యుద్ధ పర్వం

                యుద్ధ పర్వం

యుద్ధం మొదలయింది. భయంకరంగా సాగింది. నడిచి నడిచి అలసిపోయి ఉన్న చిత్రవరుడి సేనని, హిరణ్యగర్భుడి సైనికులు చీల్చి చెండాడారు. రక్తం వరదలుగా పారింది. మొదట్లోనే చిత్రవర్ణుడి పక్షాన్ని కర్పూరద్వీప సైనికులు బాగా దెబ్బ తీశారు. చచ్చిపడిన తన సైనికులను చూసి చిత్రవర్ణుడు చాలా బాధపడ్డాడు, నిరుత్సాహపడ్డాడు.

అప్పటివరకూ యుద్ధం విషయంలో తలదూర్చకుండా, పట్టించుకోకుండా అలిగి, దూరంగా కూర్చొన్న తన మంత్రి దీర్ఘదర్శిని పిలిపించాడు. "మంత్రీ! మన సేన యిలా పాతమయిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకోవటం భావ్యంకాదు. ముందే నువ్వు చెప్పిన మంచి సలహా విననందుకు ఫలితం ఇవాళ నేను అనుభవిస్తూనే వున్నాను. ఏదేమయినా, ఈ సైనికులు మనవాళ్ళు, మనిద్దరం ఒక చెట్టుకు పుట్టినవాళ్ళం. నేను నీ మాట వినక, నిన్ను నిందించి పనికిమాలిన మంత్రివని తిట్టి అవమానించాను, నిజమే. అది నా పొరపాటే, నన్ను క్షమించి, నా పొరపాటు మర్చిపో. యుద్ధంలో నీ సహాయం లేకపోతే, మన సైన్యమంతా నాశనమయిపోతుంది. మనం ఓడిపోయి, వెనక్కి తిరిగి మన వింధ్య పర్వతానికి పారిపోవాల్సిందే. వచ్చి మన సేనకు నాయకుడివిగా ఉండి దాన్ని గెలిపించు" అని బ్రతిమాలాడు.

రాజు స్వయంగా అంత దీనంగా బతిమాలడంతో దీర్ఘదర్శి కోపం పోయింది. "రాజా, దిగులుపడకు. జరిగిన నష్టం గురించి నిరుత్సాహపడొద్దు. ఈ మిగిలిన సైన్యంతోనే మనం గెలుస్తాం. చూస్తూ ఉండు. ఇలాంటి యుద్ధాలు యింతకు ముందు మనం ఎన్నో గెలిచాం. యిప్పుడూ గెలుస్తాం. నాశక్తీ, నీశక్తి, మన సైనికుల శక్తి తక్కువగా అంచనా వేయకు!" అని ధైర్యం చెప్పి తనూ రంగంలోకి దిగాడు. శత్రువుల కోట ముట్టడించడానికి సైన్యాన్ని సిద్ధం చేయటం మొదలెట్టాడు.

ఈ విషయం హిరణ్యగర్భుడికి తన గూఢచారి ధవళాంగుడి ద్వారా తెలిసింది. తన మంత్రిని తను పిలిచి, "సర్వక్షా! ఇప్పుడేం చేద్దాం?" అని సలహా అడిగాడు.

"భయంలేదు రాజా! మన సైనికుల్లో మహావీరుల్నందర్నీ పిలిచి, మీరు స్వయంగా వాళ్ళ భుజం తట్టి ప్రోత్సాహం ఇవ్వండి. వీరులకు, జీతబత్తేల కంటే, రాజుగారి మెప్పు విలువ వెయ్యిరెట్లు ఎక్కువ. అందువల్ల వాళ్ళు ప్రాణాలొడ్డి యుద్ధంచేసి విజయం సాధిస్తారు!" అన్నాడు సర్వజ్ఞుడు.

ఇంతలో నీలవర్ణుడు అక్కడికి హడావిడిగా వచ్చాడు. రాజుకు నమస్కారం చేసి, "రాజా! నాదొక చిన్న విన్నపం. శత్రువులు మనకోట దగ్గిరికి వచ్చేశారు. మనం కోటలో కూర్చొని ఉన్నాం. వాళ్ళు గనక కోట ద్వారాల దగ్గిర అడ్డుపడి, మనం బయటకు వెళ్ళటానికి వీలు లేకుండా నిరోధిస్తే, మనం చాలా ప్రమాదంలో పడతాం. సందేహించకుండా, నన్ను పంపండి. నేను వెళ్ళి శత్రుసైన్యం పని పడతాను" అన్నాడు.

రాజు జవాబిచ్చేముందే, మంత్రి మాట్లాడాడు. "ఔనౌను, నువ్వెంతో నీ బలమెంతో అందరికీ తెలుసు, పిచ్చి, పిచ్చి వాగుడు మాని, పక్కన కూర్చో. అసలు యుద్ధం, యుద్ధం అంటూ తెగ పలవరించిన వాడివి నువ్వే. అది రానే వచ్చింది. నీతోబాటు మాకూ ముప్పు దాపురించింది. నీబోటివాళ్ళు మాటలు చాలా చెప్తారు. కానీ చేతలలో ఎందుకూ కొరగారు. నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది”.

“రాజా! వీడి మాటలు వింటే మనం బాగా నష్టపోతాం. వీడు కొవ్వెక్కి, నోటికొచ్చిన మాటలు వాగుతాడు తప్పా, నలుసంత పనికిరాడు. అసలు వీడు మనకి మిత్రుడిలా కనిపిస్తున్న శత్రువే. ఎంత చెప్పినా, వినకుండా నువ్వు వీడిని నమ్మేస్తున్నావు. ఇది చాలా ప్రమాదం. వీడు మాయగాడు. వీడు చెప్పినట్టు మన సైనికులు కోట వదలిపెట్టి, బయటికి వెళ్ళి పోట్లాడాలంటే, ఇంక మనం యింత కష్టపడి కోట కట్టుకొని ఏం ప్రయోజనం? నీళ్ళలో మొసలి ఏనుగునయినా చంపగలదు. బయటికొస్తే కుక్కతో కూడా గెలవలేదు. యుద్ధం చేసేప్పుడు స్థానబలం చూసుకోవాలి. ఈ నీలవర్ణుడి మాట నువ్వు విన్నావంటే మన సైన్యం నాశనమైపోతుంది. అసలు వాడికి కావలిసిందదే" అంటూ మంత్రి ఇంకా చెప్పబోతుండగా, నీలవర్ణుడు అడ్డుపడ్డాడు.

రాజు వైపు తిరిగి "రాజా, ఈ సర్వజ్ఞుడే మేకవన్నె పులి వీడితో మీరు జాగ్రత్తగా ఉండాలి. మాయమాటలు నావి. కాదు, అతనివి. మనం ఓడిపోయి ఎంత అవమానం. పాలయినా, తన ప్రాణం దక్కితే చాలని ఇతను ఆలోచిస్తున్నాడు.. ఇలాంటి మంత్రిని ఎంత తొందరగా వెళ్ళగొడితే అంత లాభం మీకు, ఇతనొక్కడూ లేకపోతే మనకేం కొదవలేదు. అసలు ఈ యుద్ధం గెలిపించడానికి నీకు నేను ఒక్కణ్ణి చాలు. వీళ్ళంతా దండగ. నేను అంత బలవంతుణ్ణి కాబట్టే ఇతనికి నామీద అసూయ. ఎంతలేసి మాటలన్నాడు నన్ను! మీకు ఆప్తుణ్ణయిన నన్ను తిడితే మిమ్మల్ని తిట్టినట్టే కదా, రాజా! దాక్కొని ప్రాణం దక్కించుకోవటం ఏం గొప్ప? వీరులకి ప్రాణం కంటే మానం, మర్యాదా ముఖ్యం. ఈ పిరికి మంత్రి యుద్ధం వచ్చినప్పుడు దాక్కుని, పరువు పోగొట్టుకొని, ఆ తర్వాత మానమర్యాదలు లేకుండా నూరేళ్ళు బతికితే చాలనుకొంటున్నాడు. అదిగాక కోట బయటికి వెళితే మన సైనికులు ఎందుకూ కొరగారని ఈయన అనటం ఎంత అవమానకరంగా ఉంది! ఈయన సలహా వినొద్దు. ఇప్పటికే సగం చచ్చి ఉన్న చిత్రవర్ణుడి సైన్యం మీదికి దూకి ఎదిరించి మట్టుపెడదాం. అదే మనకు అనుకూలం" అన్నాడు.

ఇతన యిలాగా, మంత్రి అలాగా మాట్లాడుతుంటే, ఏం చేయాలో రాజుకు పాలుపోలేదు. కాసేపు ఆలోచించాడు. ఏమీ అనలేదు.

నీలవర్ణుడు, "రాజా! మీ మౌనమే మీ అంగీకారంగా భావిస్తున్నాను. శలవివ్వండి" అంటూ కొంతమంది సైనికులను తీసుకొని కోట బయటికి వెళ్ళి శత్రుబలాల మీద దాడి మొదలెట్టాడు. రాజు అతన్ని ఆపలేదు.

మంత్రి సర్వజ్ఞుడికీ, సేనాపతి వీరవరుడికీ చాలా బాధ కలిగింది. కానీ ఏం చేయటం, చెప్పాల్సిందంతా నిర్మొహమాటంగా చెప్పారు. కానీ రాజు వినడు. రాజుకు నీలవర్ణుడి మీద ఉన్న నమ్మకం తన మంత్రి, సేనాపతులు మీద లేదు. చేసేది లేక మంత్రి, సేనాపతీ కూడా నీలవర్ణుడి సలహా ప్రకారమే యుద్ధ ప్రయత్నాల్లో మునిగిపోయారు.

యుద్ధం కొనసాగింది. చాలామంది సైనికులను పోగొట్టుకొన్న చిత్రవర్ణుడూ అతని మిగిలిన సేనలూ పగతో, కసితో, వీరోచితంగా పోరాడారు. ఒక్కరోజు యుద్ధం పూర్తయ్యేసరికి రెండువైపులా వేలకు వేల పక్షులు యుద్ధంలో చచ్చిపోయాయి. చీకటిపడ్డ తర్వాత రెండు పక్షాలూ ఆ రోజుకు యుద్ధం ఆపి విశ్రాంతి తీసుకొన్నాయి.

మర్నాడు పొద్దున తెల్లవారకముందే నీలవర్ణుడు లేచి, తనతోపాటు ఒక వెయ్యి కాకుల్ని తోడు తీసుకొని, ముక్కున ఒక మండే కట్టె తీసుకొని, భయపడి పారిపోతున్నట్లుగా యుద్ధభూమి నించీ, కోటలోకి దూసుకువెళ్లాడు. కోటలో అందరూ నిద్రలో ఉన్నారు. వీరవరుడు ఎంతో కష్టపడి, సురక్షితంగా కట్టిన కోటంతా నీలవర్ణుడు తగలబెట్టేశాడు. కోట లోపల ఉన్న పక్షుల్లో చాలాభాగం ఆ మంటల్లో కాలి . చచ్చిపోయాయి.

"కోట మా వశమయింది. మేం గెలిచాం" అని అరుస్తున్న కాకుల గోలతో, ఆ కాలిపోతున్న కోటలో చావక మిగిలిన పక్షులకు ఏం చేయాలో తెలియలేదు. కొన్ని భయపడి ఎటు వీలయితే అటు పారిపోయినయ్. కొన్ని పారిపోయే ప్రయత్నంలో మంటల్లో చిక్కుకొని చచ్చిపోయినాయి. కొన్నింటిని ఆ నీలవర్ణుడి కాకులసేన పొడిచి చంపేసింది.

అలా ఒక గంటలోపే హిరణ్యగర్భుడు రక్షణ కోసం కట్టించుకొన్న చోట కుప్ప కూలిపోయింది. కోటను రక్షించేందుకు ఎవరూ మిగలలేదు. కోట లోపల రాజు హిరణ్యగర్భుడూ, సేనాని వీరవరుడూ, కొద్దిపాటి సైన్యం తప్పా.

తనకళ్ళముందే తన సైనికులు అన్నివేల సంఖ్యలో కాలి చచ్చిపోవటం, కాకుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడం, పారిపోవటం చూసిన హిరణ్యగర్భుడికి చెప్పలేనంత దుఃఖం కలిగింది. పశ్చాత్తాపం కలిగింది. "వీరవరా! చూశావా, నా పొరపాటు వల్ల ఎంత నష్టం జరిగిపోయిందో, మనవాళ్ళు ఎన్నివేలమంది ప్రాణాలు పోగొట్టుకొన్నారో, నీలవర్ణుడిని సమ్మి సర్వనాశనం కొని తెచ్చుకొన్నాను. మీరందరూ ఏకమై ఎంత చెప్పినా వినకుండా, ఈ నీచుణ్ణి చేరదీసి రాజ్యాన్ని చేజేతులా 'నాశనం చేశాను. దైవసంకల్పం అలా బుర్ర కూడా పనిచేయదు. ఇప్పుడు బ్రతికి ఉన్నాడో లేదో, ఎక్కడ ఉన్నప్పుడూ, మన బర్రకూడా పనిచేయదు! ఇప్పుడు బ్రతికి ఉన్నాడో లేదో, ఎక్కడ ఉన్నాడో మన మంత్రి సర్వజ్ఞుడు! అతను చెప్పిందంతా ఇప్పుడు నిజమయింది. మూర్ఖుడినయి అతని మాట పెడచెవిన పెట్టాను. మన పక్షాన నువ్వూ నేనూ తప్పా మిగిలిన ముఖ్యులంతా ఈ యుద్ధంలో చచ్చిపోయి ఉంటారు. నువ్వు కూడా నా కోసం ఇక్కడ ఉంటే ప్రాణానికి ప్రమాదం. నా మాట విని నువ్వు కూడా పారిపో” అన్నాడు.

రాజును ఆ పరిస్థితిలో వదిలి, మహావీరుడు వీరవరుడు అలా పారిపోతాడా?

"లేదు రాజా! నేను నిన్ను వదిలి వెళ్లే ప్రశ్నే లేదు. నా బొందిలో ప్రాణం ఉన్నంతదాకా నేను నీతోపాటు ఉండి, నిన్ను రక్షించేందుకు యుద్ధం చేస్తాను. ప్రాణాలు పోతాయని నాకు భయమేమీ లేదు, అవి ఎలాగూ ఎప్పుడో ఒకప్పుడు పోకతప్పదు. నా ధర్మాన్ని వదిలిపెట్టి ఎలాగయినా ప్రాణం కాపాడుకోవాలని నాకు లేదు” అన్నాడు.

ఇంతలో చిత్రవర్ణుడి సేనాపతి తామ్రచూడుడు తన

సేనలతో కలిసి వాళ్ళమీద పడనే పడ్డాడు.

రాజూ, సేనాపతి చాలాసేపు వీరోచితంగా యుద్ధం చేశారు. కానీ, తమ చిన్నసేనతో శత్రువుల ధాటికి చివరికి, వీరవరుడు తామ్రచూడుడిని చంపి, తన రాజు తప్పించుకొనేందుకు దోప ఏర్పరచి, రాజును అక్కణ్ణించి పంపేశాడు. రాజు పారిపోయి నీళ్ళలో దూరి ప్రాణాలు దక్కించుకున్నాడు. వీరవరుడు మాత్రం అద్భుతంగా యుద్ధం చేసి, కొన్నివందల శత్రు సైనికుల్ని చంపేసి, చివరికి యుద్ధంలో తనూ నేలకొరిగాడు.
 
దాంతో యుద్దం పూర్తయిపోయింది. విజయోత్సాహంతో చిత్రవర్ణుడు కోటలో ప్రవేశించి, దాన్ని తన వశం చేసుకొన్నాడు. ఆ తర్వాత విజయగర్వంతో యుద్ధంలో చచ్చినవారు చావగా మిగిలిన తన కొద్ది సైన్యంతో రాజధానికి వెళ్ళిపోయాడు.

'అని విష్ణుశర్మ రాజకుమారులకు 'విగ్రహం' కథ చెప్పటం పూర్తి చేశాడు. "చూశారా! పిల్లలూ, యుద్ధం వల్ల అన్ని పక్షాలకీ నష్టమే. ఊరికే, పెద్ద కారణమేమీ లేకుండా, పొగతో యుద్ధం యుద్ధం అంటూ అయినదానికీ, కానిదానికీ కయ్యానికి కాలుదువ్వితే, రాజు తరువాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. పోరునష్టం, పొందు లాభం అని ఎప్పుడూ మర్చిపోవద్దు" అని కథ నీతి మరోసారి చెప్పాడు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...