గాలిమేడలు
అయోధ్యానగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణు డుండేవాడు. అతను పౌరోహిత్యం చేసేవాడు. ఓరోజు ఎవరింటికో శ్రాద్దకర్మ చేయించటానికి వెళితే అక్కడ ఒక కుండెడు పేలపిండి అతనికి దానంగా లభించింది. ఆ యింట్లోనే మంచి పద్రషోపేతంగా భోజనం దొరికింది. భోజనం చేసి, కుండ చంకన పెట్టుకొని తనింటి దోవ పట్టాడు. భుక్తాయాసం వల్ల నడవలేక దోవలో ఒక యింటి అరుగు మీద కూలబడ్డాడు. తన అంగ వస్త్రాన్ని చుట్టకుదురుగా చేసి దానిమీద కుండను భద్రంగా ఉంచాడు. కుడిచేత్తో ఒక కర్ర పెట్టుకొన్నాడు, కుండనెవరయినా ఎత్తుకుపోవటానికి వస్తే బెదిరించేందుకు. ఎడమచేయి తలకింద దిండుగా పెట్టుకొని ఆ యింటి అరుగుమీదే నిద్రలోకి జారుకున్నాడు. ఆ యిల్లు ఒక కుమ్మరిది. ఆ కుమ్మరి తను తయారు చేసిన కుండలు అదే అరుగు మీద ఒక మూల పేర్చుకొన్నాడు. వాటికి పక్కగా దేవశర్మ పడుకొన్నాడు.
నిద్రలోకి జారుతుండగా అతనికి బోలెడు ఆలోచనలు! "ఈ పిండిని బాగా ధరలు పెరిగిన సమయంలో అమ్మి ఆ డబ్బుతో ఓ మేకపిల్లను కొనాలి. కొన్నేళ్ళకది పిల్లలు పెడుతుంది. మరి కొన్నేళ్ళకు ఆ పిల్లలు కూడా పిల్లల్ని పెడతాయి. ఇలా కొంతకాలానికి నా దగ్గర కొన్ని వందల మేకలు చేరతాయి. వాటినన్నిటినీ అమ్మేసి ఓ వంద మంచి అవులని కొంటాను. మెల్లిమెల్లిగా ఆ నూరు ఆవులు పెద్దమందగా వృద్ధి పొందుతాయి. బాగా కొని వ్యవసాయం చేస్తాను. కొన్ని సంవత్సరాలలో నేను కోటీశ్వరుణ్ణవుతాను. అప్పుడు ఊళ్ళో ధనవంతులంతా 'మేము పిల్లనిస్తాం, మేము పిల్లనిస్తాం' అంటూ నా చుట్టూ తిరుగుతారు. మంచి అందగత్తెనూ, గుణవంతురాల్నీ చూసి మాకు మన్మథుడి లాంటి అందమైన కొడుకు పుడతాడు. వాడికి 'సోమశర్మ' అని మా నాన్న పేరే పెడతాను. వాడు యిల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తుంటాడు. నా భార్య వాడిని పట్టుకోకుండా, యితర పనుల్లో మునిగిఉంటుంది. నాకు కోపం వచ్చి ఈ చేతికర్రతో నాలుగు తగిలిస్తాను" అని అలా కల కంటూనే తన కుడిచేతిలో పట్టుకొన్న కర్రతో తన పిండికుండను కొట్టాడు. అది బద్దలయిపోయి, పిండి మట్టిపాలయింది. కర్ర దెబ్బలు అరుగుమీద కుమ్మరి పేర్చుకొన్న కుండలకు కూడా తగిలి వాటిలో కూడా కొన్ని కుండలు పగిలిపోయాయి.
ఆ చప్పుడుకు లోపలినుంచీ కుమ్మరివాడు వచ్చి, కుండలు పగలగొట్టిన, బ్రాహ్మణ్ణి లేపి తిట్టి, కొట్టీ అక్కణ్ణించి గెంటేశాడు.
కనక, ముందెప్పుడో జరగబోయే వాటి గురించి పగటి
కలలు కంటూ కూర్చొంటే, ఇప్పుడు చేసుకోవాల్సిన పనులు
చెడగొట్టుకుంటాం, అన్నాడు దీర్ఘదర్శి,
రాజు దీర్ఘదర్శి మాట కాదనటానికి సందేహించాడు. మునుపొకసారి అలాచేసి భంగపడ్డాడు కదా! "మంత్రీ! నువ్వు చెప్పింది బాగానే ఉంది. మేఘవర్ణుడిని కర్పూరద్వీప రాజ్యానికి రాజుగా చేసే ఆలోచన విరమించుకొందాం. కానీ కర్పూరద్వీపం పరిపాలించేందుకు సరయినవాళ్ళు మన వాళ్ళలో ఎవరున్నారో నువ్వే చెప్పు" అన్నాడు.
“రాజా, మనం హిరణ్యగర్భుడిని నిజంగా మన బలంతో గెలవలేదు. అతన్ని మోసం చేసి గెలిచాం. అతను చాలా బలవంతుడు. అతని ప్రజలు అతనికోసం ప్రాణాలిస్తారు. తాత్కాలికంగా, యుద్ధంలో ఒక్కసారి ఓడినంత మాత్రాన అతను. చేతులకు గాజులు తొడుక్కుని ఊరితే కూర్చోడు. మళ్ళీ బలం కూడగట్టుకొని, సైన్యాన్ని పెంచుకొని, నేడో రేపో అవకాశం చూసి మనమీద దాడిచేసి, తన రాజ్యం తను గెలుచుకొనే ప్రయత్నం ఈసారి మన మోసాలేవీ పనిచెయ్యకపోవచ్చు. హిరణ్యగర్భుడి మంత్రి సామాన్యుడు కాదు, గొప్ప సమర్ధుడు. క్రితంసారి రాజుకూ, మంత్రికీ కలిగిన అభిప్రాయభేదాల వల్ల వాళ్ళు ఓడిపోయారు. కానీ, ఈసారి ద్దరూ ఒక తాటిమీద నడిచి, మనతో యుద్ధానికి వస్తే మనం గెలవటం చాలాకష్టం. రాబోతున్నది వర్షాకాలం. నీటిపక్షులు కాబట్టి వాళ్ళకు వానాకాలం యుద్ధానికి అనుకూలం.
నేలపక్షులం గాబట్టి మనకు ప్రతికూలం. మళ్ళీ యుద్ధంచేసి, నానాకష్టాలు, నష్టాలూ పడటం కంటే, ఎలాగూ మనం ఓసారి గెలిచిన కీర్తి సంపాదించుకొన్నాం కాబట్టి హిరణ్యగర్భుడితో యిక సంధి చేసుకొని అతని రాజ్యం అతనికే అప్పజెప్పటం మంచిది. లేకపోతే, ఆ రాజు తన మంత్రి సహాయంతో మనమీదికి మళ్లీ యుద్ధానికి రావటం ఖాయం. ఈసారి, మన మోసాలు పనిచేయకపోతే, వాళ్ళు నిజానికి మనకంటే బలవంతులు కాబట్టి మనల్ని ఓడించవచ్చు. అంచేత వాళ్ళతో ముందే సంధి చేసుకొని, స్నేహంగా మసలుకోవటమే నయం” అన్నాడు మంత్రి.
రాజుకు యివి పిరికిమాటలుగా తోచాయి. ఇంక ఆగలేకపోయాడు.
"మంత్రీ! నువ్వు చెప్పేది లోకవిరుద్ధంగా ఉంది. ఏదేదో ఊహించుకొని, భయపడి, గెలుచుకొన్న రాజ్యాన్ని మళ్ళీ శత్రువు చేతిలో ఎలా పెడతాం? యుద్ధంలో ఓడి, పారిపోయి, కొన ఊపిరితో ఎలాగో, ఎక్కడో బతుకుతున్న హిరణ్యగర్భుడు నన్నేం చేస్తాడు? నామీద యింకేం యుద్ధం చేస్తాడు? వాడి పని అయిపోయింది. గెలుచుకొన్న రాజ్యం వదలిపెట్టే ప్రశ్నే లేదు. ఇంక నువ్వు ఈ విషయం మాట్లాడొద్దు" అంటూ కోపంగా వెళ్లిపోయాడు.
"ఈ సమాచారాలన్నీ మీకు చెప్పటానికి నేను తిరిగివచ్చాను” అని ముగించాడు ధవళాంగుడు.
రాజు హిరణ్యగర్భుడూ, మంత్రి సర్వజ్ఞుడూ అతన్ని పంపేసి మళ్ళీ ఆలోచనల్లో పడ్డారు.
మంత్రి, “రాజా! ఇప్పటికే మనం యుద్ధంలో బాగా దెబ్బతిని ఉన్నాం. మనం ఒంటరిగా మరోసారి యుద్ధం చేయగల పరిస్థితిలో లేము. ఇలాంటి పరిస్థితిలో మనం ఎవరయినా బలవంతుడైన రాజుతో స్నేహం పెంచుకొంటే అతని సహాయంతో శత్రువును దెబ్బతీయవచ్చు. ఏనుగు ఊబిలో ఇరుక్కుంటే, దాన్ని ఆ ఊబిలోంచి బయటికి లాగేందుకు మరో బలవంతమయిన ఏనుగు సహాయం కావాలి. సింహళరాజు మహాబలుడి సహాయం మనం కోరవచ్చు. అతను మనతో చాలాకాలం నుండి స్నేహంగా ఉన్నాడు. మనం వెంటనే అతని సహాయం కోరుతూ, అతని దగ్గరికి దూతను పంపుదాం". అన్నాడు. దీనికి రాజు సమ్మతించాడు.
ఓ ఉత్తరం రాసి, దూతద్వారా, సింహళరాజు మహాబలుడికి పంపారు.
ఇక్కడ ఇలా జరుగుతుండగా, అక్కడ చిత్రవర్ణుడు ఒకనాడు తన కొలువులో సన్నిహితులతో మాట్లాడుతూ, “మేఘవర్ణా, నువ్వు చాలారోజులు కర్పూరద్వీపంలో ఉండొచ్చావు కదా, అక్కడి రాజు గురించీ, మంత్రి గురించీ నీ అభిప్రాయమేమిటి?” అని అడిగాడు.
“ఆ రాజు మహానుభావుడు, సజ్జనుడు, సత్యసంధుడు. అతని మంత్రి చాల సమర్థుడు, అనుభవజ్ఞుడు" అన్నాడు. మేఘవర్ణుడు.
"అంత సమర్థుడు కావటం వల్లనేనా నీ చేతిలో అంత
తేలిగ్గా మోసపోయాడు?” అన్నాడు రాజు హేళనగా.
“వాళ్ళు నన్ను నమ్మారు. నేను వాళ్ళను మోసగించాను. మనల్ని పూర్తిగా నమ్మినవాళ్ళను వంచించటం కష్టం కాదు. నమ్మి నా ఒళ్ళో తలపెట్టుకు పడుకొన్న స్నేహితుడిని, కత్తితో పొడిచి చంపడం కష్టం కాదు. చంపినవాడు బలవంతుడు కానక్కరలేదు, చచ్చినవాడు బలహీనుడూ, అసమర్థుడూ అనటానికి లేదు. పూర్వం ఒక అమాయకపు బ్రాహ్మణి, దొంగలు వంచించిన కథ మీకు గుర్తుందో, లేదో, చెప్తాను వినండి”.
No comments:
Post a Comment