రాజధర్మం

                     రాజధర్మం

ఇలా కథలు చెప్తూ కంటకుడు, దమనకుడి దుర్మార్గాన్ని బాగా తిట్టిపోశాడు.  

పక్కన ఎద్దు, సింహం భయంకరంగా యుద్ధం చేశాయి. చివరికి యుద్ధంలో పింగళకుడు, సంజీవకుణ్ణి చంపేశాడు. అతని కోపం చల్లారింది.

కొంతసేపయిన తర్వాత అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఉత్తపుణ్యానికి యుద్ధంలో దిగి సజ్జనుడయిన సంజీవకుణ్ణి చంపినందుకు ఎంతో చింతించాడు. “అడవి జంతువుల్ని రక్షించి, పోషించేవాడు అడవికి రాజు గాని నాలాంటి క్రూరుడు ఏం రాజు? ఆలోచన లేకుండా నా స్నేహితుడూ, శ్రేయోభిలాషీ సంజీవకుణ్ణి పొట్టన పెట్టుకొన్నాను. విషవృక్షమయినా నేను పెంచిన చెట్టును, నేనే నరికేయడం తప్పు. నా సేవకుడు తెలిసో తెలియకో తప్పు చేస్తే మాత్రం నయానో భయానో వాడి తప్పు వాడికి తెలియజెప్పి, మొదటి తప్పు వదిలేయాలి. మళ్ళీ అదే తప్పు చేస్తే పదవిలోంచి తీసేయాలి. అంతకంటే కఠినంగా శిక్షించటం న్యాయం కాదు. లోకం మెచ్చదు. మిగిలిన సేవకులలో కూడా రాజు పట్ల భక్తి చచ్చిపోతుంది.

ఎంతకష్టమయిన పనయినా సాధించవచ్చు కానీ మంచి సేవకుణ్ణి సంపాదించడం కష్టం. ఎంతో అప్రతిష్ఠ చేతులారా తెచ్చుకొన్నాను" అంటూ చాలా బాధపడ్డాడు.

దమనకుడు యిలా అన్నాడు “రాజా, శత్రువును చంపి యిలా దుఃఖించడం రాజులకు మంచిది కాదు. రాజు తనను బాధించేవాడి నెవడినైనా సత్వరం శిక్షించాలని పండితులు చెబుతారు. అపకారం చేసిన వాళ్ళను వదిలేయడం మునులు ధర్మం, రాజులకది ధర్మం కాదు”

రాజు కొంతసేపటికి ఊరట పొందాడు. తర్వాత బహుకాలం తన పరిజనాలతో సుఖంగా రాజ్యం చేశాడు.

అని విష్ణుశర్మ కథ ముగించి “ఈ మిత్రభేదమనే తంత్రాన్ని రాజు శత్రువుల మీద ప్రయోగిస్తే విజయం పొందుతాడు" అన్నాడు. రాజకుమారులు కథలు విని చాలా సంతోషించారు.


No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...