కుక్క - గాడిద - 3
"వెనకటికి నేనెరిగిన నక్క ఒకటి ఉండేది. ఓ రోజూ దానికి ఎంత తిరిగినా తిండి దొరకలేదు. నకనకలాడే ఆకలితో ఎంతో దూరం నడుచుకుంటూ పోయింది. దానికి ఒక యుద్ధభూమి కనిపించింది.అక్కడ పడున్న సైనికుల శవాలు, చచ్చిపడున్న గుర్రాలు,ఏనుగులు చూసింది.నోరూరిపోయి ముందుకు అడుగు వేయబోతుంటే,పెద్ద మోత వినిపించింది.ఆ శబ్దానికి నక్క భయపడి మూర్ఛపోయింది.కొంత సేపయిం తర్వాత మూర్ఛనుంచీ లేచి చూస్తే,అక్కడ ఏ శత్రువులూ కనపడలేదు. కొంచెం దూరంలో ఓ చెట్టుకింద సైనికులు పడేసిన నగారా (డప్పు) కనిపిచింది. గాలికి చెట్టుకొమ్మలు,ఊడలు ఊగి నగారాకు తగిలినప్పుడు నగారా పెద్ద మోత చేస్తున్నది.అంతే! ఈ మాత్రానికే భయపడి,ఎదురుగా ఉన్న ఆహారం వదిలి పారిపోబోయమేమిటి? అని సిగ్గుపడిపోయి నక్క నిశ్చింతగా తనకు కడుపు పట్టినంత మాంసం మెక్కి వెళ్ళిపోయింది! అందువల్ల,కేవలం శబ్దం విని కంగరుపడటం అనవసరం అని నా సలహ.
"మీరు నాకు ఆజ్ఞ ఇస్తే, నేను ఇప్పుడే ఆ రంకె మోత ఎక్కడినించీ,ఎలా వచ్చిందో కనుక్కొని వస్తాను" అన్నాడు దమనకుడు.
పింగళకుడి ప్రాణం లేచొచ్చింది.అతనికి కావలసింది అదే.ముందు ఎవరైనా వెళ్ళి,ఆ రంకె పెట్టిన శత్రువేవరో, దాని బలాబలాలేమిటో చూసొస్తే, అప్పుడు ఆ శత్రువుని ఎదుర్కొనేందకు ఏదైనా ఉపాయం ఆలోచించవచ్చు.
"సరే,ముందా ఆ పని చేసిరా. శత్రువు బలమేమిటో తెలిసిన తర్వాత, అతన్ని గెలిచే ఉపాయం నేను చూస్తాను.అతన్ని కలిసి చెప్పవలసిన నాలుగు మాటలూ,సమయోచితంగా చెప్పిరా.నువ్వు తెలివైనవాడివి,ఎలా మాట్లాడాలో,ఏం మాట్లాడాలో నీకు చక్కగా తెలుసు.వెళ్ళిరా!" అన్నాడు.
దమనకుడు ఎంతైనా జిత్తులమారి నక్క. ఎలాగైనా రాజును మంచి చేసుకొని,అతనికి దగ్గరివాడు, సలహాదారుడు, సన్నిహితుడు అనిపించుకొంటే అడవిలో మిగతా జంతువులూ తనని గౌరవిస్తాయని అతనికి తెలుసు.
అతను వెంటనే బయల్దేరి, అడుగుజాడల బట్టి వెతుకుతూ సంజీవకుడనే ఆ ఎద్దు తిరుగుతున్న ప్రాంతానికి చేరాడు.
"సంజీవకా!నేను ఈ రాజయిన పింగళ కుడికి చాలా దగ్గరవాణ్ణి. ఆయన పంపితేనే నీ దగ్గరకి వచ్చాను. ఈ అడవి అంతా ఆయన రజ్యమేమని నీకు తెలియదనుకొంటాను.ఇందాక నువ్వు వేసిన రంకె విని ఆయనకి చాలా కోపం వచ్చింది.ఆయనకు నేనేదో రకంగా నచ్చాజెప్పాను. ఇప్పటికయినా నువ్వు మర్యాదగా ఆయన దగ్గరకి వెళ్లి తప్పు ఒప్పుకుని నమస్కారం చేసుకొంటే,ఆయన తన కొలువులో నీకు తగ్గ పనేదైన అప్పజెప్పి,తన పరివారంలో ఉంచుకుంటాడు. లేదంటే, నిన్ను శత్రువుగా భావించి నీ మీదకి ఉరికి చీల్చి చెండాడతాడు" అన్నాడు.
ఈ మాట విని సంజీవకుడు భయంతో గజగజ వణికిపోయాడు.సింహమంటే ఏ జంతువుకయినా భయమే కదా?
అతని భయాన్ని గమనించిన దమనకుడు మరో ఎత్తు వేశాడు.
"సంజీవకా, భయపడకు,నేను నిన్ను రక్షిస్తాను.మా రాజు దయగలవాడు. ధార్మికుడు.అతనికి చెప్పాల్సిన విధంగా నేను చెప్తాను.నువ్వు నాతో పాటు వచ్చేయ్"అన్నాడు.
దమనకుడూ,సంజీవకుడూ రాజు దగ్గరకి బయల్దేరారు. దమనకుడు ముందుగా రాజు దగ్గరకు వెళ్లి,"రాజా, మీ ఆజ్ఞ ప్రకారం వెళ్ళి చూసి వచ్చాను.ఆ రంకె వేసినవాడు సంజీవకుడు.వాడు మీకు శత్రువు కాదు.మీకు కోపం వచ్చిందని చెప్పగానే భయంతో వణికిపోతున్నడు.నేను చెప్పాను భయపడోద్దని. పెనుగాలి పెద్ద పెద్ద చెట్లను కూలుస్తుంది గానీ గడ్డిపరకలనేమీ చేయదు.వాటిని లక్యపెట్టదు.అలాగే మా రాజు నీలాంటి బలహీనులనేమి చేయాడు. ఆయన పరాక్రమం ఆయనకు దిటయిన శత్రువుల మీద చూపుతాడు తప్పా నిన్ను నన్ను ఎంతో దయగా చూస్తాడు అని చెప్పి నేను సంజీవకున్ని ఇక్కడికి తీసుకువచ్చాను. మీరు సరెనంటే మీ ముందుకు తెస్తాను"అన్నాడు.రాజు సరెనన్నాడు.
దమనకుడు తిరిగి సంజీవకుడి దగ్గరకి వెళ్లి"మిత్రమా! నీ అదృష్టం బాగుంది.రజుగారొక్కడే కూర్చొని ఉన్నాడు. పద, వెళ్ళి కలుద్దాం" అన్నాడు.
భయం భయంగా వంగి దణ్ణాలు పెడుతూ సంజీవకుడు, పింగళకుడి ఎదురుగా నిల్చున్నాడు.
పింగళకుడు గంభీరంగా చూస్తూ,"ఏమోయ్ సంజీవకా,మా దమనకుడు నీ గురించి, నీ తెలివితేటలా గురించి నాకు పూర్తిగా చెప్పాడు.చాలా సంతోషం. నీలాంటి బుద్దిమంతుడు నా దగ్గర మంత్రిగా ఉంటే మనకిద్దరికీ లాభమే. అంచేత,ఈరోజు నుంచీ నువ్వు నాకు మంత్రిగా ఉండి, ఈ అడవినీ అందులో జంతువుల్ని పరిపాలించడంలో నాకు సహాయకుడిగా ఉండు!"అన్నాడు.
ఆరోజు నుండీ పింగళకుడికి,సంజీవకుదు విశ్వాసపాత్రుడయి చాలా సన్నిహితుడయ్యాడు.వాళ్లిద్దరి స్నేహం రోజురోజుకీ బలపడిపోయి, పింగళకుడు దమనకుడిలాంటి ఇతర సేవకుల్ని పట్టించుకోవడమే తగ్గిపోయింది.
దాంతో నిరుత్సాహపడిపోయి, దమనకుడు మళ్ళీ కరటకుడి దగ్గరకి వచ్చేశాడు.
కరాటకుడు "చూశావా తమ్ముడూ, మనకెందుకు ఈ రాజు కొలువు అని చెప్తే వినలేదు.పైగా ఎదురు బోలెడు నీతులు నాకే చెప్పుకొచ్చావు. ఇప్పుడు నీకే అక్కడ చోటు లేకుండా పోయింది!"అన్నాడు.
"నిజమే,నేను చేసింది పొరపాటే.అయిన నువ్వు నన్నేం దెప్పిపొడవక్కర్లేదు. దేవుడు దయ తలచకపోతే ఏ ప్రయత్నమూ ఫలించదు.ఆశాఢభూతి కథలో ఏమైందో తెలుసుకదా? మర్చిపోతే చెప్తాను విను" అంటూ దమనకుడు ఆ కథ మొదలెట్టాడు.