యుద్ధం
దమనకుడు చెప్పిన తీతువు కథ పూర్తయింది.
సంజీవకుడు మాత్రం, "చూడు దమనకా! నువ్వు ఎంత చెప్పినా నేను నీతో వచ్చి పింగళకుడి కాళ్ళమీద పడే ప్రశ్నేలేదు. చావుకు భయపడేవాడిని కాదు. ఏదో ఓరోజు చావు. ఎవరికయినా తప్పదు. రోజూ ఎంతోమంది చస్తున్నారు. నిన్న ఉన్నవాళ్ళు యివాళ లేరు. దీనికేమిటి భయపడేది? నాకు ప్రాణం కన్నా మానం ముఖ్యం. అందుకని, నువ్వు కథలు చెప్పి నా మనసు మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. నేను వస్తున్నాననీ, యుద్ధానికి సిద్ధంగా ఉండమనీ పింగళకుడికి చెప్పు. ఇదే నా ఆఖరి మాట" అన్నాడు.
దమనకుడు బయల్దేరి తిరిగి పింగళకుడిని చేరాడు.
"రాజా, నువ్వు చెప్పినట్టే నేను సంజీవకుడి దగ్గిరికి వెళ్ళాను. నేను చెప్పాను. అతను పొగరుగా నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. అవన్నీ నేను చెప్పనూకూడదు, మీరు విననూ కూడదు. ఎంత నచ్చచెప్పినా అతను వినలేదు. 'తను పట్టిన కుందేలుకు మూడుకాళ్ళే' అన్నట్లు మొండికెత్తాడు. నేను యుద్ధానికి వస్తున్నాను. మీరాజును సిద్ధంగా ఉండమని చెప్పమని చెప్పాడు. నేనెంత ప్రయత్నం చేసినా అతని మనసు మార్చలేకపోయాను. ఇంక మీరేం చేస్తారో అది మీ నిర్ణయం" అన్నాడు.
సంజీవకుడికీ, పింగళకుడికీ భయంకరమయిన యుద్ధం మొదలయింది. ఎద్దు తన కొమ్ములతో కుమ్మితే సింహం సొమ్మసిల్లిపడిపోతున్నది. తేరుకొని, సింహం ఎద్దుమీదికి ఎగిరి తంతే, ఎద్దు పడిపోతున్నది.
యుద్ధం జరుగుతుండగా కరటక, దమనకులు పక్కన నిలబడి వింత చూస్తున్నారు. దమనకుడు కరటకుడితో "చూశావా, నా తడాఖా!" అన్నాడు.
అకారణంగా యిలా యుద్ధం జరగడం కరటకుడికి నచ్చలేదు. "దమనకా! నిన్ను నమ్మినందుకు రాజు యిప్పుడు ఫలం అనుభవిస్తున్నాడు. ముందు నువ్వే తగుదునమ్మా అని వీళ్ళిద్దరికీ స్నేహం కలిపావు. తరువాత నువ్వే వాళ్ళ మధ్య విరోధం పుట్టించావు. నువ్వు దూరం ఆలోచించట్లేదు. ఈ పోరు మంచిది కాదు. చేతయితే యిలాంటి పోట్లాటలు మాన్పించాలి గాని పుట్టించకూడదు. నువ్వు రాజుకు నిజంగా సేవ చేయాలనుకొంటే రాజుకేది హితమో అది చెప్పాలి. అదే నీకూ మంచిది. మంచివాడికి కీడు తలపెట్టడం, చెడ్డవాడికి సహాయం చేయడం, చివరికి నిన్నే నాశనం చేస్తయ్. తెలిసి తెలియకుండా రాజుకు చెడు సలహాలు ఇవ్వకూడదు" అన్నాడు.
“అయినా నీలాంటి వాడికి బుద్ధి చెప్పబోవడం కూడా అనవసరం. వెనకటికి కొన్ని తెలివితక్కువ కోతులు మిణుగురు పురుగుల గుంపు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నామని సంతోషిస్తుంటే, దోవన పోయే పక్షి “ఇదేం పిచ్చి, చలి కాచుకోవడానికి అది నిప్పుకాదు, మిణుగురు పురుగుల దండు!" అన్నదట. “మేమేం చేయాలో మాకు తెలుసు, చెప్పేందుకు నువ్వెవర”ని ఆ కోతులు ఆ పిట్ట మీద పడి దాన్ని చంపేశాయట. లోకంలో మనకు మంచిమాటలు చెప్పే సజ్జనులు చాలా తక్కువగా ఉంటారు. మంచిమాట వినేవాళ్ళు మరీ తక్కువ. ఏదేమయినా, తన మేలు కోసం యితరులు కీడు తలపెట్టేవాడు బాగుపడడు. దానికి నందిగుప్తుడి కథే నిదర్శనం” అంటూ కరటకుడు దమనకుడికి ఆ కథ చెప్పడం ఆరంభించాడు.
No comments:
Post a Comment