదం ఉంది. అదీగాక మంచివాడితో కలిస్తే పూలతో కలిసిన దారానికి లాగా గౌరవం వస్తుంది. దుర్మార్గుడితో కలిస్తే, ఇనుముతో కలిసిన అగ్నికి సమ్మెట దెబ్బలు తగిలినట్లు కష్టాలు తప్పవు. ఇలాంటి దుర్మార్గుడితో సాంగత్యం చేస్తే పూర్వం కాకి హంస కథలో హంసలాగా అవుతుంది నా పని. ఆ కథ విను" అంటూ కథ మొదలెట్టాడు అరుణముఖుడు.