స్వర్గానికెక్కిన నక్క

             స్వర్గానికెక్కిన నక్క


ఓ ఊళ్ళో ఒక నక్క ఉండేది. ఓ రాత్రి చీకట్లో తిండికోసం ఊరంతా తిరుగుతూ, అది ఒక ఇంట్లో ఒక పెద్ద వంటపాత్రలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా, అందులోంచి బయట పడటం దానికి చేతకాలేదు. తెల్లారితే ఇంటివాళ్ళు లేచి, కొట్టి చంపుతారని తెలిసి ఒక యుక్తి పన్నింది. తెల్లారబోతుండగా, ఆ పాత్రలోనే కళ్ళు తేలేసి, కాళ్ళు పైకెత్తి, ఊపిరి బిగపట్టి చచ్చినదాన్లాగా పడి ఉంది. తెల్లారిన తర్వాత ఇంటి యజమాని వచ్చి, దాన్ని చూసి, చచ్చిపోయిందనుకొని, దాన్ని పాత్రలోంచి లాగి, మోసుకెళ్ళి, ఊరు చివర పారేసి వచ్చాడు. నక్క బతికిపోయింది.

కానీ, రాత్రంతా ఆ వంట గిన్నె మసిలో దొర్లటం వల్ల దానికి ఒళ్ళంతా మసిరంగు అంటి నల్లగా అయింది. మారిపోయిన తన వంటి రంగు చూసుకొని నక్క చాలా ముచ్చటపడిపోయింది. “నా అదృష్టం! నాకీ రంగు వచ్చింది. ఇపుడు మా నక్కలలో నా అంత అందమయింది లేదు. నా అందం నాతోటి నక్కలన్నిటికీ చూపించాలి” అనుకొని మిగతా నక్కల దగ్గరికి వెళ్ళి, వాటి ముందు కోతలు కోసింది. “చూశారా! రాత్రి నాకు దేవుడు కనిపించాడు. నన్ను తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళాడు. నా మంచితనం మెచ్చుకొని, నామీద దయ తలిచాడు. అందరు దేవతల ముందూ నన్నీ అడవులకు రాజుగా నియమించాడు. ఎవరికీ ఈ విషయంలో అనుమానం రాకుండా, గుర్తుగా మామూలు నక్కలకెక్కడా ఉండని నిగనిగలాడే నల్లరంగు నాకిచ్చాడు. నేను యిప్పుడు మామూలు నక్కను కాను. చూస్తున్నారు కదా? ఇంకనించీ, మీరంతా నన్ను రాజుగా గౌరవించి సేవలు చెయ్యండి. ఇది దైవాజ్ఞ. అడవి జంతువులన్నీ ఇంకనించీ నా ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. ముందు మీరు వెళ్ళి ఈ మాట మన అడవిలోనూ, ఈ చుట్టూ ఉన్న అడవులన్నిట్లోనూ చెప్పి రండి" అంది.

పిచ్చి నక్కలు ఈ మాటలు నమ్మేశాయి. ఈ విషయం ఆ అడవి అంతా చాటి వచ్చాయి. అప్పట్నుంచి ఆ అడవిలో జంతువులన్నీ నల్ల నక్కని తమ రాజుగా భావించి, సేవలు చెయ్యసాగాయి. సింహాల్లాంటి జంతువులు కూడా తనకు సలాములు చేస్తూండటంతో, నల్లనక్కకు గర్వం ఎక్కువై, కళ్ళు నెత్తికెక్కాయి. తోటి నక్కలంటే దానికి మరీ లోకువయిపోయింది. వాటి మొహం చూడకుండా, వాటితో మాట్లాడడం మానేసి మరీ తలబిరుసుగా, పొగరుగా తిరగసాగింది.

మిగిలిన నక్కలకి బాధవేసింది. ఓరోజు అడవిలో నక్కలన్నీ ఒకచోట చేరి తమ బాధలు చెప్పుకొన్నాయి. ఒక ముసలినక్క “అసలిదంతా మనం చేతులారా చేసుకొన్న స్వయంకృతాపరాధం. చచ్చీ చెడీ, ఈ నక్కని అడవికి రాజును చేసింది మనం. ఎంత చేసినా ఈ నీచుడికి మనమంటే లెక్కలేదు. రోజూ మనల్ని అవమానించి, తిట్టి కొట్టి బాధిస్తున్నాడు. వీడిని యిన్నాళ్ళూ కుండలా నెత్తిన పెట్టుకొని మోశాం. ఇప్పటికన్నా, వీణ్ణి నేలమీదికి విసిరితే తప్పా మనకి మోక్షం లేదు. మన ప్రాణాలిలాగే తినేస్తాడు. అందుకని నేను ఒక ఉపాయం చెప్తాను, వినండి. వీడు దేవుడనీ, స్వర్గమనీ చెప్పిందంతా అబద్ధమని నా అనుమానం. నక్కెక్కడా, నాగలోకమెక్కడా! ఇదంతా కనీ, వినీ ఎరగని కట్టుకథ. అయితే వీడికి నల్లరంగు ఎలా వచ్చిందో మాత్రం తెలియట్లేదు. ఈ వేషంలో వీడు సింహాల్నీ, పులుల్నీ కూడా మోసం చేసి వశపరచుకొన్నాడు. మనకెంత తెలివో వాటికీ అంతే! సరేలే, ఎంత నీచుడయినా మంచికాలం వస్తే నాలుగురోజులు ఒక వెలుగు వెలుగుతాడు. కానీ, నీచుడు సుఖపడటం, మంచివాడు కష్టాలు పడటం కలకాలం జరిగే వ్యవహారం కాదు. మంచికి ఎప్పటికయినా మంచిరోజులు తప్పవు. దుర్మార్గుడు ఎప్పటికయినా వాడికన్ను వాడే పొడుచుకుంటాడు.

" మనమంతా కలిసి వాడి ఎదురుగా కూర్చొని బాగా కూతలు పెడదాం. వాడూ నక్కే కదా! మనమందరం అరుస్తుంటే. ఆ సందడిలో వాడూ ఊళ పెడతాడు. దానితో జంతువులన్నింటికీ తెలిసిపోతుంది. వాడూ మామూలు నక్కేననీ, వాడి ప్రత్యేకత ఏమీ లేదని, అప్పుడు వాడి సంగతి ఆ జంతువులే చూసుకొంటాయ్” అంది.

నక్కలన్నీ ఒప్పుకొన్నాయి. అలాగే వాడుండే చోటికి ఎదురుగుండా గుంపుగా కూర్చొని అరవటం మొదలెట్టినాయి. ఓ జంతువు పెడితే, అది విన్న ఆ జాతి జంతువులన్నీ కూడా కేకలు పెట్టడం జాతి లక్షణం. వాటి కూతలు విని, ఉండబట్టలేక నల్లనక్క కూడా పెద్దగా ఊళ పెట్టింది.

అది అలా అరవగానే ఆ అడవిలో సింహాలకి, పులులకీ, స్పష్టంగా తెలిసిపోయింది, నల్లనక్క కూడా మామూలు నక్కేననీ, దాని ప్రత్యేకత ఏమీ లేదని. దాంతో వాటికి ధైర్యం వచ్చింది. దగ్గర్లో ఉన్న ఒక పెద్దపులి ఉరుకుతూ వచ్చి, మీదపడి నల్లనక్కని ఒక్క క్షణంలో చంపేసింది.

ఇంతకీ రాజా! నేను చెప్పేదేమిటంటే, సొంతవాళ్ళని కాదని, పైనించి వచ్చిన ఎవరినో గొప్పనుకొని వాడి సలహాలకు ఎక్కువ విలువయిస్తే, అది ప్రమాదం కలిగించవచ్చు. నా సలహా నేను చెప్పాను. తప్పుగా భావించద్దు. ఇంక తర్వాత నిర్ణయం మీ యిష్టం” అంటూ ముగించాడు మంత్రి సర్వజ్ఞుడు.

రాజు హిరణ్యగర్భుడు ఒప్పుకోలేదు.

"చూడు మంత్రీ, నేడో రేపో యుద్ధం రాబోతున్నది. అప్పుడు మనకి శూరులూ, బుద్ధిశాలులూ కావల్సి వస్తారు. వెతకబోయిన తీగ కాళ్ళకే తగిలినట్లు, ఈ కాకి వీరుడెవరో వచ్చాడు. 'సిరి రా మోకాలొడ్డటం' తెలివి అనిపించుకోదు. అప్రయత్నంగా మనకు దొరికిన సహాయం కాదంటే ఏమిటి ప్రయోజనం? మనం నీటి పక్షులం, ఇది నేలపక్షి అంటున్నావు. మన శత్రువు చిత్రవర్ణుడు నీటిపక్షి కాదని మర్చిపోవద్దు. వజ్రాన్ని - వజ్రంతోనే కోయాలి. నేలపక్షిని ఎదుర్కోవటానికి నేలపక్షుల సాయమే తీసుకోవాలి. వీణ్ణి మనం వదిలేస్తే, వీడు వెళ్ళి మన శత్రువుతో కలిసిపోతాడు. అప్పుడు మనకు గెలవటం మరీ కష్టమయిపోతుంది. అందుకని మనం ఈ కాకి సహాయం తీసుకొని తీరాలి. ఊరికే లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు" అన్నాడు. దాంతో, చర్చ ముగిసింది.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...