జిత్తులమారి నక్క
"అనగా అనగా మగధదేశంలో ఒక అడవి. ఆ అడవిపేరు మందారవతి. ఆ అడవిలో ఒక జింకా, ఒక కాకీ ఉండేవి. వాటికి మంచి సఖ్యత కుదిరింది. ఎన్నో సంవత్సరాలు అవి స్నేహంగా, హాయిగా తిరిగాయి. జింకకు ఆ అడవిలో మేత కావలసినంత దొరికేది. హాయిగా తిని ఆరోగ్యంగా, బలంగా ఎదిగింది.ఓరోజు జింక అడవిలో అటూ యిటూ గెంతులేస్తూ ఆడుకౌంటుంటే ఓ నక్క దాన్ని చూసింది. నక్కకు కళ్ళు కుట్టినయ్. “ఎంత బలంగా బలిసిందీ ఈ జింక! దీన్ని చూస్తే, ఎప్పుడెప్పుడు దీన్ని చంపి, ఆ మాంసం తినగలనో అని నాకు నోరూరిపోతున్నది. దీన్ని చంపటానికి ఏదయినా మంచి ఉపాయం ఆలోచించాలి” అనుకొన్నది.
జింకకు దగ్గిరగా వెళ్ళింది. “మిత్రమా, బావున్నావా?” అని అడిగింది కుశలప్రశ్నగా.
జింక బెదిరిపోయి, “నువ్వెవరో నాకు తెలియదు, నా
జోలి నీకెందుకు?” అంటూ అక్కన్నించి పారిపోబోయింది. “భయపడకు, నేను నక్కను. నా పేరు సుబుద్ది. నావల్ల నీకేమీ భయంలేదు. ఎటొచ్చీ నేనే ఈ అడవిలో ఓంటరిగా బతుకుతున్నాను. నా తోటి నక్కలన్నీ ఈ అడవి వదిలేసి ఎటో వెళ్ళిపోయాయి. ఇప్పుడిక్కడ ఎవరూ తోడు లేకుండా ఒక్కడినీ చావలెక బ్రతుకుతున్నాను. నిన్ను చూడగానే ఎందుకో నాతోటివాళ్ళందరినీ చూసినంత ఆనందం కలిగింది. దేవుడిలాంటి నిన్ను చూస్తేనే, నాకు నీతో సహవాసం చెయ్యాలని అనిపిస్తున్నది. నాలాంటి నిర్భాగ్యుడి ఒంటరితనం పోగొడితే నీకేం నష్టం చెప్పు?” అంటూ నక్క తన జిత్తులన్నీ ఉపయోగించి జింకకు నచ్చజెప్పింది.
జింక నమ్మెసింది. సరే, కానియ్యమని నక్కతో కలిసి తిరగటానికి ఒప్పుకొంది. సాయంత్రం దాకా తిరిగి, జింక తన యింటికి వెళుతూ నక్కని కూడా తనతో తీసుకెళ్ళింది. అక్కడ జింక కోసం కాకి కాచుకొని ఉంది.
నక్కతో పాటు వచ్చిన జింకని చూసి, ‘ఈ కొత్త 'స్నేహితుడినెక్కడ సంపాదించావ్?’ అంది.
“దీని పేరు సుబుద్ది, ఒంటరిదట. నక్క అయినా మంచిదానిలాగే కనిపిలచింది. మనతో స్నేహం చేస్తానంది’ సరేనన్నాను” అంది జింక.
కాకికిది నచ్చలేదు. “కొత్తగా వచ్చినవాళ్ళని అలా ఎలా నమ్మేస్తావు? ఇది ఏమాత్రం మంచిపని కాదు. గుణగణాలు తెలియకుండా కొత్తవాళ్ళతో స్నేహం చేయటం చాలా ప్రమాదం పిల్లికి చోటిచ్చి, గద్ద అన్యాయంగా చచ్చిపోయిన కథ ఉండనే ఉంది. మరిచిపోయావేమో, చెప్తా విను” అంటూ కథ మొదలెట్టింది.
మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
ధన్యవాదలు...
ఇంకా ఉంది...
తరువాత కథ: గుడ్డిగద్ద మొదటి భాగము
No comments:
Post a Comment