ఒక దూతా - ఒక గూఢచారీ
రాజూ, మంత్రీ దర్బారులోకి వచ్చి, దర్శనం కోసం ఎదురుచూస్తున్న చిలుక అరుణముఖుణ్ణి, కాకి నీలవర్ణుణ్ణి పిలిపించారు. (చిత్రవర్ణుడి గూఢచారి మేఘవర్ణుడే, ఇప్పుడు నీలవర్ణుడు అనే మారుపేరు పెట్టుకొన్నవాడు.)
అరుణముఖుడు ముందు మాట్లాడాడు "రాజా, జంబుద్వీపం రాజు చిత్రవర్ణుడు పంపగా నేను వచ్చాను.. ఆయన సందేశం చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి 'మీ కర్పూరద్వీపం మొదలయిన చిన్నదీవులన్నీ జంబూద్వీపంలో భాగమయిన చిన్నదీవులు. కాబట్టి మీరు మాకు కప్పం కట్టాలి. ఈ విషయంలో వాదాలూ, మాటలూ అక్కర్లేదు. మీ ప్రాణాల మీద ఆశ ఉంటే, వెంటనే మా రాజు దగ్గరికి వచ్చి కప్పం కట్టుకోండి. లేదంటే ఆయన ఎలాగూ యుద్ధానికి బయల్దేరి వస్తున్నాడు. చావటానికి సిద్ధంగా ఉండండి' అని మీకు చెప్పి, మీ జవాబేమిటో తెలుసుకురమ్మని మా రాజు నన్ను పంపాడు. మీ జవాబు ఏమిటో చెప్తే, నేను శెలవు తీసుకొంటాను”.
ఆ మాట విని హిరణ్యగర్భుడు తోకతొక్కిన తాచులాగా విపరీతమయిన క్రోధంతో ఊగిపోయాడు. "ఎంత పొగరు ! ఏమి వింత! ఒక పనికిమాలిన నెమలిపిట్టకి, నాలాంటి రాజహంస కప్పం కట్టాలా? మీ చిత్రవర్ణుడికి మదంతో కళ్ళు మూసుకుపోయాయి. ఎవరో చిన్న చిన్న వాళ్ళని జయించినట్టు, నన్నూ గెలవ గలననుకొని విర్రవీగుతున్నాడు" అని కేకలు వేయసాగాడు.
అరుణముఖుడితో వచ్చిన మేఘవర్ణుడు రాజు కోపంచూసి, తనూ లేని కోపం నటిస్తూ యిలా అన్నాడు: “రాజా! ఈ చిత్రవర్ణుడు కండకావరంతో నోటికొచ్చినట్లు పేలాడు. అయినా ఆ మాటలన్నీ యిక్కడ చెప్పడానికి ఈ చిలకకెన్ని గుండెలు? వీడిని దూత అని దయతలచొద్దు. నాకన్నా అనుమతి యివ్వండి, ఇప్పుడే వాడిని చంపేస్తాను.”
మంత్రి సర్వజ్ఞుడు మేఘవర్ణుణ్ణి వారించాడు. "మిత్రమా! తొందరపడకు. దూతని చంపటం ధర్మం కాదు. అధర్మం చేస్తే అంతా నష్టమేనని పెద్దలు చెప్పారు. ఎవరికీ కీడు చేయనివాడే సజ్జనుడు. మంచి శీలం ఉన్నవాడు ధర్మమైన పనులే చేస్తాడు. అదే అతనికి బలం. ఆ బలంతోనే సంపదలు పొందుతాడు, అన్ని పనులూ సాధిస్తాడు. ఆవూ, ఆవూ పోట్లాడుకొని మధ్యలో దూడ కాళ్ళు విరగ్గొట్టినట్టూ, రాజూ రాజూ పోట్లాడుకొని మధ్యన దూతను చంపకూడదు. దూత మాటలు అతని సొంత మాటలు కావు. దూతని తప్పు పట్టకూడదు. మూర్ఖుడికి ముక్కుమీదే కోపం ఉంటుంది. కోపం అన్ని పాపాలకూ కారణం. కోపంలో హత్యలు చేయటం, ఆత్మహత్యలు చేసుకోవటం మూర్ఖుల పని. వివేకం, సహనం కలవాళ్ళు అలా చేయరు” అన్నాడు.
రాజు అరుణముఖుడితో యిలా అన్నాడు: "నా జవాబు కావాలన్నావు, విను. మీ దేశం వెళ్ళి సరాసరి మీ రాజుతో నిండు కొలువులో అందరూ వినేటట్లు నేను చెప్పిన ఈ మాటలు చెప్పు, “నువ్వు కొవ్వెక్కి, మదించి, నా రాజ్యం కాజేయాలని కలలు కంటున్నావు. నీలాంటి కోటి చిత్రవర్ణులయినా నా ముందు నిలవలేరు. దమ్ములుంటే యుద్ధానికి రా. బలాబలాలు చూసుకొందాం. నీలాంటి అధముల మాటలు కోటలు దాటతాయ్ కానీ కాలు గడప దాటదు. అయితే యుద్ధంచేసి నా చేతిలో చావు. లేదంటే క్షమాపణ చెప్పుకొని, శరణుకోరు, వదిలిపెడతాను" అని దూతకు తగ్గ కానుకలూ, పళ్ళూ, ఫలాలూ యిచ్చి పంపాడు.
అరుణముఖుడు నేరుగా తన రాజు చిత్రవర్ణుడి దగ్గిరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, "రాజా! మీరు చెప్పినట్లు కర్పూరద్వీపం వెళ్ళొచ్చాను. అదొక అద్భుతమయిన రాజ్యం, దాని విశేషాలు చెప్పటానికి నాబోటి వాళ్ళకు శక్తి చాలదు, ఇది అందుకు సమయమూ కాదు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే, ఆ రాజు యుద్ధానికే రమ్మని మీకు సవాలు విసిరాడు. ఆ రాజును యుద్ధంలో గెలవటం చాలా కష్టమే. కానీ, మన గూఢచారి మేఘవర్ణుడు అక్కడ నీలవర్ణుడు అనే మారుపేరుతో చేరి ఉన్నాడు. ఆ రాజు విశ్వాసం కూడా సంపాదించాడు. వాడి సహాయంతోనే మనం గెలవాలి. దేవుడి మీద భారంవేసి, యింక మనం యుద్ధానికే సిద్ధం కావాలి” అన్నాడు. హిరణ్యగర్భుడు చెప్పిందంతా వినిపించాడు.
ఇదంతా విన్న చిత్రవర్ణుడి ముఖం జేవురించింది. నిండుకొలువులో కూర్చొని ఉన్న మంత్రులనూ, మిత్రులనూ అందర్నీ చూస్తూ, "విన్నారా, హిరణ్యగర్భుడి మాటలు! నేను వాడిని శరణు కోరాలా? సింహం గడ్డి తింటుందా? ఇహ మనకు యుద్ధమే శరణ్యం. నాకు రాజ్యం జయించాలన్న కోరిక కన్నా, ఇంత పొగరుగా మాట్లాడిన ఆ రాజుకు తగిన బుద్ధి చెప్పాలని ఆత్రంగా ఉంది. పౌరుషమున్న రాజుకు శత్రువులను చంపేదాకా నిద్రపట్టదు, ఆహారం రుచించదు. యుద్ధంలో వాణ్ణి చంపితే గానీ నా పగ చల్లారదు. "పోరు నష్టము, పొందు లాభము ! యుద్ధంలో గెలుస్తామో, ఓడతామో' అని మీరు ఎవ్వరూ సందేహించవద్దు. శరీరాలు నీటి బుడగల్లాగా అశాశ్వతం. ఎప్పటికో ఓనాటికి చావు తప్పేదా? ముసలితనంతో యింట్లో రోగిష్టిగా మూలుగుతూ చావటం కంటే, ధైర్యంగా యుద్ధం చేసి, అవసరమయితే రణరంగంలోనే చనిపోవటం మంచిది కదా? వెంటనే యుద్ధానికి మీరంతా సిద్ధం కండి" అన్నాడు.
అతని మంత్రి దూరదర్శి హితవు చెప్పేందుకు ప్రయత్నించాడు. "రాజా! తొందరపడవద్దు, మనం శత్రువుల కంటే నిశ్చయంగా ఎక్కువ బలవంతులం అనుకొంటేనే యుద్ధంలోకి దిగాలి. హిరణ్యగర్భుడేమీ సామాన్యుడు కాదు, అతని సైన్యము, ప్రజలూ యావన్మందీ అతనికోసం ప్రాణాలయినా యివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. శత్రువు బలం తెలుసుకోకుండా సాహసం చేస్తే, సింహం చేతిలో లేడిలాగా చావటం ఖాయం. జాగ్రత్తగా అడుగువెయ్యాలి అన్నాడు. రాజుకీ ధోరణి నచ్చలేదు.
"ఏం పనికిమాలిన మంత్రివి నువ్వు? నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది. నీకు తలపండింది కానీ పండలేదు. యుద్ధానికి సిద్ధమవాలని నేను చెప్తుంటే, మా ఉత్సాహమంతా నీరుగార్చే పిరికిమాటలు నువ్వు మాట్లాడుతున్నావు" అని భగ్గుమన్నాడు.
"రాజా నీ మేలు కోరేవాణ్ణి కాబట్టి నా మనసులో మాట స్పష్టంగా చెప్పాను. నా మాట నీ చెవికి చేదుగా తోచినా, నాకు తెలిసిన హితవు చెప్పటం నీ మంత్రిగా నా ధర్మం, నీకు కష్టం కలిగించకూడదని, మౌనంగా ఊరుకొంటే అది స్వామి ద్రోహం అవుతుంది. నువ్వు యుద్ధమే కావాలంటే అలాగే చేద్దాం. నేను నీ మాట దాటేవాడిని కాదు. యుద్ధానికిది మంచి సమయమే. కానీ, శత్రువును తక్కువగా అంచనా వేయకుండా, మన మొత్తం సైన్యంతో, అకస్మాత్తుగా వెళ్ళి శత్రువును దెబ్బతీద్దాం. చిన్నపామునయినా పెద్దకర్రతో కొట్టాలి. మనం ఆలస్యం చేస్తే, శత్రువుకు తన బలగాలన్నింటినీ బాగా సిద్ధపరచుకొనే అవకాశం కలిగి, మనం జయించట కష్టమవుతుంది. 'ఆలస్యాత్ అమృతం విషం' (ఆలస్యం వల్ల అమృతమే విషం కావచ్చు) అన్నారు. కనుక, పదండి యుద్ధానికి బయల్దేరదాం" అన్నాడు మంత్రి దూరదర్శి.
తన సైనికులందరితో చకచకా బయల్దేరి నెమలిరాజు
మలయపర్వతం దాకా ప్రయాణం చేసి అక్కడ విడిది చేశాడు.
చిత్రవర్ణుడు ఈ ప్రయత్నాలు యిలా చేసుకొంటూ ఉండగా, జంబూద్వీపానికి గూఢచారిగా వెళ్ళిన దీర్ఘముఖుడు, కర్పూరద్వీపానికి తిరిగి వచ్చి నేరుగా రాజు హిరణ్యగర్భుడి. దగ్గరికి చేరాడు. ఏకాంతంలో రాజునూ, మంత్రినీ కలిశాడు.
"రాజా, చిత్రవర్ణుడి రహస్యాలు కొన్ని తెలుసుకొని వచ్చాను, విను. అతను నీ రాజ్యం మీద దండెత్తటానికి నిశ్చయించాడు. సేనతో సహా మలయపర్వతం దాకా వచ్చి ఉన్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోటను సురక్షితంగా ఉంచుకోవాలి. ఆ రాజ్యంలో చిత్రవర్ణుడంటే సరిపడని ఒక పావురంతో స్నేహం చేసి, నేను దాని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొన్నాను. మీరు నమ్ముతారో సమ్మలో కానీ మీ కొలువులోనే చిత్రవర్ణుడు పంపిన గూఢచారి ఒకరున్నాడు అని విన్నాను. పూర్తి వివరాలయితే నాకు తెలియవు. మరొక రహస్యం, చిత్రవర్ణుడు యిలా యుద్ధానికి దిగటం అతని మంత్రి దూరదర్శికి యిష్టం లేదట. అందుచేత యుద్ధ విషయాల్లో మంత్రి ఏమీ శ్రద్ధ తీసుకోవడంలేదట! ఇది మనకు అనుకూలమయిన విషయం అనుకొంటాను. మొన్న రాత్రి చిత్రవర్ముడి అనుచరులు కొందరు నన్ను గుర్తుపట్టి, బంధించబోయారు. ఇప్పుడే వస్తానని చెప్పి, ఎలాగో తప్పించుకొని పరుగు పరుగున మీ దగ్గరకు వచ్చేశాను. మన ధవళాంగుడు మాత్రం యింకా అక్కడే ఉన్నాడు" అని చెప్పాడు.
మంత్రి ఈ మాటలు విని, కొంచెంసేపు ఆలోచించి యిలా అన్నాడు: "రాజా! ఈ దీర్ఘముఖుడు చెప్పిన గూఢచారి మన కొలువులో చేరిన నీలవర్ణుడేనేమో? వాణ్ణి ఇంక మన దగ్గిర ఉండనియ్యటం మంచిది గారు. నిజంగా వారు సింహకద్వీపం నుంచీ రాలేదు. వాడివన్నీ కల్లబొల్లి కబుర్లు, నమ్మించి మోసం చేయటానికి మన దగ్గర చేరాడు. వీడిని చూస్తే నాకు వెనకటికి, కాకిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న గుడ్లగూబలు కధ గుర్తొస్తున్నది. వినండి", అని మంత్రి కాకి-గుడ్లగూబ కథ చెప్పుకొచ్చాడు.
No comments:
Post a Comment