కాకి - గుడ్లగూబ
దండకారణ్యంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలలో ఎన్నో వందల వేల పిట్టలు గూళ్ళు కట్టుకొని ఉండేవి. ఆ ప్రాంతంలో ఉన్న కాకులు రాజు కూడా ఆ చెట్టు మీదే గూడు కట్టుకొని సుఖంగా ఉండేవాడు. ఈ మర్రిచెట్టుకు దగ్గర్లో, ఓ పెద్ద కొండగుహలో ఉపమర్దనుడు అనే పేరుగల గుడ్లగూబ ఉండేది. అది ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని వేల గుడ్లగూబలకు రాజు. ఆ గుడ్లగూబలకూ, కాకులకూ ఎప్పుడూ విరోధమే.
ఒకరోజు రాత్రి ఉపమర్దనుడు తన మంత్రులనూ, సేనాపతులను పిలిపించి, మంతనాలు జరిపి, అకస్మాత్తుగా నిష్కారణంగా మర్రిచెట్టు మీదికి దాడిచేశాడు. రాత్రివేళ గదా, కాకులు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాయి. ఉపమర్దనుడి గుడ్లగూబల సైన్యం చెట్టు మీద ఉన్న కాకిగూళ్ళన్నీ పడగొట్టి, కాకులని పొడిచి, పొడిచి చంపేశాయి. కొన్ని కాకులకు రెక్కలు తెగిపోయాయి. కొన్నింటికి ముక్కులు విరిగిపోయాయి. కొన్ని వేల కాకులు చచ్చిపోయాయి. గుడ్లగూబలకు అప్పటికి గాని కళ్ళు చల్లబడలేదు. అవి తిరిగి తమ గుహలోకి వెళ్ళిపోయాయి.
తెల్లవారింది. ఎలాగో గుడ్లగూబల దాడినుంచీ తప్పించుకొని, బతికి బయటపడ్డ కాకుల రాజు ఆ చెట్టులో
ఉన్న గూళ్ళన్నీ తిరిగి చూశాడు. ఏదో మహాప్రళయం జరిగినట్లు, ఎక్కడ చూచినా చచ్చిన కాకులే పడి ఉన్నాయి. రాజు గుండె నీరయిపోయింది. తన సంతానం, తన పరివారం, తన మంత్రులూ, తన జాతి కాకులూ వేలాదిగా గుడ్లగూబల దాడికి బలి అయిపోయాయి. ఆ చెట్టు మీద ఉన్న కాకుల్లో సగానికి సగం గుడ్లగూబల అత్యాచారంలో చనిపోయాయని తెలిసి రాజు ఎంతో దుఃఖించాడు.
ఎలాగో బతికిపోయిన మిగిలిన కాకులన్నీ రాజు చుట్టూ చేరాయి. మంత్రులు రాజును ఓదార్చారు. "స్వామీ, నీకు ఏ హానీ జరగలేదు. అదే మాకు పదివేలు. దేవుడు మన శత్రువులతో చేరి మనకు యింత భయంకరమయిన నష్టం కలిగించాడు. కానియ్యండి. ఏనాడు ఏ పాపం చేశామో, ఇవాళ ఈ శిక్ష అనుభవిస్తున్నాం. కాలం కలిసి రాకపోతే చేయగలిగిందేమీ లేదు. ఇన్ని కాకులను నిష్కారణంగా చంపిన ఈ గుడ్లగూబలు వాటి పాపానికి ఫలం అనుభవించకుండా పోవు. మనం నిద్రలో ఉన్నప్పుడు, మన వాళ్ళు ఇంత మంది శత్రువు చేతిలో చచ్చిపోవడం మన దురదృష్టం. మనకిలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. కానీ రాజా, నువ్వు దిగులుపడదు. నీ తోడు మేము ఉన్నాం. నీ ఆదేశం ప్రకారం నడుచుకొంటాం. మనకు మంచికాలం వచ్చినప్పుడు, ఆ గుడ్లగూబల గుంపుమీదికి యుద్ధానికి వెళ్ళి, దేవుడు మేలుచేస్తే, వాటి పనిపడదాం. లేదంటే యుద్ధంలోనే ప్రాణాలు త్యాగం చేసి, కీర్తి సంపాదించుకొందాం. కానీ, ఇప్పుడు శత్రువు మనకంటే చాలా బలవంతుడుగా ఉన్నాడు, వాడిని గెలవలేం. వేరేచోటికి వెళ్ళిపోయి, కొన్నాళ్ళు ఆగి చూద్దాం. ఎవరయినా బలవంతుడి సహాయం సంపాదించి, సరయిన సమయంలో ఈ గుడ్లగూబలను దెబ్బ తీద్దాం" అంటూ తమకు తోచిన సలహా చెప్పారు.
కాకులకు చిరంజీవి అనే మంత్రి ఉన్నాడు. అతను చాలా తెలివయినవాడు. బాగా ఆలోచించి, చిరంజీవి రాజుకు ఒక సలహా చెప్పాడు. "రాజా! నువ్వు బుద్ధిశాలివని మాకందరికీ తెలుసు. అయినా అకస్మాత్తుగా పెద్ద కష్టం వచ్చినపుడు ఎంత మేధావికయినా మనసు పరిపరివిధాల పోతుంది, సరయిన ఉపాయం ఆలోచించటం కష్టమవుతుంది. అందుకని నే చెప్పే మాటొకటి ఆలోచించు, ఇప్పుడయితే మనం చాలా క్లిష్టమయిన పరిస్థితిలో ఉన్నాం. శత్రువు మీద ఎదురుదాడి చేసే స్థితిలో లేము. కొంచెం ఆగాలి. ఈ లోపల మనం ఒక పనిచేద్దాం. మీరు అనుమతిస్తే నేను శత్రువుల గుహకు వెళ్ళి, వాళ్ళ ఆశ్రయం కోరుతున్నట్లు నటించి, ఆశ్రయం సంపాదించి తరువాత కథ నడిపిస్తాను.
మీరందరూ నాకో సహాయం చెయ్యాలి. ఎక్కడికయినా వెళ్ళి కొంచెం రక్తం సంపాదించి అది నా ఒంటికి పూయండి. ఆ తర్వాత మీరంతా యీ చెట్టు వదిలిపెట్టి, అల్లంత దూరంలో ఉన్న 'ఋష్యమూకం' అనే కొండమీదికి వెళ్ళిపోయి అక్కడ హాయిగా కొన్నాళ్ళు కాలక్షేపం చేయండి. అపైన మీరేం చేయాలో తరువాత నేను వచ్చి చెప్తాను” అన్నాడు చిరంజీవి.
కాకులన్నీ వెళ్లి వెదికి రెండు ఎలుకల్ని పట్టి చంపి, వాటి కొత్త నెత్తురు చిరంజీవి వంటికి పట్టించాయి. ఆ తర్వాత అవి సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోయాయి.
చిరంజీవి మాత్రం, చీకటి పడేదాకా ఆగి, ఆ తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, బిక్కు బిక్కుమంటూ, ఎలాగో ధైర్యం చేసి ఆ గుడ్లగూబల గుహ దగ్గరకు చేరాడు. ఆ గుహ లోపల చాలా పెద్దది కానీ, లోపలికెళ్ళే ద్వారం చాలా చిన్నది. ఆ ద్వారం దగ్గిరకి వెళ్ళి చిరంజీవి 'కావు కావు'మని దీనంగా కేకపెట్టాడు.
అనుకోకుండా వినిపించిన ఆ కేకకు లోపల గుడ్లగూబలు ఉలిక్కిపడ్డాయి. ఓ గుడ్లగూబ బయటికి వచ్చి కాకిని తీసుకెళ్ళి, తమ రాజు ఉపమర్దనుడి ముందు నిలబెట్టింది. రాజు', 'ఎవరు నువ్వు ఈ రక్తమేమిటి?' అని అడిగాడు.
చిరంజీవి ఏడుపు నటిస్తూ యిలా అన్నాడు: "నేను కాకుల రాజు ప్రధానమంత్రిని, నా పేరు చిరంజీవి. ఈ రోజు పొద్దున మా రాజు మమ్మల్నందర్నీ పిలిచి, 'కాకులకింత నష్టం జరిగింది. ఇప్పుడేం చేద్దాం?' అని సలహా అడిగాడు. నేను 'ఉపమర్దనుడు మహా బలవంతుడు. మనం ఆయనకి లొంగిపోయి, ఆయన కాళ్ళమీద పడి శరణు వేడుకొందాం. ఆయన మనల్ని రక్షించగలదు. నువ్వేదో పెద్ద రాజునవి గర్వపడక, వెంటనే ఉపమర్దనుడి శరణుకోరు' అని మా రాజుకు సలహా యిచ్చాను. ఆ దుర్మార్గుడు నా మాట చెవిపెట్టలేదు సరికదా! తన పరివారం చేత నన్ను తిట్టించి, కొట్టించి, ముక్కులతో పొడిపించాడు. ఒళ్ళంతా గాయాలతో నేను నేలకొరిగాను. నేను చచ్చిపోయాననుకొని, ఆ రాజు మిగతా కాకులతో కలిసి ఎటో ఎగిరిపోయాడు. అలాంటి దుష్టులు రాజులుగా ఉండబట్టే, ఈ ప్రపంచం యిలా వుంది! కొన ఊపిరితో ఉన్న నేను, ఏకాకిగా మిగిలిపోయాను. ఎలాగయినా మీ దగ్గరికి చేరి మా రాజు దుష్టచర్యలు, మీకు వివరించి, ప్రాణం వదిలేయాలని, నేను కష్టం మీద ఇక్కడికి చేరాను. నాకింక మీరేదిక్కు, సరి వాళ్ళలో యింత అవమానం పొందిన తర్వాత ఏ ముఖం పెట్టుకు బ్రతికేది? ఎవరికోసం బ్రతకాలి? చెప్పాల్సిన ఈ నాలుగు మాటలూ మీకు చెప్పేందుకు ఇంతవరకూ బ్రతికి ఉన్నాను. పైగా, ఇంత వరకూ నాకు మీలాంటి మహానుభావుల్ని దర్శించే అదృష్టం పట్టలేదు. ఇవాళ ఆ కోరికా తీరింది. మీకు తెలియదు కానీ, నేను రోజూ మా రాజు దగ్గర, మీ గొప్పతనం తెగపొగుడుతుండేవాణ్ణి. ఆ ధూర్తుడికి అందుకే నామీద కోపం. వాడికి నేను చేసిన సేవంతో వ్యర్ధం. దాని బదులు నేను మొదట్నుంచి మిమ్మల్ని సేవించుకొని ఉంటే ఎంతో సుఖపడేవాణ్ణి".
ఇలా చిరంజీవి మాయమాటలు ఉపన్యానం దంచేశాడు.
ఉపమర్దనుడి మంత్రులకి చిరంజీవి ధోరణి కొంచెం అనుమానాస్పదంగానే కనిపించింది. "ఓ రాజా! వీడి మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. వీడి బోటి వాళ్ళని మనం చేరనివ్వకూడదు. చేరిస్తే దూదిగుట్టలో నిప్పురవ్వను చేర్చినట్టే. క్షణాల్లో కొండంత దూది, బూడిద అయిపోతుంది" అని తమ రాజుకు సలహా యిచ్చారు. కానీ, ఉపమర్దనుడు వినలేదు.
“నాకు చూస్తే వీడు మంచివాడుగానే కనిపిస్తున్నాడు. జాతి వేరు కాబట్టి శత్రువు అనుకోవద్దు. సత్యం మాట్లాడుతున్నారు. ఇలాంటి సజ్జనుడు మన దగ్గరకి తనే రావటం ఓ రకంగా మన అదృష్టం. పాతకథలు మర్చిపోయి, ఇతనితో స్నేహం చేద్దాం. ఇది నా ఆజ్ఞ" అని రాజు తన మంత్రుల నోళ్ళు మూయించాడు.
ఈ మాట విని చిరంజీవి రాజు కాళ్ళ మీద పడిపోయాడు. "ఓహోహో ఎంత దొడ్డబుద్ధి! నేను నిజంగా ధన్యుణ్ణి, ఉదారబుద్ధి గల మీలాంటి రాజులు యింకా కొందరుండబట్టే ఈ ప్రపంచం ఇంకా నిలబడి ఉంది. ఈ భూమి మీద మిగతా రాజులందరూ మీనించి నేర్చుకోవాల్సిందెంతో ఉంది. వీళ్ళందరూ నన్ను గురించి చెడుగా ఎంత చెప్పినా, లక్ష్యపెట్టకుండా, నాకు ఆశ్రయం ఇచ్చిన మీ గొప్పతనం పొగడడానికి మాటలు చాలవు" అంటూ మరికొన్ని యిచ్చకాల మాటలు చెప్పాడు. రాజు ఉబ్బిపోయాడు.
ఆనాటినుంచీ చిరంజీవి, ఉపమర్దనుడికి సన్నిహితుడయిపోయాడు. ఆ గుహ రహస్యాలు, ఆ గుడ్లగూబల అలవాట్లూ అన్నీ జాగ్రత్తగా కనిపెట్టాడు. ఆ గుహకి రక్షణ బాగా ఉంది గానీ, అంత పెద్ద గుహకీ, ఒకే చిన్న ద్వారం అని గమనించాడు.
ఓరోజు పగటిపూట, గుడ్లగూబలన్నీ గుహలో ఆదమరచి నిద్రలో ఉండగా, చిరంజీవి బయటకు వచ్చాడు. ఆ చుట్టుపక్కల అవుల గుంపులున్న చోట్లకు వెళ్ళి బోలెడంత అవుపేద పోగుచేసి దాన్ని కాళ్ళల్లో, ముక్కుల్లో యిరికించి గుహ దగ్గరకు తెచ్చి, గుహ ద్వారం దగ్గర వేశాడు. కొంత గుహ ద్వారానికి పట్టించాడు.
ఆ తర్వాత ఎగురుకొంటూ వెళ్ళి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్న తన కాకుల గుంపును చేరాడు. కాకుల రాజుకు నమస్కారం చేశాడు. "రాజా! నేను నానా పాట్లుపడి ఉపమర్దనుడి కొలువులో చేరి, వాడి విశ్వాసం సంపాదించాను. వాడి అనుచరులంతా నన్ను ఎలా చంపాలా, బాధించాలా.. అని ఎంత ప్రయత్నించినా, నేను ఓపిగ్గా అదంతా తట్టుకొని నిలబడ్డాను. వాళ్ళు తిండిపెట్టినా, పెట్టకపోయినా అలాగే కాచుకొని కూర్చొన్నాను. నాతో స్నేహం వద్దని, మంత్రులెంత చెప్పినా, ఆ రాజు వినలేదు. వాడి కర్మ. వాళ్ళకు మంచిరోజులు అయిపోయినాయి. ఇప్పుడు మనకో మంచి అవకాశం వచ్చింది.
"మనందరం కలిసి గుహ దగ్గరకు వెళదాం. గుహ ద్వారం దగ్గిర నేను ఏర్పాటుచేసి వచ్చిన ఆవుపేడ రాసి వచ్చాను. అది ఎండి పిడకలా తయారయి ఉంటుంది. మనందరం తలా ఒక కట్టెపుల్లా కాల్చి దాన్ని ముక్కున పట్టుకొని గుహముందు పడేస్తే, ఆ అగ్ని బాగా రగులుకొని గుహలో పడుకొని ఆదమరచి నిద్రపోతున్న గుడ్లగూబల ప్రాణాలు తీయటం ఖాయం. ఒక్కటిగూడా తప్పించుకొనేందుకు వీలు ఉండదు. అందరూ కదలండి. లేకపోతే మంచి తరుణం మించిపోతుంది" అన్నాడు. చిరంజీవి.
కాకులన్నీ కాలే కట్టెలు ముక్కున కరుచుకొని గుహ దగ్గరికి ఎగిరివెళ్ళాయి. పెద్ద కార్చిచ్చు ఏర్పడి, బయటపడే మార్గం కూడా లేక గుహలో గుడ్లగూబలన్నీ ఆ చిచ్చులో కాలిపోయాయి!
"రాజా! ఈ కథ వల్ల నేను చెప్పదలచుకొన్నదేమంటే, ఎరగని వాళ్ళ తియ్యటి మాటలు నమ్మి దగ్గిర చేర్చుకోవటం వల్ల ముప్పు తప్పదు. ఈ నీలవర్ణుడి తేనెమాటలు నువ్వు నమ్మకు. ఇతనేదో తెలివిగలవాడు, మనకు యుద్ధ సమయంలో సహాయం చేస్తాడనుకొంటున్నావు నువ్వు. సహాయం మాట దేవుడెరుగు, అపాయం కలిగించకుండా ఉంటాడని కూడా నమ్మకం లేదు. నువ్వు విన్నా సరే, వినకపోయినా సరే, నేను చెప్పాల్సిన హితవు నేను చెప్తున్నాను. నువ్వు తక్షణమే ఈ నీలవర్ణుణ్ణి చంపించేయి. అప్పుడే పీడ విరగడవు తుంది" అంటూ మంత్రి తన ఉపన్యాసం ముగించాడు.
ఈ మాటలన్నీ విని హిరణ్యగర్భుడు చిరునవ్వు నవ్వాడు.
“నువ్వు చెప్పింది నిజం, కాదనను. కానీ కొత్తవాళ్ళు అందరూ నమ్మదగ్గవాళ్ళు కాదనటం సరికాదు. ఇతను ఇంతవరకూ మనకే అపకారమూ చేయలేదు. గుణాల బట్టి చూడాలి కానీ, జాతి బట్టే ఫలానావాడు దుర్మార్గుడనటం ఎలా? ఒక్కొక్కప్పుడు తనవాడే కీడు చేయొచ్చు. పరాయివాడే మేలు చేయచ్చు. మన శరీరంలోనే రోగం పుడుతుంది, దానికి మందు అడివిలో చెట్టునించీ వస్తుంది. ఇతను పాపం ధార్మికుడు.
అకారణంగా ఇతన్ని చంపిస్తే లోకం ఏమంటుంది? ఇప్పుడు మనం బలమైన శత్రువుతో యుద్ధం తలపెట్టాం. గెలవాలంటే, సహాయం చేయగలవాళ్ళందరినీ మనతో కలుపుకోక తప్పదు. మనసులో నమ్మినా, నమ్మక పోయినా, నమ్మినట్టే నటించి, మన పని పూర్తయిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించవచ్చు. ఒక ముల్లును మరొక ముల్లుతో తీసేసి, తర్వాత రెండు ముళ్ళూ అవతల పారేస్తాం కదా? అలాగే యితని సహాయంతో శత్రువును జయించి, తర్వాత ఇతని సంగతి చూసుకొందాం.
పూర్వం యిలాగే ఒక ఎలుక, ఓ పిల్లితో అవసరార్ధం స్నేహం చేసి, పని జరిగిన తర్వాత దాన్ని వదిలేసిన కథ ఒకటి ఉంది, విను చెప్తాను” అని కథ మొదలెట్టాడు హిరణ్యగర్భుడు.