ఇంద్రపాలితుడు
అజన్తుదమనే ఊళ్ళో ఇంద్రపాలితుడనే వర్తకుడుండేవాడు. అతనికి ధనగుప్తుడనే స్నేహితుడు ఉన్నాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు మిత్రుడి దగ్గరకు వెళ్ళి "మిత్రమా! ఉన్నట్టుండి నేను ఊరెళ్ళాల్సొచ్చింది. మానటానికి లేదు. రేపే ప్రయాణం. నా దగ్గర అరవయి బారువలు యినుము ఉంది. అది నీ దగ్గర వదిలి వెళతాను. నీ సరుకుతో పాటు మంచి బేరం వస్తే వీలయినంత అమ్మిపెట్టు. మిగిలిన సరుకు నేను వచ్చిన తరువాత తిరిగి తీసుకుంటాను” అన్నాడు.
"అయ్యో! అదెంత భాగ్యం! నువ్వేమయినా పరాయివాడివా? నా సొమ్మొకటీ, నీ సొమ్మొకటీ కాదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. నేను నీ సరుకు జాగ్రత్త చేసి, వీలయినంత మంచి ధరకి అమ్మిపెడతాను" అన్నాడు ధనగుప్తుడు.
ఇంద్రపాలితుడు సంతోషించి, నిశ్చింతగా ఊరెళ్ళిపోయాడు.
కొన్ని రోజుల తర్వాత స్వగ్రామానికి తిరిగివచ్చి, ధనగుప్తుడి యింటికి వెళ్ళాడు. ధనగుప్తుడు మామూలు అతిథి సత్కారాలు చేశాడు.
"మిత్రమా! ఇనుము ధర పెరిగిందని విన్నాను. మన సరుకేం చేశావు?" అని అడిగాడు ఇంద్రపాలితుడు.
ధనగుప్తుడు విచారంగా ముఖం పెట్టాడు. “నీ సరుకు కొంత నా సరుకుతో కలిపి ఓ గదిలో పెట్టి తాళం వేశాను. నిన్న కొంతమంది వచ్చి “ఇనుము కావాలి, అమ్ముతారా?” అది తాళం తీయించి చూశాను. గదిలో యినుమంతా మాయమయిపోయింది. తాళం తాళంగానే ఉంది. నా సొమ్ము పోయినందుకు నాకు బాధలేదు. గానీ నీ సరుకు పోయినందుకు నేను అమితంగా బాధపడుతున్నాను” అన్నాడు. "తాళం తాళంగా ఉంటే, సరుకు ఎలా పోయిందా అని బాగా ఆలోచించాను. మా యింట్లో ఎలుకలు ఎక్కువ. నీ ఇనుమూ, నా ఇనుమూ కూడా ఆ ఎలుకలే తినేసి ఉంటాయి, సందేహం లేదు!" అన్నాడు.
ఇంద్రపాలితుడికి ధనగుప్తుడి మోసం అర్ధమయింది. కానీ ఏం చేస్తాడు, తన సొమ్ము ఎలా తిరిగి సాధించుకొంటాడు? అప్పటికి మాత్రం, "పోనీలే ధనగుప్తా, నువ్వింతగా చెప్పక్కర్లేదు. నువ్వు నాకు కొత్తవాడివా? నేను నీకు కొత్తా? మనకెంత ప్రాప్తమో అంతే. దీన్ని గురించి నువ్వెక్కువ బాధపడకు" అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
అతనితో స్నేహం మాత్రం ముందటిలాగే కొనసాగించాడు. ఓసారి ఇంద్రపాలితుడు ధనగుప్తుడి యింట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో వీధిలో ఎవరో మామిడిపళ్ళు అమ్ముతూ వచ్చాడు. ధనగుప్తుడి కొడుకు పసివాడు పళ్ళు కావాలని మారాం చేయసాగాడు. ఇంద్రపాలితుడు 'పళ్ళు నేను కొనిపెడతాను పద' అని ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని వీథిలోకి తీసుకెళ్ళాడు. వీళ్ళు వీథిలోకి వెళ్ళేటప్పటికి ఆ పళ్ళబండివాడు కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. బండి వెనకాల కొంతదూరం పిల్లాణెత్తుకొని నడిచాడు ఇంద్రపాలితుడు. పిల్లాణ్ణి ఒకచోట దాచేసి వట్టి చేతులతో ధనగుప్తుడి యింటికి తిరిగి వచ్చేశాడు.
"పిల్లాడెక్కడ?" అన్నాడు ధనగుప్తుడు.
“వాడా? పళ్ళు కొనేందుకు ఒక నిమిషం వాణ్ణి చంకలోంచి దించాను. ఇంతలో ఓ గద్ద వచ్చి పిల్లాణ్ణి ఎత్తుకుపోయింది. నా పిల్లాడిని కాకుండా నీ పిల్లవాడిని తీసుకెళ్ళిందే అని నాకు ఎంతో బాధగా వుంది” అన్నాడు ఇండ్రపాలితుడు.
"ఓరి దిష్టివాడా, పిల్లాడి వంటి మీద ఉన్న బంగారునగలు కాజేయడానికి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావు? నాలుగు సొమ్ముల కోసం పసిపిల్లవాడిని నువ్వే పొట్టను పెట్టుకొన్నావు. లేకపోతే పిల్లవాణ్ణి గద్ద ఎత్తుకుపోవటం ఎక్కడయినా జరుగుతుందా? దుర్మార్గుడా, నీ పని పట్టిస్తాను చూడు!" అంటూ ధనగుప్తుడు శాపనార్థాలు పెడుతూ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు.
న్యాయాధికారి ఇంద్రపాలితుణ్ణి పిలిచి జరిగినదేమిటని ప్రశ్నించాడు. ఇంద్రపాలితుడు మళ్ళీ ఆమాటే చెప్పాడు పిల్లాడిని గద్ద ఎత్తుకుపోయిందని.
"ఏమిటి నువ్వు చెప్పేది? పిల్లాడిని గద్ద ఎలా ఎత్తుకుపోతుందయ్యా?" అని న్యాయాధికారి గద్దించాడు.
"అయ్యా, నేను ఈయన యింటిలో అరవై బారులు
ఇనుము పెట్టి వెళితే దాన్ని ఎలుకలు తినేశాయట! అది
సంభవమయితే, పిల్లాణ్ణి గద్ద తన్నుకుపోవటం సంభవం
కాదంటారా?” అన్నాడు ఇంద్రపాలితుడు.
దాంతో జరిగిన కథ అందరికీ అర్థమయింది. ధనగుప్తుణ్ణి మందలించి, అతని దగ్గర్నుంచి ఇనుమునూ, ఇంద్రపాలితుడు దాచినచోటు నుంచీ పిల్లవాడినీ తెప్పించి, ఇనుమును ఇంద్రపాలితుడికీ, పిల్లాడిని ధనగుప్తుడికీ యిప్పించారు. ఇంద్రపాలితుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నించినందుకు ధనగుప్తుడికి తగిన శిక్ష కూడా విధించారు.
No comments:
Post a Comment