కోతి - మొసలి

              కోతి - మొసలి


పశ్చిమదేశంలో సముద్రతీరాన ఉన్న ఒక అడవిలో ఓ కోతి, పేరు బలవర్ధనుడు. బలవర్ధనుడు ముసలివాడయి ఒంటి సత్తువ తగ్గిపోవటంతో, వాడి ఆస్తినంతా వాడి దాయాదులు దోచుకొని యింట్లోంచి వెళ్ళగొట్టారు. వాడు తపతి నది ఒడ్డునే ఉన్న ఒక మేడిచెట్టుమీద ఒంటరిగా కాలక్షేపం చేసేవాడు. ఓరోజు వాడు కోతి చేష్టగా మేడిపళ్లు కొన్ని కోసి ఒక్కొక్కటే చెట్టుమీంచి నదిలోకి విసరసాగాడు. అవి టప్పుటప్పుమంటూ నదిలో పడుతూంటే ఆ మోత వాడికి తమాషాగా అనిపించింది. ఆ శబ్దం విని ఆ నదిలో తిరుగుతున్న క్రకచుడు అనే మొసలి వచ్చి కోతి పడేసిన పళ్ళు అందుకొని తినసాగింది. ఆ రుచి దానికి బాగా నచ్చింది. క్రమంగా ఆ మొసలికీ, ముసలికోతికీ స్నేహం కుదిరింది.

రోజూ మేడిపళ్ళు తింటూ, కోతితో కబుర్లు చెబుతూ క్రకచుడు తన యింటికి వెళ్ళడం మానేసి, పెళ్లాం బిడ్డల్ని కూడా మర్చిపోయి ఆ మేడిచెట్టు దగ్గరే కాలం గడపడం మొదలెట్టాడు. నది అవతలి తీరంలో దూరంగా ఉన్న మొసలిభార్య, తన భర్త ఎన్నాళ్ళకూ కనబడకపోవటంతో భయంవేసి అతన్ని వెతుక్కురమ్మని మరొక మొసలిని పంపింది. అది వెళ్ళి క్రకచుడూ, బలవర్ధనుడూ కలిసి కబుర్లాడుకుంటూ, పళ్ళు తింటూ కాలం గడపడం చూసి, తిరిగి వచ్చి క్రకచుడి భార్యతో "మీ ఆయన నది అవతలి ఒడ్డున ఓ కోతిని కట్టుకొని హాయిగా కాపురం చేస్తున్నాడు. నీ సంగతి పూర్తిగా మర్చిపోయాడు" అని ఉన్నదానికి కాస్త చిలవలూ, పలవలూ చేర్చి చెప్పింది. క్రకచుడి భార్య ఏడుస్తూ కూర్చొంది.

క్రకచుడు అవతలి ఒడ్డునించీ మొసలి వచ్చి, తనని దూరం నించే గమనించి వెళ్ళడం చూశాడు. అది వెనక్కివెళ్ళి తన భార్యకు ఏమి చాడీలు చెప్తుందోనని భయపడి, బోలెడు మేడిపళ్ళు కానుకగా తీసుకొని భార్య దగ్గరికి వెళ్లాడు.

క్రకచుడి భార్య కళ్ళు మూసుకొని, రోగం వచ్చినట్లు నటిస్తూ, మూలుగుతూ పడుకొంది. నోటి మాటలేదు. చుట్టూ ఉన్న మొసలి ముత్తయిదువులు, క్రకచుడితో, “ఏమయ్యా పెద్దమనిషీ! భార్యని వదిలి అలా వెళ్ళిపోవడమేనా? నువ్వెళ్ళిన మర్నాటి నుంచీ నీ భార్య యిలా మాయదారి రోగంతో మంచమెక్కింది. మాట కూడా పడిపోయింది. మేమంతా ఎన్ని తిప్పలుపడి ఎన్ని మందులిప్పించినా రోగం లేదు. ఆమె బతకాలంటే ఒకటే మార్గం అని వైద్యులు చెబుతున్నారు. ఎక్కడయిన ఒక కోతి గుండెకాయ సంపాదించి, దాన్ని కోసి, పాలతో నాలుగు రోజులపాటు పుచ్చుకొంటే రోగం నయమవుతుందట. లేకపోతో ఈమె మరి బతకదు. ఎలాగయినా నీ భార్యను బతికించుకో!" అన్నారు.

క్రకచుడికి మతిపోయింది. అతనికి కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది? అది లేకపోతే భార్య ప్రాణాలు పోతాయంటున్నారు. ఏం చేసేటట్టు? ఆలోచించగా. ఆలోచించగా, అతనికి ఒకే ఉపాయం తోచింది. ఎలాగయినా బలవర్ధనుణ్ణి మోసం చేసి, తన యింటికి తెచ్చి, చంపి, అతని గుండెకాయతో భార్యకు వైద్యం చేయించాలని నిశ్చయించుకొన్నాడు. మిత్రద్రోహం చేసేందుకు అతనికి మనసొప్పలేదు కానీ మరో మార్గమేదీ కనిపించలేదు.

వెంటనే అవతలి ఒడ్డుకు వెళ్ళి బలవర్ధనుణ్ణి కలిశాడు. "ఇదేమిటి, మీ యింటికి వెళ్ళి కొన్ని రోజులు గడిపి వస్తానని వెళ్ళి, వెంటనే తిరిగొచ్చావేం?" అన్నాడు బలవర్ధనుడు.

క్రకచుడు నవ్వుతూనే అబద్ధం చెప్పాడు. "మిత్రమా, నువ్విచ్చిన పళ్ళు తీసుకెళ్ళి నా భార్యకిచ్చాను. అవి రుచి చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత మంచి పళ్ళు నీకెక్కడివి అంది. నేను నీ విషయం చెప్పాను. మనిద్దరి స్నేహం గురించి చెప్పాను. అంత మంచి స్నేహితుణ్ణి ఒంటరిగా ఎలా వదిలివచ్చావు? ఇప్పుడే వెళ్ళి అతన్ని మన యింటికి విందుకు తీసుకురా. లేకపోతే నేను నీతో మాట్లాడను అంటూ నన్ను పంపేసింది. నువ్వు నాతో వస్తేనే ఆమె నాతో మాట్లాడుతుంది. పద” అన్నాడు.

ఆమె అభిమానానికి బలవర్ధనుడు చాలా సంతోషించాడు. కానీ ఒకటే చిక్కు, “మీరు నీళ్ళలో ఉంటారు, నేను చెట్టుమీద ఉంటాను. ఈ నీళ్ళలో ఈదుకొంటూ నీ యింటికి రావటం నాకెలా వీలవుతుంది?" అన్నాడు.

"అది నేను ముందే ఆలోచించాను. మా యింటి పక్కనే ఓ దిబ్బ వుంది, దానిమీద పెద్ద చెట్లున్నాయి. నువ్వు వాటి మీద ఉండొచ్చు. ఇంక నదిలో ప్రయాణం మాటంటావా? నువ్వు నావీపు మీద ఎక్కు ఏ ప్రమాదం లేకుండా నేను తీసుకెళ్తాను” అంటూ తొందరపెట్టి క్రకచుడు కోతిని వీపుమీద ఎక్కించుకొని తన యింటి వైపుకు ఈదసాగాడు.

అయితే క్రకచుడికి మనసులో మిత్రద్రోహం చేస్తున్నాననే బాధ ఉండిపోయింది. ఎప్పటిలా కబుర్లు చెప్పలేక, మౌనంగా ప్రయాణం సాగించాడు. బలవర్ధనుడు "ఏమిటి మిత్రమా, ఇవాళ అదోలా ఉన్నావు. ఇంటిదగ్గర అందరూ క్షేమంగా లేరా?" అని అడిగాడు.

"ఫరవాలేదు, కానీ నీ చెల్లెలు, అదే నా భార్యకు కొంచెం సుస్తీ చేసింది” అన్నాడు క్రకచుడు.

"అంత చిన్న విషయానికి, యింతలా మనసు పాడు చేసుకోవటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ధైర్యంగా ఉండు” అన్నాడు బలవర్ధనుడు.

“మరీ చిన్నజబ్బు కాదు, ఒక పాళన తగ్గేట్టు లేదు”

"అయితే మరి మంచి వైద్యం చేయించావా? వైద్యుడేమంటాడు?”

"బతకటం కష్టం అంటున్నాడు. ఆమె మాత్రం యమయాతన పడుతున్నది" అన్నాడు క్రకచుడు. బలవర్ధనుడు నిర్ఘాంతపోయాడు.

"అలాంటి పరిస్థితిలో యిప్పుడు నాకు విందేమిటి? నీకు మతిగానీ పోయిందా?” అన్నాడు. క్రకచుడు చావు కబురు చల్లగా చెప్పాడు. "మిత్రమా నేను నిన్ను తీసుకెళుతున్నది విందు కోసం కాదు. వైద్యానికి కోతి గుండెకాయ కావాలన్నారు. ..దానికోసం!"

బలవర్ధనుడికి గుండె ఆగినంత పనయింది. క్రకచుడి మోసం అర్ధమయింది. అయితే తెలివయినవాడు కనుక, వెంటనే మంచి ఉపాయం ఆలోచించుకోగలిగాడు.

"అయ్యో, క్రకచా! ఆ మాట నాకు ముందు చెప్పద్దా? నీకు నా గుండెకాయ కావాలని నాకేం తెలుసు? వెళ్తున్నది. విందుకే గదా! బరువెందుకని నేను నా గుండెకాయ మన మేడిచెట్టుకు తగిలించి వచ్చాను. మిత్రుడి దగ్గిర యిలా విషయం దాచకూడదు. పోనీలే, అయిందేదో అయింది, వెనక్కెళ్ళి గుండెకాయ తీసుకొచ్చుకుందాం పద" అన్నాడు.

క్రకచుడు వెనక్కి తిరిగి మళ్ళీ ఒడ్డుదాకా వచ్చాడు. బలవర్ధనుడు చటుక్కున అతని వీపుమీదినుంచీ దూకి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్నాడు. "నీచుడా! యింక నువ్వు పోవచ్చు. నీతో నేస్తం కట్టిన నేరానికి నా ప్రాణాలే తీద్దామనుకొన్నావు. నీలాంటి తుచ్చుడితో స్నేహం చేసి పెద్ద పొరపాటు చేశాను. అదృష్టం బాగుండి బయటపడ్డాను. నేటితో మన స్నేహం ఖతం. ఇక్కణ్ణించి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడూ రాకు" అని క్రకచుణ్ణి తిట్టి పంపేశాడు. పంపే ముందు, తనను చంపబోయిన నక్కను మోసగించి తప్పించుకొన్న తాబేలు కథొకటి చెప్పి పంపాడు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...