పావురం - డేగ
మధురా నగరంలో ఓ గుడి దగ్గర ఓ పావురాల జంట కాపురముండేది. ఓ రోజు ఆ పావురాలు గుడి మంటపం
దగ్గర తిరుగుతుంటే ఒక డేగ వాటిని చూసింది. ఎలాగయినా వాటిని పట్టుకొని చంపాలని చాలాసేపు ప్రయత్నం చేసింది. గుడి రక్షకులు అక్కడే ఉండటం వల్ల, డేగ పావురాలను పట్టుకోలేక పోయింది. కొంతసేపయింతర్వాత “సరేలే! ఈ పావురాలు ఎక్కడికి పోతాయి? వంటింటి కుందేళ్ళలా ఇక్కడే ఉంటాయి గదా! మరోసారి వచ్చి వీటిని చంపచ్చు" అనుకుని డేగ ఎగిరిపోయింది.
ఇదంతా చూస్తున్న ఆడ పావురానికి భయం వేసింది. 'చూశావా, డేగ యివాల్టికయితే మనల్ని వదిలి పెట్టిపోయింది. కానీ, ఎంత కోపంగా వెళ్ళిపోయిందో చూశావా? అది ఇంక ఎప్పుడూ మనమీద కన్ను వేసే ఉంచుతుంది. మనం ఇక్కణ్ణించి వెళ్ళిపోకపోతే, అది మనల్ని బతకనియ్యదు. ముందే జాగ్రత్త పడటం మంచిది' అంది తన భర్తతో.
మగపావురం ఈ మాటలు లెక్కచెయ్యలేదు. 'ఎందుకిలా అనవసరంగా భయపడతావ్? నీకు నా బలం తెలియదు. ఉన్న ఊరూ, కన్నతల్లి ఒక్కలాంటివారు. డేగకు భయపడి పారిపోతే నలుగురూ మనల్ని చూసి నవ్వుతారు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది తప్పా ఎంత భయపడి ఏం లాభం? సుఖదుఃఖాలు ఈశ్వరేచ్ఛ బట్టి కలుగుతాయి, కంగారుపడకు. ఎంతటి బలమయిన పక్షి అయినా, నాకు ఎదుటపడటానికి జంకుతుంది. ఈ డేగ ఎంత? అదీ మనలాగా పక్షే కానీ, దయ్యం కాదు. అది మన జోలికి వస్తే ఒక్క ముక్కుపోటుతో దాన్ని చంపేస్తాను. గోళ్ళతో చీల్చి చెండాడుతాను. నువ్వే అది చూసి మెచ్చుకొంటావ్. నా మాట విని నిశ్చింతగా ఉండు" అన్నాడు. భర్త కెదురు చెప్పలేక ఆడపావురం కూడా అప్పటికి ఊరుకొంది.
కానీ ఆ మర్నాడు ఉదయమే డేగ మళ్ళీ వచ్చింది. గుడి ప్రహరీ గోడ మీద కాపువేసి, పొద్దున్నే పావురాల జంట బయటికి రాగానే, వాటి మీదికి దూకి, మగపావురాన్ని ముక్కున కరుచుకుపోయి తినేసింది. ఆడపావురం అతి కష్టం మీద గుడిలోకి దూరి తప్పించుకొంది.
అందువల్ల, బలవంతుడితో తలపడటం మంచిది కాదు. అది నాశనానికే.
అంతేకాదు, ఎంత బలమున్నా మాట దురుసుతనం పనికిరాదు. గొడ్డలితో కొట్టేసినచెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటతో విరిగిన మనసు సరిచేయలేం. దీనికీ ఉదాహరణగా ఓ కథ ఉంది. అదీ విను' అంటూ మరో కథ చెప్పాడు హిరణ్యగర్భుడు.
No comments:
Post a Comment