సింహం - ఒంటె
మలయపర్వతం సమీపంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో దర్శసారం అనే సింహం రాజుగా ఉండేది. దానికి మంత్రులుగా ఓ కాకి, ఓ పులి, ఓ నక్కా ఉండేవి. అవి ఒకరోజు అడవిలో తిరుగుతుంటే వాటికి ఒక ఒంటె కనబడింది. "నీ పేరేమిటి? నువ్వు ఏ దేశం నించి వచ్చావు?" అని అవి ఒంటెను అడిగాయి.
"నా యజమాని ఒక వర్తకుడు. అతను ఎప్పుడూ నా వీపుమీద మోయలేనంత బరువు సరుకులు ఎక్కించి తిప్పుతుండేవాడు. అలా చాలా సంవత్సరాలు బరువులు మోసీ, మోసీ యింక నావల్ల కాక పారిపోయి వచ్చి ఈ అడవిలో దూరాను. మీరు ముగ్గురూ మంచివాళ్ళులాగా కన్పిస్తున్నారు. మీరు దయదల్చి ఈ అడవిలో నన్ను కూడా ఉండనివ్వండి” అన్నది ఒంటె.
అది విని నక్క యిలా చెప్పింది "నీకు అడవిలో ఉండేందుకు అనుమతివ్వగలిగింది మేము కాదు. ఈ అడవికి దర్శసారమనే సింహం రాజు. మేము ఆ రాజుకు సేవకులం మాత్రమే. నిన్ను ఆయనకు పరిచయం చేస్తాం. మాకు చేతయిన ఉపకారం చేస్తాం. భయపడకు. అంతా బాగానే జరుగుతుంది. మాతో రా".
ఒంటె సంతోషించి, వాటితో కలిసి రాజు దగ్గిరకి వెళ్ళింది. నమస్కారం చేసి నిలబడింది. నక్క ఒంటె కథను రాజుగారికి వినిపించింది. రాజు ఒంటెకు అభయమిచ్చాడు. "నీకేం భయంలేదు. నువ్వు గూడా ఈ ముగ్గురితో పాటు నాకు మంత్రిగా ఉండు" అన్నాడు. ఒంటె సంతోషంగా అంగీకరించింది.
అలా కొంతకాలం గడిచింది. ఒకసారి సింహం తన మంత్రులని పిలిచి యిలా అంది. "నా శరీరం ఆరోగ్యంగా లేదు. రోగం వల్ల నేను చాలా నీరసపడిపోయాను. అడవిలో తిరిగి వేటాడే ఓపిక లేదు. మళ్ళీ ఓపిక వచ్చేదాకా నాకు మీరే ఆహారం తెచ్చిపెట్టాలి".
కాకి "రాజా, మేము చిన్నప్రాణులం. మీ అంత శక్తి మాకు లేదు. మీరు తెచ్చుకున్న ఆహారంలో మీరు తిని మిగిల్చినది కాస్తా తిని బతికేవాళ్ళం, మీకు ఒక్కపూటయినా ఆహారం తెచ్చిపెట్టే శక్తి మాకెక్కడిది?" అంది.
"దొరికినంతే తీసుకురండి. ఈ రోగం లేకపోతే మిమ్మల్ని అడిగే పని ఉండేది కాదు. ఏం చేస్తాం? కర్మ! భయపడకండి. అడవిలోకి వెళ్ళి ఏ మాంసం దొరికితే అదే తీసుకురండి” అంది సింహం. నాలుగు జంతువులూ బయల్దేరి అడవంతా తలా ఒక దిక్కూ గాలించాయి. ఎక్కడా మాంసం దొరకలేదు. మధ్యాహ్నం అయిపోయింది.
కాకి మిగిలిన జంతువులతో యిలా అంది. “పొద్దున్నించీ తిరిగినా మీకు ఏమాత్రం మాంసం దొరకలేదు. మీకే దొరక్కపోతే చిన్నవక్షిని, నాకెలా దొరుకుతుంది? మధ్యాహ్నం అయింది. పాపం రాజు ఆకలితో మనకోసం చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్తాం? ఇన్నాళ్లూ ఆయన వేటాడి సంపాదించి తెస్తే, మనం కడుపునిండా తిని బతికాం. ఇప్పుడు రాజుకి యిబ్బంది వస్తే ఒక్కపూటకు సరిపడా ఆహారం కూడా మనం సంపాదించలేకపోతున్నాం. మనమేం సేవకులం?" అని, అటూ యిటూ చూసి నక్కనీ, పులినీ పక్కకు పిలిచి, వాటి చెవిలో రహస్యంగా యిలా అంది. "ఓ పనిచేద్దాం. ఈ ఒంటెను చంపగలిగితే ఈరోజుకు మన రాజుకు ఆహారం దొరుకుతుంది. ఆయన తిని మిగిల్చిన మాంసం మనం నాలుగురోజులు నిశ్చింతగా తినొచ్చు" అంది.
అది విని నక్క, “అది కుదిరే పనికాదు. మన రాజు ఒంటెకు మంత్రి పదవి యిచ్చి ఎంతో గౌరవిస్తున్నాడు. ఇలా జరిగిందని తెలిస్తే మనని బతకనిస్తాడా?" అంది.
"ఆకలిబాధలో ఉన్నవాడు ఇది చేయచ్చు. ఇది చేయగూడదు అని ఆలోచించలేడు. పాములు సొంత గుడ్లే తినేస్తయ్. పులులు తమ పిల్లల్ని తామే చంపి తింటయ్. కారణం ఆకలి బాధే కదా?" అంది కాకి.
పులి “మనరాజు ఆకలిబాధతో ఒంటెను చంపితే చంపుకోనియ్యండి. ఆ పాపం మనకి వద్దు. మనం రాజు దగ్గరికి వెళ్ళి మనం పడ్డ శ్రమ ఏమిటో చెబుదాం. తర్వాత ఏం చేయాలో ఆయన్ను కూడా అడిగి ఆలోచిద్దాం" అంది.
ఒంటికంటే ముందు మిగిలిన జంతువులు రాజు దగ్గిరకి వెళ్ళాయి. "రాజా! ఎంత శ్రమపడ్డా ఈరోజు మాకు ఏ ఆహారమూ దొరకలేదు. పాపం మీరు మంచి ఆకలి మీద ఉన్నారు. ఓ పని చెయ్యండి, మా ముగ్గురిలో ఒక్కళ్ళని చంపి తినేయండి. మాలాంటి అప్రయోజకులు బ్రతికి ఎలాగూ ఏ లాభమూ లేదు” అన్నాయి. సింహం చెవులు మూసుకొంది.
“హరిహరీ, ఎంత మాటన్నారు! మిమ్మల్ని చంపి నా ఆకలి తీర్చుకుంటే నాకెంత పాపం! అలాటి పనిచేస్తే లోకులు నన్ను అసహ్యించుకోరా? ఇలాటి మాటలు అనకండి" అంది.
నక్క కాకితో యిలా అంది. “నువ్వు చిన్నపిట్టవి. నిన్ను
తినేసినా మనరాజుకు ఆకలి ఎలాగూ తీరదు. అంచేత
నువ్వెళ్ళిపో. రాజుకు నేనే ఆహారం అయిపోతాను”,
అది విని పులి ఊరుకోలేదు. “కాకి కన్నా నువ్వు కొంచెం పెద్ద జంతువువి. అయినా నీ మాంసం కూడా రాజు ఆకలి తీర్చడానికి సరిపోదు. రాజుకు నేను ఆహారం అయిపోతాను" అంది.
"అలా కుదురదు. నీకు బలముంది. ఇవాళ కాకపోతే రేపయినా నువ్వు మన రాజు కోసం ఆహారం వేటాడి తీసుకురాగలవు. నువ్వు చావటానికి వీల్లేదు” అంది నక్క.
ఇలా పోట్లాట జరుగుతుండగా ఒంటె వచ్చింది. "మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? నేను రాజుకు ఆహారమవుతాను. నేను బతికి ఉండటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు" అంది.
"ఈ ఆలోచన నాకు బాగానే ఉంది. దీనివల్ల రాజుకు పాపం రాదు. ఎందుకంటే సేవకుడు రాజుకోసం ప్రాణాలు వదిలినా, స్వర్గానికే పోతాడు. ఈ ఆలోచన మీరు ఒప్పుకోకపోతే, మేమందరమూ ప్రాణాలు వదిలేస్తాం” అంది నక్క రాజుతో. “అవును నిజమే, నన్ను చంపి తినండి!” అని ఒంటె కూడా రాజుని ప్రార్థించింది.
చివరకు ఆకలిబాధ తట్టుకోలేక తినేశాడు. రాజు ఒంటెను చంపి తినేశాడు.
“ఈ కథ వల్ల చెప్పొచ్చేదేమిటంటే, ఎంతయినా రాజుకు తన పాత మిత్రుల మీద ఉండే అభిమానం, నాలాంటి కొత్త మిత్రుల మీద ఉండదు" అన్నాడు సంజీవకుడు. "పైగా ఈ రాజుల సేవ ఎప్పటికీ ప్రమాదకరమే. కావాలంటే వడ్రంగీ-సింహము కథ కూడా చెప్తాను విను" అంటూ కథ ఆ కథ మొదలుపెట్టాడు.