చిత్రాంగుడు
లఘుపతనకుడు-కాకి
హిరణ్యకుడు-ఎలుక
మంథరుడు-తాబేలు
ఓరోజు కాకీ (లఘుపతనకుడు), తాబేలూ (మంథరుడు), ఎలుకా (హిరణ్యకుడు) మూడూ కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నయ్. ఇంతలో అక్కడికి ఒక లేడి పరిగెత్తుతూ వచ్చింది. దానిని చంపటానికి ఓ బోయవాడు దాని వెనక తరుముకొంటూ వచ్చి, దాని వేగం అందుకోలేక వెనకబడిపోయి, యిక దాన్ని వదిలేసి వెనక్కు వెళ్ళిపోయాడు. కబుర్లాడుకొంటున్న ముగ్గురు మిత్రులూ ఆ లేడినీ, దాని పరుగునీ చూసి మొదట కొంచెం కంగారుపడ్డాయి. కానీ, వేటగాడు వెనక్కెళ్ళటం చూసి వాటికి ధైర్యం వచ్చింది. లేడిని పలకరించి ‘నీ కథేమిటి?’ అని అడిగాయి.
“నా పేరు చిత్రాంగుడు. వేటగాడి భయంతో నేను పారిపోయి వచ్చాను. మీరు నాతో నేస్తం కడితే, మీతోపాటు యీ అడవిలోనే ఉండిపోతాను!” అన్నదా లేడి.
మంథరుడు, “చిత్రాంగా, నువ్వు మంచివాడివని చూడగానే తెలుస్తున్నది. హాయిగా మాతో జట్టు కట్టు. నిర్భయంగా ఈ అడవిలోనే ఉండిపో. అందరం కలిసే ఉందాం” అన్నాడు. అప్పట్నించీ ముగ్గురు మిత్రులు నలుగురయ్యారు.
ఒకనాడు చిత్రాంగుడు మేతకోసం వెళ్ళి, మామూలు వేళకు తిరిగి రాలేదు. మంథరుడికి కొంచెం భయం వేసింది. “ఈ చిత్రాంగుడు ఇవాళ యింతసేపయినా తిరిగి రాలేదేమిటి? ఏదయినా ప్రమాదంలో చిక్కుకున్నాడా? పోనీ, అడవిలోకి వెళ్ళి చూసొద్దామంటే, నేను తాబేలును, అంత త్వరగా కదలి చూసి రాలేను. పోనీ మిమ్మల్ని పంపిద్దామంటే, మీరు తిరిగి వచ్చేవరకూ నాకు మనసు మనసులో ఉండదు. ఎలా?” అన్నాడు.
లఘుపతనకుడు, “నేను కాకిని కదా! ఎగిరి క్షణాల మీద అడవి అంతా వెతికి, యిక్కడున్నట్టు తిరిగొచ్చేస్తాను” అంటూ ఎగిరి వెళ్ళాడు. అడవిలో ఓ మూల వలలో చిక్కుకుపోయిన చిత్రాంగుడు కనిపించాడు. కాకి వెంటనే వెనక్కి వెళ్ళి, హిరణ్యకుడిని తన వీపు మీద ఎక్కించుకొని తీసుకొచ్చింది. ఎలుక చకచకా వల తాళ్ళు కొరికేసి చిత్రాంగుణ్ణి విడిపించింది.
ముగ్గురూ కలిసి తిరిగివస్తూండగా, చిత్రాంగుడు అన్నాడు “ఎవరికయినా కర్మ అనుభుంచక తప్పదనుకొంటాను. నేను కిందటి జన్మలో చేసిన పాపమో ఏమిటో, ఎప్పుడూ నాకిలాంటి యిబ్బందులు తప్పటం లేదు. అసలు నాకు
ఆరునెలల వయస్సప్పుడ ఓసారి ఒక వేటగాడి వలలో చిక్కుపడిపోయాను. మా గుంవులో మిగిలిన లేళ్ళన్నీ పారిపోయాయి. ఆ వేటగాడు ఎందుకో నామీద దయదలిచాడు. వలలో నుంచి నన్ను బయటకు తీసి, తన భుజాన ఎత్తుకున్నాడు. సరాసరి నన్ను తీసుకెళ్ళి ఆ దేశం రాజకుమారుడికి కానుకగా యిచ్చేశాడు. ఆ రాజకుమారుడు నన్ను చూసి ముచ్చటపడ్డాడు. నన్ను చాలా ప్రేమగా చూసుకొనేవాడు. అందువల్ల నేను ఆ ఊరంతా యథేచ్ఛగా, హాయిగా తిరుగుతూ, మేత మేస్తూ ఆడుకొంటూ కాలక్షేపం చేసేవాణ్ణి. ఓరాత్రి నేను రాజకుమారుడి పడకగది పక్కన వసారాలో పడుకొని ఉండగా, మంచి వాన పడింది. ఆ వాన చూడగానే నాకెందుకో మా లేళ్ళగుంవు జ్ఞాపకానికి వచ్చింది.‘మళ్ళీ మా లేళ్ళ గుంపులో మిగిలిన లేళ్ళను కలుసుకొని అడవిలో హాయిగా, వాటితో కాలం గడిపే అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో!’ అనుకొని ఆ మాటే పైకి అన్నాను. నేను మనిషి భాషలో మాట్లాడటం విని రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిచి -‘యిలా జంతువులు మనిషి భాషలో మాట్లాడితే, అదేమయినా శుభానికీ, అశుభానికీ శకునమా?’ అని అడిగాడు. జ్యోతిష్కుడు ‘జంతువులు మానవభాషలో మాట్లాడితే రాజ్యానికి అరిష్టమూ, అపశకునమూ కాబట్టి వెంటనే జపాలూ, హోమాలూ చేసి శాంతి చేయాలని’ సలహా యిచ్చాడు. నన్ను మాత్రం వెంటనే తీసుకెళ్ళిపోయి మళ్ళీ అడవిలో వదిలేశారు. అప్పుడే వేటగాడు నావెంట బడటం, నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యివాళ ఈ ప్రమాదంలో చిక్కుకున్నాను. ఏరోజు ఏం జరుగుతుందో, ఎలా రాసిపెట్టి ఉందో ఎవరూ చెప్పలేదు! ఇలా చిత్రాంగుడు తన పాత కథలన్నీ చెపుతుంటే, ముగ్గురూ నిదానంగా వెనక్కి వెళుతున్నారు. వీళ్ళు చేరటం ఆలస్యమవుతున్నకొద్దీ, అక్కడ మంథరుడికి కంగారు పెరిగిపోయి, ఆగలేక తను కూడా వాళ్ళను వెతుకుతూ అడవిలోకి నడవసాగాడు. మధ్యలోనే వాళ్ళు ఎదురుపడటంతో, మంథరుడికి ప్రాణం లేచి వచ్చింది . “అమ్మయ్యా! మీరు ముగ్గురూ క్షేమంగానే ఉన్నారు కదా! మీరు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి ఏం ప్రమాదం జరిగిందోనని నేను చాలా భయపడిపోయాను. అందుకే యిక ఆగలేక నేను దియల్దేరి వచ్చాను” అన్నాడు.
హిరణ్యకుడికి మాత్రం యిది నచ్చలేదు. “అంత కంగారయితే ఎలా? ఓ గడియ అటూ ఇటూగా రానే వస్తున్నాం కదా, నువ్వెందుకింత సాహసం చేసి బయల్దేరాటం? అక్కడయితే చెరువు ఉంది కాబట్టి ఏదయినా యిబ్బంది వస్తే నువ్వు చటుక్కున నీళ్ళలోకి దూరి తప్పించుకోవచ్చు. ఈ అడవి మార్గంమంత మిట్ట. నువ్వేమో తొందరగా నడిచి తప్పించుకోలేవు. నువ్వు యిలా రావలసింది కాదు!” అన్నాడు.
ఇంతలో నీళ్ళతో పాటు ఎగురుతూ వస్తున్న లఘుపతనకుడు కేకవేశాడు. “అదిగో చూడండి! మీరు మాటలతో పెళ్ళినడకలు నడునస్తూంటే అక్కడ వలపన్నిన వేటగాడు మనవెనకే వచ్చేశాడు. పారిపోకపోతే ప్రాణాలు దక్కవు. పరుగుపెట్టండి” అని.
ఆ కేక విని లేడి అయితే పరుగు పెట్టి పారిపోయింది. ఎలుక కూడా చకచకా వెళ్ళి దగ్గరలో ఉన్న కలుగులోకి దూరిపోయింది. తాబేలు ఏం చేస్తుంది పాపం, పరిగెత్తలేదాయె. వేటగాడికి దొరికిపోయింది! వాడు కనీసం అదయినా దొరికినందుకు సంతోషించి, దాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్ళిపోయాడు.
మంథరుడిని యిప్పుడెలా రక్షించాలో తెలియక, మిగిలిన ముగ్గురు మిత్రులూ కళ్ళనీళ్ళు కారుస్తూ ఆ వేటగాడికి కొంచెం వెనుకగా నడవసాగారు. హిరణ్యకుడు ఆలోచనాపరుడూ, తెలివయినవాడూ కదా? “ఊరికే దుఃఖిస్తూ కూర్చోకూడదు. ఈ వేటగాడు అడవి దాటిపోయే లోపల మంథరుణ్ణి విడిపించే ఉపాయం ఆలోచించాలి. లేకపోతే మనకు మంథరుడు దక్కడు!” అన్నాడు.
“ఒక గండం తప్పింది గదా అని యిప్పుడే కొంచెం సంతోషిస్తుంటే ఈ రెండో ప్రమాదం వచ్చిపడింది. మాకయితే బుర్రలు వనిచేయట్లేదు. నువ్వే ఏదయినా ఉపాయం ఆలోచించాలి!” అన్నారు చిత్రాంగుడూ, లఘుపతనకుడు.
“ఆయితే, వినండి. చిత్రాంగుడు వేటగాడికి కనపడకుండా వెళ్ళిపోయి చెరువుగట్లున, కాళ్ళు చాచి, కళ్ళు
తేలవేసి చచ్చి పడిపోయినట్టు నటిస్తూ పడుకోవాలి. అప్పుడు లఘుపతనకుడు లేడి మీద వాలి, ముక్కుతో లేడి కళ్లు పొడుస్తున్నట్లు నటించాలి. అప్పుడు వేటగాడు లేడి చచ్చిపోయి పడి ఉన్నదనుకొని దానికోసం వస్తాడు. లేడిని తీసుకెళ్ళాలంటే తాబేలును నేలమీద పెట్టి రాక తప్పదు. అతను అలా చేయగానే నేను వెళ్ళి తాబేలు కట్లు కొరికివేసి విడిపిస్తాను. తాబేలు చటుక్కున నీళ్ళలోకి దూరిపోతుంది. నేను ఒక కలుగు చూసుకొని అందులోకి వెళ్ళిపోతాను. ఇంతలో చిత్రాంగుడు లేచి పరుగుపెడతాడు. లఘుపతనకుడు తన మానాన తను ఎగిరిపోతాడు!” అని ఉపాయం చెప్పాడు హిరణ్యకుడు.
మిత్రులందరూ ఉపాయాన్ని తూచా తప్పకుండా పాటించాయి. మంథరుడు చెరువులోకి వెళ్ళిపోయాడు. హిరణ్యకుడు కలుగులోకి దూరిపోయాడు. చిత్రాంగుడు చెంగు చెంగున పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఎగిరిపోయాడు. వేటగాడికి ఏమీ మిగలలేదు, నిరాశ తప్పా!
మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
ధన్యవాదలు...
ఇంకా ఉంది...