బ్రాహ్మణుడు - ముంగిస

         బ్రాహ్మణుడు - ముంగిస

వెనకటికి గౌడ దేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికి చాలాకాలం సంతానం కలగలేదు. అతని భార్య సంతానం కోసం ఎన్నో పూజలు చేసింది. నోములూ, వ్రతాలూ పట్టింది. రాయి కనిపిస్తే రాతికీ, గుడి కనిపిస్తే గుడికి మొక్కింది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకో కొడుకు పుట్టాడు.

ఆ కొడుకుని వాళ్ళు చాలా గారాబంగా పెంచుకొన్నారు. ఓ రోజు తల్లి ఆ కొడుకును ఉయ్యాలలో పడుకోబెట్టి, నిద్రబుచ్చి, జాగ్రత్తగా చూస్తూ ఉండమని భర్తకి చెప్పి, అవతలి వీధిలో ఉన్న పుట్టింటికి ఏదో పూజ కోసం వెళ్ళింది.

ఆమె అటు వెళ్ళగానే, రాజభవనం నించీ బ్రాహ్మణుడికి పిలుపు వచ్చింది, వెంటనే వచ్చి పండగ సంభావన పుచ్చుకొని పెళ్ళమని, బ్రాహ్మడు యిరకాటంలో పడ్డాడు. భార్యకోసం ఆగుదామా అంటే ఆమె పూజ పూర్తి చేసుకొని వచ్చేప్పటికి చీకటి పడిపోతుంది. పోనీ రాజుగారి దగ్గరికి వెళ్ళటం అంటే, రాక రాక వచ్చిన పిలుపు, బోలెడంత సంభావన నష్టమవుతుంది. పైగా రాజుకేం కోపం వస్తుందో? వెళదామంటే పిల్లవాడికి కాపలా ఎవరు? ఆలోచించి, ఆలోచించి, పిల్లవాడికి తను చాలాకాలం నించీ ముద్దుగా పెంచుకొంటున్న ముంగిసను కాపలా ఉంచి, తను దానం స్వీకరించేందుకు వెళ్లాడు. వెళ్ళటం వెళ్ళాడు కానీ ఆ గంటసేపూ అతని మనసంతా ఉయ్యాల్లో పిల్లాడి మీదే. వాడికేం ఆపద వస్తుందో అని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాడు.

నిజంగానే యిక్కడ పిల్లాడికి ఓ ఆపద వచ్చింది. ఇంటిపై కప్పునించీ ఓ నల్లతాచు జారిపడి పిల్లాడి ఉయ్యాలవైపు పాకింది. ముంగిస వెంటనే దానిమీదపడి దాని మెడకొరికి, ముక్కలు ముక్కలు చేసి చంపి పడేసింది కాబట్టి పెద్ద గండం గడిచింది.

బ్రాహ్మడు సంభావన తీసుకొని పరుగులు పెడుతూ తిరిగివచ్చాడు. అతనింటికి రాగానే తలుపు చప్పుడుకు ముంగిస ఎదురెళ్ళింది. దానిమూతినిండా, వంటినిండా, పామును చంపిన రక్తం. అసలే అన్నిరకాల కీడు శంకిస్తూ వస్తున్న బ్రాహ్మడికి ఆ ముంగిసను చూడగానే మతిపోయింది. తన బిడ్డను ముంగిస కొరికి గాయపరిచిందో లేక అసలు చంపేసే ఉంటుందోనని భయం వేసింది. పిచ్చికోపంతో దగ్గర్లో ఉన్న ఓ కర్ర తీసుకొని ముంగిస తలమీద మోది దాన్ని చంపేశాడు.

లోపలికి వెళ్లి చూస్తే పిల్లవాడు ఉయ్యాలలో సురక్షితంగా హాయిగా పడుకొని ఉన్నాడు. పక్కనే ముక్కలు ముక్కలయిన నల్లతాచును చూస్తే, జరిగిందేమిటో స్పష్టంగా తెలిసిపోయింది. తను చేసిన పాపానికీ, తన తొందరపాటుకూ ఎంతో విచారించి, నెత్తీ నోరు కొట్టుకొంటూ రోదించాడు ఆ కోపిష్టి బ్రాహ్మడు. ఏం లాభం? కనక, కేవలం కోపంలో ఏదో నిర్ణయం తీసేసుకొంటే చాలా నష్టం కలగచ్చు. తొందరపడకుండా, అన్ని విషయాలూ ఆలోచించి, కార్యంలోకి దిగాలి, అంటూ రాజు చిత్రవర్ణుణ్ణి మంత్రి దూరదర్శి గట్టిగా హెచ్చరించాడు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...