శంఖచూడుడి వధ
శంఖచూడుడు యక్షుడు. కుబేరుడి అనుచరుడు, గదాయుద్దంలో ఆరితేరినవాడు. ఈ భూమండలంలో తనవంటి బలశాలి, గదాయుద్ధంలో తనను ఓడించగల పరాక్రమవంతుడు లేడంటూ విర్రవీగేవాడు.
ఒకనాడు నారద మహర్షి శంఖచూడుని వద్దకు వచ్చాడు. నారదునికి శంఖచూడుడు స్వాగత సత్కారాలు చేశాడు. కలహభోజనుడైన నారదుడు కంసుడి పరాక్రమాన్ని పొగుడుతూ శంఖచూడుణ్ణి రెచ్చగొట్టాడు.
'కంసుడు నన్ను మించిన పరాక్రమవంతుడా?" ఉక్రోషంగా అడిగాడు శంఖచూడుడు.
'అది నేనెలా చెప్పగలను? నువ్వే తేలుకోవాలి' బదులిచ్చాడు నారదుడు.
నారదుడి మాటలకు రెచ్చిపోయిన శంఖచూడుడు వేలాది గదాయుధాలతో మధురా నగరం చేరుకున్నాడు. రాజసభకు వెళ్లాడు. కంసుడికి అభివాదం చేసి, 'రాజా! సువ్వు త్రిభువన విజయుడవని విన్నాను. నీతో గదాయుద్ధం చేయాలని నా కోరిక, నువ్వు గెలిస్తే, నీకు దాసుడిగా ఉంటాను. నేను గెలిస్తే నువ్వు నా దాసుడివి కావాలి' అన్నాడు.
శంఖచూడుని ఉబలాటం చూసి, 'సరే'నంటూ పెద్ద గద తీసుకుని, యుద్ధానికి సిద్ధపడ్డాడు కంసుడు. ఇద్దరూ గదలతో గోదాలోకి దిగి పోరాడసాగారు. ఒక గద పగిలిపోతే మరో గద తీసుకుని పోరాదారు. వారి వద్ద ఉన్న గదలన్నీ తునాతునకలై
పోయాక, చివరకు ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. అదే సమయానికి గర్గ మహర్షి అక్కడకు చేరుకున్నాడు.
'కంసా! ఇక యుద్ధం చేయకు. ఈ శంఖ చూదుడు నీతో సమానమైన బలసంపన్నుడు.. నిన్ను చంపబోయే పరమాత్ముడు ఇతడిని కూడా హతమారుస్తాడు. ఇక నుంచి ఈ యక్షుడితో అభిమానంగా ఉండు' అని చెప్పాడు.
'శంఖచూడా! నువ్వు కూడా ఇకపై కంసుడితో మైత్రితో మెలగుతూ ఉండు' అని సూచించాడు.
గర్గుని మాటలతో ఇద్దరూ యుద్ధం విరమించుకున్నారు. సవినయంగా గద్ద. మహర్షికి నమస్కరించారు. ఆయన ఆశీస్సులు పొంది, పరస్పరం అలింగనం చేసుకున్నారు. శంఖచూడుడు కొన్నాళ్లు కంసుడి వద్ద ఉండి, అతడి ఆతిథ్యం స్వీకరించాడు.
ఒకనాడు శంఖచూడుడు కంసుడి వద్ద సెలవు తీసుకుని ఆకాశమార్గాన తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో బృందావనం కనిపించింది.
బృందావనంలో గోపకాంతల మధ్య రాధామాధవులు కనిపించారు. కృష్ణుడు తన మోచేతిని రాధ భుజంపై ఉంచి, మురళి వాయిస్తుండగా, రాధ తన్మయత్వంతో ఆలకిస్తోంది. గోపకాంతలు ఆనంద పరవశులై నాట్యమాడుతున్నారు.
కృష్ణుడిని సామాన్య బాలకుడిలాగానే తలచాడు శంఖచూడుడు. ఒక సామాన్య బాలుడి చుట్టూ అందగత్తెలైన అంతమంది. గోపికలు నాట్యం చేస్తుండటం చూసి అతడికి మతిపోయింది.
ఈ బాలకుడేంటి, ఇతగాడి గొప్పేంటి. ఇంతమంది అందగత్తెలూ ఇతడి చుట్టూనే చేరి ఎందుకు ఆడుతున్నారు, ఇతడికి ప్రత్యేకతేంటి? ఇతడి సంగతేదో చూడాల్సిందే అనుకున్నాడు.
వెంటనే బృందావనంలో దిగాడు. నల్లని దేహం, ఎర్రని కళ్లతో నేల దద్దరిల్లేలా అడుగులు వేస్తూ వస్తున్న భీకరాకారాన్ని చూసి గోపికలు భీతిల్లిపోయారు. అప్పటి వరకు నృత్యగానాలతో ఆహ్లాదభరితంగా గడిపిన రాసమండలమంతా గోపికల ఆర్తనాదాలతో, హాహాకారాలతో హోరెత్తిపోయింది.
అందగత్తెలయిన గోపికలందరినీ ఒకేసారి చూసేసరికి శంఖచూడుడికి మతిచలించింది. గోపికల వైపు ముందుకు రాసాగాడు. భయంతో గోపికలు పరుగులు తీశారు. శతచంద్రానన అనే గోపిక శంఖచూడుడి చేతికి చిక్కింది. అతడు ఆమెను పట్టుకుని, ఉత్తరదిశ వైపు శరవేగంగా వెళ్లసాగాడు.
భయకంపితురాలైన శతచంద్రానన 'కృష్ణా! కృష్ణా!' అంటూ రక్షణ కోసం కేకలు వేయసాగింది. గోపికల కలకలానికి కృష్ణుడు లేచి వచ్చాడు. శతచంద్రానన కేకలు విన్నాడు. అటువైపుగా పరుగున ముందుకు సాగాడు. భీకరాకారుడైన శంఖచూడుడు శతచంద్రానను ఎత్తుకుపోతుండటాన్ని గమనించాడు. 'నిలువురా మాయావి! నిలువు. అబలను విడిచిపెట్టు' అంటూ హెచ్చరించాడు. అతడు నిలవకుండా, ముందుకు పరుగున పోతుండటంతో, కృష్ణుడు దగ్గరే ఉన్న సాలవృక్షాన్ని పెకలించి, అతణ్ణి వెంబడించసాగాడు.
సాలవృక్షంతో తరుముకొస్తున్న కృష్ణుణ్ణి చూసి, శంఖచూడుడు భయపడ్డాడు. ఎత్తుకుపోతున్న గోపికను అక్కడికక్కడే విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా పరుగు తీశాడు. అయినా కృష్ణుడు అతణ్ణి విడిచి పెట్టలేదు. యోజనాల కొద్ది దూరం తరుముకుంటూ వెళ్లాడు. చివరకు హిమాలయ సానువుల చెంత అతణ్ణి అడ్డగించాడు. ఇక తప్పించుకుపోవడానికి ఎటూ మార్గం
కనిపించక, తప్పనిసరిగా కృష్ణుడితో యుద్ధానికి దిగాడు శంఖచూడుడు. ఇద్దరూ ఒకరిపై మరొకరు చెట్లతో దాడి చేసుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. చివరకు ముష్టియుద్ధానికి దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఒకళ్లనొకళ్లు నేల మీదకు నెట్టుకుని కలబడ్డారు. కృష్ణుడు ఒడుపుగా శంఖచూడుడి మెడ దొరకబుచ్చు కున్నాడు. అతడి నెత్తి మీద, మెడ మీద పిడిగుద్దులు కురిపించి, మెడ నుంచి తలను వేరుచేశాడు. అతడి తలలో ఉన్న చూడామణిని పెకలించి తీశాడు. శంఖచూడుడి నుంచి ఒక దివ్యతేజస్సు వచ్చి, కృష్ణుడి మిత్రుడైన శ్రీదాముడిలో చేరింది. శ్రీదాముడి అంశే కాలవశాన యక్షుడిగా జన్మించి, శ్రీకృష్ణుడి వల్ల
తిరిగి శ్రీదాముడిలోనే విలీనమైంది.