పులి తోలు కప్పుకొన్న గాడిద
కరిపురం అనే ఊర్లో విలాసుడనే రజకుడుండేవాడు. అతను ఒక గాడిదను కొనుక్కొని, దాన్ని బాగా మేపేందుకు ఓ ఉపాయం ఆలోచించాడు. రాత్రివేళల ఆ గాడిద మీద ఒక పులితోలు కప్పి దాన్ని చీకట్లో పంటచేల వైపు పంపించేవాడు. పొలాల మీద పంటకు కాపలా కూర్చొన్నవాళ్ళు దాన్ని చూసి పులి అని భయపడి దగ్గరకి వెళ్ళటానికి జంకేవారు. ఈ ఉపాయం కొన్నాళ్ళు పనిచేసింది. గాడిద బాగా మేసి బలిసింది.
రోజూ యిలా తమ పైరు నష్టమౌతుంటే రైతులకూ బాధే. ఒకరాత్రి ఒకరైతు, గుండె దిటవు చేసికొని, ఈ రాత్రి ఎలాగయినా పులిని పట్టి చంపాలని, బయల్దేరాడు. తనూ ఒక బూడిదరంగు దుప్పటి కప్పుకొని, చీకట్లో కనబడకుండా తన పొలం గట్టున చెట్టునీడలో కూర్చొన్నాడు. అతని చేతిలో విల్లు, అంబులూ సిద్ధంగా ఉన్నాయి, పులి కనబడితే చంపేందుకు. రోజులాగే, గాడిద చేనులో పడి మేయటానికి వచ్చింది, పులితోలు కప్పుకొని. చెట్టుకింద కూర్చొన్న రైతును చూసింది. బూడిదరంగు దుప్పటితో, చీకట్లో కూర్చొన్న ఆ రైతు ఆకారాన్ని చూస్తే, దానికి అది తనలాంటి మరో గాడిదలాగా కనిపించింది. తనలాగే రాత్రిపూట చేను మేయటానికి వచ్చిందనుకొంది. దగ్గరకు వెళ్ళి, పలకరింతగా, ఓండ్ర పెట్టింది.
దాని కూత వినగానే, అప్పటిదాకా భయపడుతూ కూర్చొన్న రైతుకు, భయం పోయింది. 'ఈ పనికిమాలిన గాడిదను చూసి యిన్నాళ్ళు పులి అని భయపడుతూ నష్టపోయాను, ఎంత మూర్ఖుణ్ణి!' అనుకొని ఒకే ఒక్క బాణం వేసి, దాని ప్రాణం తీశాడు.
నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉంటే సురక్షితంగా ఉండేది! 'అందుకే అయినచోటా, కానిచోటా నోటి దురుసుతనం చూపిస్తే ప్రమాదం.' అని కథ ముగించాడు హిరణ్యగర్భుడు.
No comments:
Post a Comment