పిల్లి తీర్పు

                పిల్లి తీర్పు

వింధ్యపర్వతం మీద ఒక చెట్టు తొర్రలో కపింజలం అనే ఓ పక్షి కాపురం ఉంటూ ఉండేది. ఓరోజు సాయంత్రం తిండి వెతుక్కొంటూ వెళ్ళిన పక్షి గూటికి చేరకముందే కుండపోతగా వానపడింది. పక్షి బాగా తడిసిపోయింది. మామూలు వేళకు గూటికి చేరలేకపోయింది.

చెట్టు తొర్ర ఖాళీగా ఉండటంతో, దీర్ఘకర్ణుడనే ఒక కుందేలు వాననించీ తప్పించుకొనేందుకు ఆ చెట్టు తొర్రలో దూరి, అక్కడ వెచ్చగా ఉండటంతో హాయిగా పడుకొంది.

బాగా తడిసిపోయి, ఆలస్యంగా, చిమ్మచీకట్లో గూడు చేరుకొన్నది కపింజలం. తన తొర్రలో హాయిగా పడుకొని ఉన్న కుందేల్ని చూసింది. దానికి పిచ్చికోపం వచ్చింది. కుందేల్ని కుదిపి లేపేసింది. "ఏమిటిది? ఇదేమన్నా నీ తాతగారిల్లనుకొన్నావా, తేరగా వచ్చి యిక్కడ పడుకొన్నావు.. పో ఇక్కణ్ణించి, లేకపోతే చంపేస్తాను" అని అరిచింది.

"ఏడిశావ్, నీ బెదిరింపులు కట్టిపెట్టు. ఈ చెట్టు నీ తాత సొమ్ము కూడా కాదులే. బావులూ, చెరువులూ, చెట్టుతొర్రలూ ఎవరు ముందు ఆక్రమించుకుంటే వాళ్ళకే చెందుతాయి. నేనికృర్ణించి కదిలేది లేదు. నీకు దిక్కున్నచోట చెప్పుకో, ఫో!" అంది కుందేలు,

"సరే, ఈ చీకట్లో ఎక్కడికీ పోలేము. తెల్లారనీ మన తగవు తీర్చుకొందాం" అని పక్షి తెల్లారేదాకా ఎలాగో కాలక్షేపం చేసి, తెల్లారగానే కుందేలును లేపింది. "పద, మన తగవు తీర్చుకొందాం!" అంది.

"ఎవరు తీరుస్తారు ఈ తగవు?" అంది కుందేలు. 'నర్మదా నది ఒడ్డున దధి కర్ణుడనే ముసలి పిల్లి ఉంది. దానికున్న వ్యవహార జ్ఞానం, అనుభవం ఎవరికీ లేవు. అదే చెప్తుంది ధర్మమైన తీర్పు. అక్కడికి పోదాం" అంది పక్షి.

పక్షి, కుందేలూ కలిసి పిల్లి దగ్గరికి వెళ్ళాయి. "చెట్టుతొర్ర ఎవరిది అన్న విషయంలో మా యిద్దరికీ తగాదా వచ్చింది. నువ్వు తీరుస్తావని వచ్చాం" అని చెప్పాయి.

వాళ్ళు అనుకొన్నట్టు పిల్లిది ధర్మబుద్ధి కాదు. అది ఎలాగో వాటి రెండింటినీ చంపి, తినాలని ఒక పథకం వేసింది.

"నేను ముసలిదాన్ని, నాకు చెముడు. మీరు చెప్పేది. సరిగా వినబడటం లేదు. మీరిద్దరూ నాకు బాగా దగ్గిరగా వచ్చి, నా చెవులో బిగ్గరగా చెపితే తప్పా మీ తగాదా ఏమిటో నాకు అర్ధం కాదు. నాకు అవతల చాలా పనులు కూడా ఉన్నాయి. అందుచేత గబగబా వచ్చి, మీ గొడవేమిటో చెప్పండి" అంది.

పక్షి, కుందేలు చకచకా వెళ్ళి పిల్లి రెండు పక్కలా కూర్చొని, దాని చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడ బోయాయి. పిల్లి ఆ రెంటినీ చటుక్కున తన కాళ్ళతో పట్టేసుకొని మెడలు కొరికి చంపేసింది. ఆ తర్వాత రెండు మూడు రోజులు ఆహారం వెతుక్కొనే శ్రమ లేకుండా, వాటిని తృప్తిగా తినేసింది.

"అలాగే ఈ మేఘవర్ణుడికి కూడా అర్హతకు మించి సత్కారం చేస్తే, మనకే కీడు జరగవచ్చు" అన్నాడు దూరదర్శి.

చిత్రవర్ణుడు, యిదంతా విని, "మంత్రీ! నువ్వు చెప్పినట్టే చేద్దాంలే. మేఘవర్ణుడికి మరో బహుమానం ఏదన్నా ఇద్దాం. కానీ దానికి ముందొక పనిచేద్దాం. కర్పూరద్వీపానికి మేఘవర్ణుణ్ణి మరోసారి పంపుదాం. అక్కడి అపూర్వమయిన - వస్తువులు ఇక్కడికి తెప్పించుకొందాం. వాటిలో కొన్ని ఏరి, అవే అతనికి బహుమానంగా యిద్దాం. మిగిలినవాటిలో కొన్ని మన యితర సేవకులకి బహుమతి యిద్దాం. అన్నిటికంటే మంచివి మాత్రం మనం అట్టిపెట్టుకొని, ఆనక రెండు రాజ్యాలూ హాయిగా పరిపాలించుకొందాం” అన్నాడు.

మంత్రి చిరునవ్వు నవ్వాడు. "రాజా, జరగబోయే వాటి గురించి, మరీ అంత రంగులకలలు కనటం మంచిది కాదంటారు. పెద్దలు. దానికి దృష్టాంతంగా కుండలు పగలగొట్టుకున్న వెర్రి బ్రాహ్మడి కథ చెప్తారు. అది వినండి చెప్తాను" అని వెర్రి బ్రాహ్మడి కథ చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...