పిల్లి - ఎలుక

                పిల్లి - ఎలుక 


పంచవటి ప్రాంతంలో ఓ మర్రిచెట్టు తొర్రలో రోమశుడు అనే పేరుగల పిల్లి ఉంటూ ఉండేది. ఆ చెట్టు కింద ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఎలుక పేరు పలితుడు.

ఒకరోజు రాత్రి ఒక బోయవాడు వచ్చి, ఆ చెట్టు చుట్టూ వలలు పన్ని వెళ్లాడు. పిల్లి తెల్లారిలేచి చీకట్లో సరిగా కనపడక ఆ వలలో ఇరుక్కుపోయింది. అది చూసి ఎలుకకు ప్రాణం లేచివచ్చింది. 'అమ్మయ్యా, పీడ విరగడయింది' అనుకొంటూ నిశ్చింతగా తిరగసాగింది. ఇంతలో ఓ గుడ్లగూబ వచ్చింది. దాన్ని చూడగానే ఎలుకకు భయంతో ముచ్చెమటలు పోసి, వణుకు మొదలయింది.

" ఆహా, ఈ దేవుడికెంత దయలేదు! నిమిషం క్రితమే పిల్లి పీడ పోయిందని సంతోషించాను. ఇప్పుడీ గుడ్లగూబ వల్ల చావు దాపురించింది. ఇప్పుడెలా బయటపడటం?" అని ఆలోచించింది. ఏదో ఉపాయంతో పిల్లితో స్నేహం కలపగలిగితే గుడ్లగూబ తననేమీ చేయలేదు, అనుకొంటూ ఎలుక పిల్లి దగ్గరకు చేరింది. "పిల్లిబావా, నమస్కారం. ఇన్నాళ్ళు మనం యిదే చెట్టుకింద అన్నదమ్ముల్లాగా బతికాం. నీవల్ల నాకు గానీ, నా వల్ల నీకుగానీ ఎప్పుడూ ఏ యిబ్బందీ రాలేదు. ఇవాళ ఈ వలలో యిరుక్కొన్న నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కు పోతున్నది. నిన్ను విడిపిస్తే తప్పా నా మనసు కుదుటపడదు అని అనుకొంటుండగానే, నన్ను చంపేందుకు ఈ గుడ్లగూబ దాపురించింది. నిన్ను చూసి భయపడి ఆగింది కానీ, లేకపోతే ఈపాటికి నన్ను మింగేసేదే. నాతో స్నేహం చేసి, నాకూ సహాయం చేస్తానంటే చెప్పు. నిన్ను నీ ఆపదలోనించి నేను బయటపడేస్తాను, నన్ను నువ్వు రక్షించుదువు గాని” అంది.

“ఎంత మాటన్నావు, మిత్రమా! నాకు ఉపకారం చేస్తే నీలాంటి ఉత్తముణ్ణి రక్షించక, పొట్టను పెట్టుకొనే పాపిష్ఠివాణ్ణి కాదు నేను. కాటికి కాళ్ళు చాచిన ముసలిని నేను, ధర్మం తప్పను. అసలు నేనెప్పుడూ నీతో స్నేహం చెయ్యాలనే ఆలోచిస్తుంటాను. నిన్ను చూస్తే వెయ్యిమంది దగ్గర బంధువుల్ని చూసినట్టుగా ఉంటుంది నాకు. నాకు ధర్మకార్యాలంటే చాలా యిష్టం. కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే ధర్మం చేయగలం. రేపు ముసలితనంతో జవసత్వాలు ఉడిగిపోయిన తర్వాత ఇంక ధర్మమెలా చేస్తాం? 'ధర్మస్య త్వరితాగతిః' బ్రతికినన్నాళ్ళూ మంచి పనులు చేస్తూ ఉండడమే నా ధ్యేయం. ఆపదలో ఉన్న నాకు దేవుడిలా ఎదురొచ్చావు. ఇక ఈ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నా ప్రాణం రక్షించావంటే, నిన్ను నేను కాపాడతాను. వచ్చి ఈ వల కొరికి నన్ను రక్షించు" అన్నది పిల్లి.

సరేనని ఎలుక పిల్లి దగ్గరికి చేరింది. అది చూడగానే గుడ్లగూబ ఇంక ఎలుక తనకు చిక్కదని తెలుసుకొని నిరాశగా ఎగిరిపోయింది. గుడ్లగూబకు పిల్లి అంటే చచ్చే భయం.

ఇంతలో వలపన్నిన బోయవాడు యముడిలాగా అక్కడికి నడిచివస్తూ కనిపించాడు. వాడిని చూడగానే పిల్లికి వణుకు పుట్టింది. "ఎలుక బావా! ఆ బోయవాణ్ణి చూస్తేనే నాకు వళ్ళు జలదరిస్తున్నది. నన్ను తొందరగా ఈ వలలోంచి బయటపడేయవా!" అంటూ ప్రాధేయపడింది.

ఎలుక గబగబా వల కొరికేసి, ఎందుకయినా మంచిదని వెంబడే తన కలుగులోకి పారిపోయింది. పిల్లి వల విదిలించుకొని చటుక్కున చెట్టేక్కేసింది. బోయవాడు దాన్ని పట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయాడు.

వాడు అక్కడినించీ దూరంగా వెళ్ళిపోయిన తరువాత, పిల్లి చెట్టు దిగి ఎలుక దాగి ఉన్న కలుగు దగ్గరికి వచ్చింది. "మిత్రమా! నాలాంటి స్నేహితుడితో నిశ్చింతగా కాలక్షేపం చెయ్యక, అలాగ నీ కలుగులో దాక్కున్నావెందుకు? నువ్వు లేకుండా నేనేమీ తినలేను. నీ మాటలు వినకపోతే నాకు వెలితిగా ఉంది. నా యిల్లే, నీ యిల్లు. నేను నీవాణ్ణి. ఈ రోజూ రేపూ నువ్వు నా యింట్లోనే నాతోపాటు భోజనం చేద్దుగాని. రా, నిన్ను కౌగలించుకొని కృతజ్ఞత చెప్పుకోకపోతే నాకు తోచట్లేదు" అంది.

ఈ మాయ మాటలన్నీ నమ్మేందుకు ఎలుక పిచ్చిదేమీ కాదు. "పిల్లి మహాశయా! ఏదో యిబ్బంది కలిగి, గతిలేక శత్రువుతో స్నేహం చేయాల్సి వచ్చినా, నా జాగ్రత్తలో నేనుండకపోతే ఏమవుతుందో నాకు తెలుసు. నీ మాటల మాయలో పడితే నాకు చావు తప్పదు. అసలే నువ్వు యింతసేపూ వలలో చిక్కిపోయి, తిండిలేక మంచి ఆకలితో ఆవురావురుమంటున్నావు. దగ్గిరికొస్తే నన్ను వదిలిపెడతావా? నీకూ,నీ స్నేహానికి వెయ్యి నమస్కారాలు. నీ దోవన నువ్వు పో!" అంది. కలుగులో నుంచి బయటికి మాత్రం రాలేదు.

"ఈ కథ వల్ల నేను చెప్పదలిచిందేమిటంటే, అప్పుడప్పుడూ మనం శత్రువుతో స్నేహం చెయ్యాల్సి వస్తుంది. అందుకని నువ్వు ఈ నీలవర్ణుణ్ణి గురించి చర్చ చాలించు. శత్రువు మనకి చాలా దగ్గర్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ఊరికే వాదోపవాదాలతో కాలం వృథా చేయకూడదు. జరగాల్సిందేమిటో ఆలోచించాలి" అన్నాడు హిరణ్యగర్భుడు.

ఏం చేస్తాడు మంత్రి? తను చెప్పాల్సింది చెప్పాడు. "అయితే సరే రాజా, నీ యిష్టం. మనకి ఒక ఉపాయం ఉంది. చిత్రవర్ణుడికీ, అతని మంత్రికీ సరిపడటల్లేదని విన్నాం గదా. పైగా ఆ రాజుకు మన బలం గురించి సరిగా తెలిసినట్టు లేదు. అదీగాక అతనూ, అతని సైన్యం అంతదూరం ప్రయాణం చేసిపచ్చి బాగా అలిసిపోయి ఉన్నారు. శత్రువు తన వీరులని తనే అవమానించటమూ, అలసిపోయి ఉండటమూ, మన పక్షం బలం తెలుసుకోక అజాగ్రత్తగా ఉండటము. ఈ మూడు కారణాల వల్ల ఇప్పుడే యుద్ధం మొదలుపెడితే మనం గెలవటం సులభమవుతుంది" అన్నాడు. ఈ సలహా రాజు ఆమోదించాడు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...