హిరణ్యకుడి కథ
లఘుపతనకుడు-కాకి
చిత్రగ్రీవుడు-పావురాల రాజు
హిరణ్యకుడు-ఎలుక
మంథరుడు-తాభేలు
1
లఘుపతనకుడు, హిరణ్యకుడిని మంథరుడికి పరిచయం చేశాడు, “మిత్రమా, ఈ ఎలుకల రాజు మంచి గుణవంతుడు, పుణ్యాత్ముడు, ఎంతో గౌరవించదగ్గవాడు” అంటూ.మంథరుడు విని సంతోషపడ్డాడు. “హిరణ్యకా, నువ్వు దేశమంతా వదిలిపెట్టి కీకారణ్యంలో ఎందుకుంటున్నావు? దానికేమయినా కారణం ఉందా?” అని అడిగాడు.
హిరణ్యకుడు తన జీవితకథ చెప్పుకొచ్చాడు. "మంథరా, మొదట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ ఊళ్ళో చాలామంది సన్యాసులు ఉండేవాళ్ళు, వాళ్ళలో చూడాకర్ణుడు అనే వాడొకడుండేవాడు. ఆయన రోజూ భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్ధాలన్నీ ఓ గిన్నెలో పెట్టి, దాన్ని ఓ చిలక్కొయ్యకు తగిలించి నిద్రపోయేవాడు. ఆయన నిద్రలో పడగానే నేను గబగబా ఆ గిన్నెలో ఉంచిన అన్నం తినేస్తూ ఉండేవాణ్ణి.
ఓరోజు, చూడాకర్ణుడిని కలవటానికి వీణాకర్ణుడు అనే మరో సన్యాసి అతని దగ్గిరకు వచ్చాడు. అతనితో మాట్లాడుతూ చూడాకర్ణుడు మధ్య మధ్యలో నన్ను భయపెట్టేందుకు ఓ కర్రతో నేలమీద కొడుతూ కూర్చున్నాడు.
“ఏమిటయ్యా, చూడాకర్ణా, అలా మధ్య మధ్య చప్పుళ్ళెందుకు చేస్తున్నాపు?“ అని అడిగాడు వీణాకర్ణుడు.
“ఈ గదిలోకి రోజూ ఓ ఎలుక వచ్చి, నేను దాచి పెట్టుకొన్న కాస్త అన్నం తినేసి పోతున్నది. దీనితో నాకు పెద్ద బెడదగా ఉన్నది” అన్నాడు చూడాకర్ణుడు.
“ఎలుకేమిటి? చిలక్కొయ్య మీదికెగరటమేమిటి? అంత చిన్న ఎలుకకి అంత బలం ఎలా ఉంటుంది? యిలాంటి వాటికేదో ప్రత్యేకమయిన కారణం ఉంటుంది” అని వీణాకర్ణుడు తన అనుభవమొకటి కథగా చెప్పసాగాడు.
“ఇదివరకోసారి నేను ఓ బ్రాహ్మణుడి యింటికి భిక్ష కోసం వెళుతుండేవాణ్ణి. ఓ రోజు ఆ !బాహ్మణుడు తన భార్యతో
మాట్లాడుతూ, ‘రేపు అమావాస్య, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా! ఏం “వండబోతున్నావు?’ అని అడిగాడు. ‘మీరేమయినా కూరలూ, పప్పులూ తెస్తే, నేను వండిపోస్తాను. మీరు ఏదీ తేకపోతే నేనేం వండుతాను?’ అంది అ యిల్లాలు. బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. ‘ఉన్నంతలో యిల్లు జరపాలి, ఉన్నదే పెట్టాలి గానీ, అది కావాలీ, యిది కావాలీ అని లేనివాటి గురించి అరాటపడటం అనవసరం’ అన్నాడు. “అలా అయితే సరే, ఉన్న పదార్థాలతోనే రేపటికి ఏదో ఏర్పాటు చేస్తాన్లెండి” అంది అతని భార్య నొచ్చుకుంటూ. యింట్లో నువ్వులు మాత్రం ఉన్నాయి. వాటితోనే ఏదో చేసి పడేద్దామని ఆ ఉన్న నువ్వులు కడిగి, దంచి, ఎండబోసింది. అంతలో ఓ కోడి వచ్చి ఎండబోసిన నువ్వులలో కాళ్ళు పెట్టి కెలికింది. బ్రాహ్మణుడు ‘ఈ కోడి కెలికిన నువ్వులు మైల పడిపోయినయి. ఇవి వంటకు పనికిరావు. ఇవి మార్చి వేరే ఏవయినా దొరుకుతాయేమో’ చూడమన్నాడు. ఆయన భార్య ఆ నువ్వులు పక్కింటికి తీసుకెళ్ళి “ఏమండీ, ఈ దంచిన నువ్వుల పప్పు తీసుకొని నాకు ముడి నువ్వులిస్తారా?” అని అడిగింది. పక్కింటావిడకి ఈ బేరం నచ్చింది. ఆమె నువ్వు పప్పు తీసుకొని, ఎత్తుకెత్తు ముడినువ్వులు యిన్వబోతుంటే ఆమె భర్త వచ్చి అడ్డుపడ్డాడు. “పిచ్చిదానా! ఎవరన్నా నువ్వు పప్పు యిచ్చి ఎత్తుకెత్తు ముడినువ్వులు తీసుకొంటారా? ఆమె అలా యిస్తున్నదంటే దానికేదో కారణం ఉండి ఉండాలి. అది తెలుసుకోకుండా, యిలాంటి బేరాలకు దిగితే నష్టం నీకే” అని చెప్పాడు. ఆయన చెప్పిన నీతి నా చెవిలోనూ పడింది, అదే నీకు చెపుతున్నాను. ఈ ఎలుక యిక్కడ ఉండటానికి, యింత బలం సంపాదించడానికీ కారణం ఏమిటో తెలుసుకోకుండా, యిలా కర్రతో చప్పుళ్ళు చేస్తూ కూర్చొంటే ఏం ప్రయోజనం?” అని కథ ముగించాడు వీణాకర్ణుడు.
2
దాంతో చూడాకర్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఒక
పలుగు తెచ్చి నేను ఏర్పాటు చేసుకొన్న కలుగు తవ్వి పడేశాడు. అందులో నేను ఎన్నాళ్ళనుంచో తీసుకొచ్చి పెట్టుకొన్న పదార్ధాలన్నీ తీసిపడేశాడు, దానితో నాకు కష్టకాలం వచ్చింది. తిండీతిప్పలూ లేక కృశించిపోయాను. ఓరోజు అలాగే నీరసంగా మెల్లగా తిరుగుతుండగా చుడాకర్జుడు నన్ను చూశాడు. నవ్వుతూ యిలా అన్నాడు :
“ధనం కలవాడే బలవంతుడు. ధనం కలవాడే పండితుడు. ధనముంటేనే అన్ని సుఖాలు. ఈ ఎలుక తన సొమ్మంతా పోగొట్టుకొని, బలం ఉడిగిపోయి, నీరసించి, మిగతా ఎలుకల్లాగా అయిపోయింది. ధనం లేకపోతే దుఃఖమే. ఆ దుఃఖం వల్ల తెలివితేటలూ నశించిపోతయ్. ధనముంటేనే పౌరుషము, మేధాశక్తీ, బంధుమిత్రులూ ఉంటారు. దారిద్ర్యం కంటే చావే మేలు. మరణం వల్ల బాధ అప్పటికప్పుడు మాత్రమే. దరిద్ర్యం వల్ల బతికి ఉన్నన్నాళ్ళూ బాధలే. శరీరం, మాట తీరూ, పేరూ, బుద్ధీ మారకపోయినా, ధనం పోగొట్టుకొన్నవాడు మునుపటి లాగా బతకలేడు. ఇదొక చిత్రం!”
ఈ మాటలు విని నాకు చాలా దుఃఖం వచ్చింది. ఇక అక్కడ నేను ఉండలేకపోయాను. నా బాధ ఎవరితో చెప్పుకొనేదీ కాదు. ధనం పోగొట్టుకొన్న విషయమూ, మనోవ్యథా, ఇంటిలో సభ్యుల తప్పుడు ప్రవర్తనా, మోసమూ, అవమానమూ యివన్నీ నలుగురికీ చెప్పుకొనే విషయాలు కాదంటారు పెద్దలు. దైవం అనుకూలించక, పరిస్థితులు చెడిపోయినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరు వదిలిపెట్టి, ఏ అడవిలోనో తలదాచుకోవటం సుఖం. అభిమానం కలవాడు పూలగుత్తిలాగా నలుగురి తలల మీదనన్నా ఉండాలి, లేదా అడవిలో ఏకాంతంలో వాడిపోవాలి. ఇక్కడ ఉండి, వాళ్ళనూ వాళ్ళనూ బిచ్చమడుగుతూ బతకటం కంటే దురవస్థ మరోటి ఉండదు. ఒక్క అల్పుణ్ణి యాచించటం కంటే నిప్పులో పడి చావటం మేలు. అబద్ధం చెప్పటం కంటే, మౌనంగా ఉండటం మేలు. యితరుల సొమ్ము దొంగిలించటం కంటే, బిచ్చమెత్తుకోవడం మేలు. ఎవరి పంచనో పడుండి, వాళ్ళు వేసే బిచ్చం మీద బతికేకంటే అసహ్యం మరోటి ఉండదు.
ఇలా అనుకొంటూనే ఉన్నాను కానీ, ఆశ వల్ల ఆ యిల్లు వదిలిపెట్టలేదు. అక్కడే ఉంటూ, పోయిన సొమ్మంతా మళ్ళీ సంపాదించుకోవచ్చునన్న ఆశతో యింకా కొన్నాళ్ళు అక్కడే ఉన్నాను. ఆశ వల్ల భ్రాంతి కలుగుతుంది. దానివల్ల దుఃఖం. దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే బుద్ధిమంతుడు దురాశకు దూరంగా ఉండాలి.
బుద్ధిలేక నేను అక్కడే ఉండిపోయాను. నాతో విసిగిపోయి, ఓరోజు చూడాకర్ణుడు యిక ఊరుకోలేక నామీద ఒ కర్ర విసిరాడు. అది తగిలిఉంటే అప్పటికప్పుడే నా ప్రాణం పోయేది. కానీ అదృష్టవశాత్తూ నేను తప్పించుకొన్నాను కానీ, ఆ దెబ్బతో నాకు జ్ఞానోదయమయింది. “ఆహా,యీ ప్రపంచంలో అన్ని కష్టాలకూ కారణం ధనం మీద అశే. అది వదిలేయ గలిగితే లోకంలో అంతకంటే సుఖం ! మరోటి లేదు. ఆశ వదిలేసినవాడు అన్ని రకాలా ఉత్తముడు. పండితుడంటే వాడే సజ్జనుడంటే వాడే ఊరికే పొట్టకోసం పదిమందినీ వేధించకుండా, దొరికినదాంతో తృప్తిపడేవాడు ధన్యుడు. అన్ని రకాలుగా సుఖపడతాదు. మనం చేసుకొన్న కర్మబట్టి, మనకు రావాల్సినవి రానే వస్తాయ్. దానికోసం తిప్పలు పడటం నిరర్థకం.
ఈ సన్యాసుల మఠం నా తాత, ముత్తాతలు సంపాదించిపెట్టిన అస్తేమీ కాదు. యిన్ని అగచాట్లు పడుతూ నేను యిక్కడ ఉండటం యింక అనవసరం. ఈ సన్యాసి చేత రోజూ దెబ్బలు తినే కంటే, ఏదో అడవిలో దూరి కాలం గడపటం మంచిది. బండరాయి మధ్యలో దాక్కొన్న కప్పకు కూడా ఆహారం చూపించే ఆ దయామయుడయిన భగవంతుడు నాకు దోవ చూపించకపోతాడా?’ అనుకొంటూ, అక్కణ్నుంచి బయలుదేరి ఊరు వదిలిపెట్టి, అడవిలోకి వెళ్ళిపోయాను. ఆ అడివిలోనే ఆకులూ, అలములు తింటూ, కుంటల్లో నీరు తాగుతూ, చెట్లకింద ప్రశాంతంగా కాలం గడిపాను. తర్వాత నాకు ఈ లఘుపతనకుడితో స్నేహం కుదిరింది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాం. ప్రాణానికి హాయిగా ఉంది.
మంచిమిత్రులతో కలిసి కాలం గడపటం కంటే గొప్ప సుఖం లోకంలో లేదు. అసలీ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప ఆనందాలు రెండు. ఒకటి, చక్కటి పుస్తకాలు చదివి సంతోషించటం, రెండు మంచి మనసు గల మిత్రులతో కాలక్షేపం.” అంటూ హిరణ్యకుడు తన కథ ముగించాడు. (పిల్లాలూ, ఈ కథల్లో జంతువులు మనుషులలాగే మాట్లాడుకొంటున్నట్లు చెప్పుకొంటున్నాం. అవి చెప్పుకునే మాటలు నీతులు! మనలాంటి మనషులకోసం అని మర్చిపోవద్దు!) .
3
శ్రద్ధగా విన్న మంథరుడు తలపంకించాడు.“నువ్వు చెప్పినదాంట్లో కొంతవరకూ నిజం ఉన్నది. కానీ ధనం శాశ్వతంగా ఉండేది కాదు. వస్తుంటుంది పోతుంటుంది. ఆరోగ్యమూ, యౌన్వనం అవీ అంతే. నిలబడేవి కావు. నదీప్రవాహంలాగా పరిగెత్తిపోయేవే. అసలు జీవితమే నీటిబుడగ లాంటిది, నిలిచేది కాదు. అయితే బుద్ధిమంతుడు ఎప్పుడు ధర్మకార్యాలు చేస్తూకాలం గడపాలి. లేకపోతేకాలం దాటిపోయిన తర్వాత, అయ్యో మంచిపనులు చేయలేకపోయానే అని పశ్చాత్తాపపడాల్సిందే. నువ్వు సొమ్ము అవసరాన్ని మించి కూడబెట్టి దాచిపెట్టావు. దానివల్లే అన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది .
చెరువులో నీళ్ళు ప్రవహిస్తూ పోవాలి. అలాగే సంపాదించిన సొమ్ము మంచిపనులకు, దానాలకు' ఖర్చుపెట్టాలి. తను తినకుండా ఉరికే డబ్బు కూడబెడుతూ పోతే, దానివల్ల సుఖం లేదు, కష్టమే. మరొకడి బరువు మన నెత్తిన పెట్టుకొని మోస్తూ తిరిగితే దానివల్ల లాభం ఏమిటి? ధనం అన్నది తను అనుభవించాలి, కొంత యితరులకి దానం చెయ్యాలి. ఈ రెండూ చేయలేకపోతే ఆ ధనం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, పిసినారివాడు ఎంత డబ్బున్నా దరిద్రుడే.
నిజానికి పిసినారి కంటే దరిద్రుడే నయం. వాడికి డబ్బు సంపాదించి దానికి కాపలాకాసే చాకిరీ లేదు. పీనాసివాడు తను తినడు, పేదవాళ్ళకు పెట్టడు. చివరికాసొమ్ము నేలపాలే, లేదంటే దొంగల పాలు. తెలివయినవాడు డబ్బు సంపాదించాల్సిందే, కానీ మరీ ఎక్కువగా కూడబెట్టాలని అనుకోగూడదు. మితి లేకుండా డబ్బు దాచాలను కొనేవాడు పాతకథలో దీర్ఘరావమనే నక్కలాగా నాశనమయిపోతాడు.‘ కథ తెలుసా నీకు? చెప్తాను, విను” అంటూ మరో కథ మొదలెట్టాడు మంథరుడు.
మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి....
ధన్యవాదలు...
ఇంకా ఉంది...
No comments:
Post a Comment