గుడ్డిగద్ద-2
ముసలిగద్ద ఈ మాటలన్నీ నమ్మేసింది." బాధపడకు కొత్తవాళ్ల స్వభావం ఎలా ఉంటుందో మొదటే తెలియదు కదా! కనుక నీ సంగతి తెలియక గట్టిగా మాట్లాడాను.తప్పు నాదే యింక అది వదిలేసెయ్. ఇక ముందు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు, పోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు” అన్నది.
అప్పటినించీ పిల్లి, గద్దతో 'స్నేహం నటిస్తూ ఆ చెట్టు తొర్రలోనే ఉండిపోయింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత, పిల్లి ముసలిగద్దకు తెలియకుండా ప్రతిరోజూ, అర్ధరాత్రి చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షికూనల్ని గొంతు కొరికి చంపి, తొర్రలో పెట్టుకొని తినేయడం మొదలెట్టింది.
ఆ పక్షులకు తమ పిల్లలెలా మాయమవుతున్నయ్యో అర్ధంగాక అన్నిచోట్లా వెతకటం మొదలెట్టినయ్. ఆ విషయం తెలుసుకొని ఓరోజు పిల్లి చల్లగా పారిపోయింది.
పక్షులను వెతకగా, వెతకగా చెట్టు తొర్రలో పక్షికూనల బొమికలు కనపడ్డయ్. ఈ ముసలిగద్దె రహస్యంగా తమ పిల్లల్ని పొట్టనపెట్టుకుందని అనుమానించి, పక్షులన్నీ కలిసి గద్దమీద పడి దాన్ని రక్కి, పొడిచి చంపేసినయ్.
కనక, కొత్తవాళ్ళని తెలియకుండా నమ్మేస్తే కష్టాల్లో
పడే అవకాశం ఉంది, అని కథ ముగించింది కాకి. కాకి యిలాంటి నీతి బోధించి జింకను కూడా సందేహంలో పడేయటం చూసి నక్కకు ఒళ్ళు మండిపోయింది. “చాలు చాల్లే, పెద్ద నీతి` చెప్పావు. జింక మొదట్లో నీతో ‘స్నేహం చేసినపుడు దానికి నీ గురించి మాత్రం ఏం తెలుసు? అప్పుడు నువ్వూ కొత్తే. కొత్తని సందేహిస్తే మీకు యిలా చక్కగా స్నేహం కుదిరేదా? నువ్వు ముందొచ్చావు కాబట్టి యిప్పుడు నోటికొచ్చినట్టూ మాట్లాడుతున్నావ్, నీకే అన్ని తెలిసినట్లు. చెట్టులేని చోట ఆముదం చెట్టే మహావృక్షమని సామెత చెప్తారు. అలాగ, మహానుభావులు లేనిచోట అల్పబుద్ది వాళ్ళమాట చెల్లుతుంది. వీడు మనవాడు, వీడు పరాయివాడని లెక్కలు అల్పులకి. మహాత్ములకి ప్రపంచమంతా ఒకటే కుటుంబం. అందరూ కావలసివవాళ్ళే. ఎందుకీ లేనిపోని అనుమానాలు? నువ్వూ నేనూ, ఈ జింకా మనమందరం బంధువులమే. అందరం నాలుగురోజులు బతికి, తరువాత వెళ్ళిపోయవాళ్ళమే. ఈ ప్రపంచం ఉన్నన్నాళ్ళు బతకబోతున్నామా? యముడు ఏదోరోజు మనల్ని మింగేయటానికి సిద్దంగా కాచుకొనేఉన్నాడు. ఈ మూన్నాళ్ళ ముచ్ఛటలో అనుమానాలూ, శత్రుత్వలూ ఎందుకూ?
ఉన్నన్నాళ్ళూ అందరిచేత మంచి అనిపించుకొని అందరిలోనూ స్నేహంగానే ఉందాం” అని పెద్ద ఉపవ్యాసమిచ్చింది.
జింకక్కూడా ఈ వాదాలన్నీ అనవసరం అనిపించింది “ఉన్న నలుగురం నాలుగురోజులు కలిసి మెలిసి ఉండటమే సుఖం. వీడు మిత్రుడూ, వీడు శత్రువూ అని మొహం చూడగానే చేప్పలేం” అంది.
కాకి కూడా యిదంతా విని సరేనంది. కాకీ, జింకా, నక్క కొన్నాళ్ళు ఆ అడవిలో సావాసంగానే గడిపాయి.
ఓరోజు నక్క జింకను తనతోపాటు తీసికెళ్ళి ఒక పంటపొలం చూపించింది. ఆ పొలంలో పంట బాగా ఏపుగా పెరిగి ఉంది.“ జింక రోజూ ఆ పొలంలో పడి కడుపునిండా మేయడం మొదలెట్టింది. ఆ పొలం యజమాని చూస్తూ ఊరుకోడు గదా! “ఈ జింక ఏదో యిక్కడ బాగా మేయడం మరిగింది. నా పంట నాశనం చేస్తుంది. దీన్ని ప్రాణాలతో వదిలిపెట్టను” అనుకొని, ఒకనాడు పొలంలో కనపడకుండా వల సరిచేసి యింటికెళ్ళాడు. అలవాటు ప్రకారం జింక మేత కోసం వచ్చి వలలో చిక్కుకుపోయింది.
ఎలా బయటపడుతుంది? “ఎంత దురదృష్టం, యిక్కడ చిక్కుపడిపోయాను! ఇప్పుడు నక్క వస్తే ఏదో ఉపాయం ఆలోచించి నన్ను బతికిస్తుంది” అని ఆలోచిస్తూ కూర్చొంది.
నక్కరానే వచ్చింది. దాని ఆలోచన వేరు. “యిన్నాళ్ళకి జింక వలలో పడిపోయింది. యిప్పుడు రైతు వస్తాడు. తన పైరంతా మేసి నాశనం చేసిన జింకను ప్రాణాలతో వదలడు. జింక చావు ఖాయం. నాకూ బోలెడంత మాంసమూ, ఎముకలూ దొరక్కమానవు. ఇవాళ నాకు పండగే” అనుకొంటూ వల్లో పడిపోయిన జింకకు దగ్గిరగా వెళ్లింది.
నక్కను చూసిన జింకకు ప్రాణం లేచొచ్చింది. అమ్మయ్యా! యింక బ్రతికినట్లే అనుకొంది. “నక్కబావా, నీకోసమే చూస్తున్నాను. రైతు వచ్చే వేళయింది. అతనొచ్చె లోపు ఈ వల తాళ్లు కొరికిపెట్టావంటే నేను బతికి బయటపడతాను. త్వరగా కొరికెయ్యవా?” అంది.
మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి....
ధన్యవాదలు...
ఇంకా ఉంది...
No comments:
Post a Comment