తపతి పరిణయం
చంద్రవంశానికి చెందిన ఋక్లుడి కొడుకు సంవరణుడు తండ్రి తదనంతరం ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. మహారాజులు అందరిలాగానే సంవరణుడికి కూడా వేట అంటే ఇష్టం. ఇష్టం చేత తరచుగా అరణ్యాలకు వెళ్లేవాడు.
అలవాటు కొద్ది సంవరణుడు ఒకసారి దట్టమైన కీకారణ్యంలోకి వెళ్లాడు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, క్రూరమృగాలను వేటాడుతూ అడవిలో సంచరించసాగాడు. అలా అడవిలో తిరుగుతున్న సమయంలో ఉన్నట్లుండి అతడి కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయింది. అడవి అడవంతా పరిమళభరితమై తోచింది. సంవరణుడు తల పైకెత్తి ఎదురుగా దృష్టి సాదించాడు. కళ్ల ముందు అద్భుత సౌందర్యరాశి నిలిచి ఉంది.
రెప్ప వాల్చకుండా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఎటువైపుగా వెళితే అటువైపు వెళుతూ ఆమెనే అనుసరిస్తూ అడవిలో తిరుగాడాడు. జరుగుతున్నది కలో నిజమో అర్ధం కాలేదతనికి, ముగ్ధ మోహనమైన ఆమె రూపలావణ్యాలు మానవకాంతలకు అసాధ్యమనుకున్నాడు. వనదేవతే ఇలా వచ్చిందేమో, తన పుణ్యఫలం వల్లనే ఆమె తనకు కనిపించిందేమో అనుకున్నాడు. ఇలా పరిపరి విధాలుగా తలపోస్తూ ఆమెను అనుసరిస్తూనే, నెమ్మదిగా మాటలు కూడదీసుకుని ఆమెను పలకరించాడు.
'ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ కీకారణ్యంలో ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నావు ?..."
సంవరణుడి గొంతు వినబడటంతో ఆమె వెనుదిరిగి చూసింది.
ఆయుధాలు ధరించిన ఆజానుబాహుడిని తేరిపార చూసింది. వీరుడిలాగే ఉన్నాడు. అనుకుంది.
భూలోక విహారానికి వచ్చిన తనను ఇంతగా ఆకర్షిస్తున్నాడేమిటా అని విస్తుపోయింది. సంవరణుడు ఆమె నుంచి చూపు మరల్చుకోలేక అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆమె చిరునవ్వు సవ్వింది. బదులుగా ఒక్క మాటైనా పలకలేదు. తృటిలో మాయమై పోయింది.
అనూహ్య పరిణామానికి సంవరణుడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయేసరికి దుఃఖంలో మునిగిపోయాడు. బిగ్గరగా రోదిస్తూ, మూర్ఛిల్లాడు.
తన కోసం విలపిస్తున్న సంవరణుడిని గగనతలం నుంచి తిలకించిందామె. దర్శనమాత్రం చేతనే తన కోసం విలపిస్తున్న అతడిపై ఆమెకు గాలి ప్రేమ ఒక్కసారిగా కలిగాయి.
మళ్లీ నేలకు దిగి, సంవరణుడి ఎదుట. నిలిచింది. మూర్ఛ నుంచి తేరుకున్న సంవరణుడికి కళ్లెదుట చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.
ఎందుకు ఆవేదన చెందుతున్నావు?' అడిగిందామె. 'నేను సంవరణుడిని, మహారాజును, ఎందరో స్త్రీలను చూసినా, ఎన్నడూ నా మనసు చలించలేదు. నిన్ను చూడగానే నా మనసు నా అధీనం తప్పింది. పూర్తిగా నీకే వశమైపోయింది.
నువ్వు అదృశ్యం కాగానే అంతా శూన్యమైపోయినట్లనిపించింది. నువ్వు లేకుండా జీవించలేను. ప్రకృతి సాక్షిగా మనం గాంధర్వ వివాహం చేసుకుందాం' అన్నాడు.
'నేను సూర్యభగవానుడి పుత్రికను. తపతిని. నేను స్వతంత్రను కాను. నా తండ్రి అనుమతి కావాలి. తపస్సుతో నా తండ్రిని ప్రసన్నుణ్ణి చేసుకో అని చెప్పి, సౌరమండలానికి ఎగసి పోయింది.
తపతీ వియోగాన్ని తట్టుకోలేక సంవరుణుడు అక్కడికక్కడే తపస్సు ప్రారంభించాడు. కాలం గడిచే కొద్ది ఉపవాస దీక్షతో కృశించిపోసాగాడు. అయినా చలించకుండా తపస్సు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా, ఒకనాడు వశిష్టుడు తన శిష్యుడైన సంవరణుడిని చూడాలనుకున్నాడు. రాజ్యాన్ని విడిచి, అడవిలో తపోనిష్టతో కృశించిపోయిన శిష్యుడిని చూసి సహించలేకపోయాడు. శిష్యుడి బాధకు కారణం తెలుసుకుని, తపోబలంతో నేరుగా సౌరమండలానికి వెళ్లారు.
సూర్యుడు ఎదురేగి వశిష్ఠుడిని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి మర్యాదలు చేశాడు.
'మహర్షీ! మీ రాకకు కారణం' వినయంగా అడిగాడు సూర్యుడు.
వశిష్టుడంతటి వాడు స్వయంగా అడగడంతో సూర్యుడు కాదనలేకపోయాడు. అతడి మాటనే ఆజ్ఞలా తలదాల్సి తపతీ సంవరణుల పరిణయాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు. సంవరణుడి ప్రేమగాథ అలా సుఖాంతమైంది.
No comments:
Post a Comment