గుడ్డిగద్ద-1
"పూర్వం గంగానది ఒడ్డున ఓ జువ్విచెట్టు తొర్రలో జరద్గవం అనే గద్ద ఉండేది. అది గుడ్డిది. పైగా మసలిదయిపోయింది. అంచేత, ఆ చెట్టుమీద గూళ్ళు కట్టుకొని ఉండే యితర పక్షులు కొన్ని దానిమీద దయ తలిచి, రోజూ తాము తెచ్చుకోనే ఆహారంలో కొంచెం దానికీ పంచేవి. అలా బతుకుతూ ఉండేది ఆ గుడ్దిగద్ద. పక్షులు ఆహారం కోసం పగలు బయటికి వెళితే, ఆ పక్షుల గూళ్ళలో ఉండిపోయిన పక్షిపిల్లలకు కొంచెం తోడుగా, కాపలాగా ఉండేది.
“ఓరోజు ఆ చెట్టు దగ్గరికి ఓ పిల్లి వచ్చింది. దానిపేరు దీర్ఘకర్ణం. పక్షులు లేనపుడు, ఎలాగయినా చెట్టెక్కివాటి గూళ్ళలో ఉన్న పక్షి పిల్లలని చంపి తినేయాలని దాని ఆలోచన. పిల్లి వచ్చినట్టు, గుడ్డి గద్దకు తెలియలేదు కానీ, పక్షి పిల్లలు మాత్రం పిల్లిని చూసి భయంతో కేకలు పెట్టాయి. ఆ శబ్దం విని, గుడ్డిగద్ద "ఎవరొచ్చారు?" అని బిగ్గరగా అరిచింది.
ఆ అరుపుకు పిల్లి భయపడిపోయింది. గద్ద గుడ్దిదని దానికి వెంటనే తెలియలేదు. “చచ్చాను, మరీ దగ్గరికి వచ్చేశాను. తప్పించుకోవాలంటే మార్గం లేదు. అయినా రోటిలో తలపెట్టి, రోకలి దెబ్బకు భయపడి ఏం లాభం? చేసిన పొరపాటు చెయ్యనే చేశాను. ఇప్పుడు బయటపడాలంటే ఈ గద్దకు ఏదో మాయమాటలు చెప్పి నమ్మించటమే తప్పా మరో ఉపాయం లేదు“ అనుకొని గద్ద ఎదురుగా నిలబడ్దది.
“అయ్యా నమస్కారం!” అన్నది.
“ఎవరు నువ్వు?” గద్దించింది గద్ద.
“నేనొక పిల్లిని. నాపేరు దీర్ఘకర్ణం”
“అయితే యిక్కడేం చేస్తున్నావు. తక్షణం యిక్కణ్ణించి పో, లేకపోతే చంపేస్తాను.”
“ముందు నే చెప్పేది వినండి. తరువాత నన్ను చంపాలో, చంపక్కర్లేదో మీరే తేల్చుకోండి. మంచిచెడ్డలు తెలుసుకోకుండా, దగ్గరికొచ్చిన వాళ్ళందంనీ చంపటం ధర్మంకాదు”.
“త్వరగా చెప్పు, యిక్కడికెందుకొచ్చావ్ నువ్వు?” మళ్ళీ గద్దించింది గద్ద.
"నేను సాధుజంతువును. పుణ్యం కోసం రోజూ యిక్కడ గంగానదిలో స్నానం చేయటానికి వస్తూ ఉంటాను. నేను మాంసాహారం తినటం ఎప్పుడో మానేశాను. బహ్మచారిని, చాంద్రాయణ వ్రతం చేసుకొంటూ ఉన్నాను. ఇక్కడి పక్షులన్నీ మీరు పెద్దలనీ, నీతిశాస్త్రం తెలిసినవాళ్ళనీ, చాలా మంచివారనీ, పండితులనీ ఎప్పుడూ చెప్పుకొంటూ ఉంటే విన్నాను. ఎప్పణ్ణించో మిమ్మల్ని కలవాలని నా కోరిక, మీలాంటి పెద్దల దగ్గిర నాలుగు మంచి నీతులూ, ధర్మాలు తెలుసుకోవాలని వచ్చాను. మీరు నన్నిలా చంపుతాననటం న్యాయం కాదు. శత్రువయినా, యింటికొస్తే మర్యాద చేయటం ధర్మం. అలా చేయకపోవటం గొప్ప పాపమని మీకూ తెలుసు గదా?” అని పిల్లి అనేసరికి, ముసలి గద్ద కొంచెం మెత్తబడింది.
“నువ్వు చెప్పేదీ నిజమే. కానీ ఈ చెట్టు మీద పక్షిపిల్లలెన్నో ఉన్నయ్. మామూలుగా పిల్లులకు ఈ పిట్టల మాంసమంటే మహాయిష్టం. అందుకని నిన్ను గద్దించి నిలదీయక తప్పలేదు.” అంది.
పిల్లి యిది విని చెవులు రెండూ మూసుకొంది.
“కృష్ణా, కృష్ణా! ఎంత మాటన్నారు! అసలు ఈ పిల్లి జన్మ ఎత్తటమే మహాపాపమని నేను కుమిలిపోతుంటే, అది చాలక పక్షిపిల్లల్ని తినేసి మరింత పాపం కూడగట్టుకొంటానా? ధర్మశాసస్త్రాలన్నిట్లోనూ, “అహింసా పరమో ధర్మః” అనే గదా నీతి బోధించారు, అంటే జీవహింస చేయకపోవటమే అన్నిటికంటే ముఖ్యమయిన ధర్మమనే గదా? జీవహింస చెయ్యని దయాళువులే స్వర్గానికి వెళతారు. భూతదయ మించిన ధర్మం లేదని నాకు తెలియదా? తెలిసి ఈ పసికూనలను తింటానా? నా పాడు పొట్ట నింపుకోవాలంటే 'ఈ అడవిలో యిన్ని చెట్లున్నాయి, ఏదో యింత శాకాహారం దొరక్కపోదు. ఈ చిన్న చిన్న పిట్టలను తినేసి, నరకానికి పోవాలని నేనెందుకు కోరుకొంటాసు?” అంటూ అతి వినయంగా మాయమాటలు వల్లించింది.
మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి....
ధన్యవాదలు...
ఇంకా ఉంది...
తరువాత కథ: గుడ్డిగద్ద-2
Please visit the blog.share and comment the story...enjoy by reading the story
No comments:
Post a Comment