పులి - కొంగ

                  పులి - కొంగ



జంబూద్వీపంలో కామ్యకం అనే అడవి ఉండేది.ఆ అడవిలో పెద్దచెట్టు. ఆ చెట్టు కింద ఒక పొద. ఆ పొదలో
ఒక పులి నివసించేది. దాని దగ్గర్లో, ఒక జువ్విచెట్టు ఆ చెట్టు
మీద గూడు కట్టుకొని ఒక కొంగ ఉండేది.                        

పులి ఒకరోజు ఒక దుప్పిని చంపి. దాని మాంసం తింటుంటే, చిన్న ఎముక పులి పళ్ళలో గుచ్చుకుపోయి బయటకు రాక, బాధపెట్టింది. దాన్ని తీసేయటం చేతకాక పులి నానా బాధలూ పడింది. పొర్లింది, దొర్లింది, కేకలు పెట్టింది. ఆ కేకలు విని, జాలిపడి, కొంగ పులి దగ్గిరకి వచ్చింది. 'చాలా బాధపడుతున్నాను. ఈ ఎముక లాగేసిపెట్టవా?' అని పులి కొంగను బ్రతిమాలింది.

కొంగ తన పొడుగు ముక్కుతో పులి నోట్లో యిరుక్కున్న
ఎముక ముక్క తీసి పడేసింది. అప్పట్నించీ ఆ పులి, కొంగల
మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎవరి పొట్ట వారే  పోసుకుంటున్నా స్నేహంగా ఉండసాగారు.

ఒకరోజు పులికి ఆహారమే దొరకలేదు. తిరిగి, తిరిగి
అలసిపోయింది. విపరీతమయిన ఆకలి బాధ! “ఈరోజు ఎంత దుర్దినం, ఎంత వెతికినా ఒక్క మాంసం ముక్క కూడా
దొరకలేదు. ఈ ఆకలికి నా ప్రాణం పోయేటట్టుంది. నన్ను నేను రక్షించుకోవడం ఎలా? ధర్మం తప్పి అయినా ప్రాణాలు నిలువుకోవాలి. 'ఆత్మార్ధం వృథ్వీ త్యజేత్' శరీరం నిలుపుకునేందుకు ఈ భూమినంతా వదిలేసినా తప్పులేదని చెప్పారు వెనకటికెవరో. శరీరం ఉంటే కదా మిగిలిన ధర్మాధర్మాల ప్రశ్న. నా ఆకలి తీర్చేందుకు ఎదురుగా చెట్టు మీద ఈ కొంగను తినేయటం తప్పా, మరే మార్గమూ కనిపించటం లేదు. దాన్ని చంపటానికి ఒక ఎత్తు వేస్తాను!" అనుకొంది.

మునుపటిసారి లాగా, నేలమీద పడి పొర్లుతూ, మునుపటికంటే పెద్దగా కేకలు వేయసాగింది. కొంగ దిగి వచ్చి "మిత్రమా! ఏమిటి నీ బాధ?" అని అడిగింది.

పులి "ఈ శరీరం నువ్వు పెట్టిన భిక్ష, ఆరోజు నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇంత బలవంతుడినయ్యి కూడా నేను నీకే ఉపకారము చెయ్యలేకపోయానని అసలే నేను సిగ్గుపడుతుంటే, మళ్ళీ యివాళ నా నోట్లో ఎముక ముక్క ఇరుక్కుని బాధపెడుతున్నది. ఇంత బలముండీ నీకు నేను ఏనాడూ యింత ఆహారం తెచ్చి పెట్టలేదు. నా తప్పు మన్నించు.

ఇకనుండీ నీ ఆహారం కూడా నేనే సంపాదించిపెడతాను. నామాట నమ్మి, ఈ ఎముక ముక్క బయటికి లాగి నా ప్రాణం. దక్కించు" అంటూ ప్రాధేయపడింది.

"అయ్యో! అదెంతవని, దానికి నువ్వు నన్ను బ్రతిమాలాలా? ఉండు తీస్తాను" అంటూ కొంగ తన ముక్కు
పులి నోట్లో ఉంచింది. పులి ఆ అవకాశం చూసుకొని, అతిక్రూరంగా దాని మెడ కొరికేసి, చంపి తినేసింది. "అలాగే, నీలాంటి దుర్మార్గులతో చేరితే చావు ఖాయం"అంటూ కథ ముగించాడు అరుణముఖుడు.

"ఇక ఆ తర్వాత చిత్రవర్ణుడి అనుచరులందరూ నన్ను ఎన్ని తిట్లు తిట్టారో, ఎంత బాధించారో! ఆ తిట్లూ,  ఆ అవమానమూ బ్రతికినన్నాళ్ళూ మర్చిపోలేను. ఈ అవమానం గురించి మీకు చెప్పాలనే ఆరాటమే నన్ను యివాల్టి వరకూ బతికించి, యిక్కడిదాకా  తిరిగి లాక్కొచ్చింది. విధి బలీయం. మీలాంటి రాజు ఉండి, యిక్కడ యింత మన బలగం ఉండి, అన్ని మాటలు పడ్డాను! ఇవన్నీ చెప్పి, మిమ్మల్ని నొప్పిస్తున్నందుకు కూడా నాకెంతో దుఃఖంగా ఉంది. దీనికోసమేనేమో, ఆ చిత్రవర్ణుడు నన్ను చంపకుండా వదిలేశాడు! నన్ను వదిలినప్పుడు వాడు నా వెనకాలే అరుణముఖుణ్ణి కూడా పంపుతానని చెప్పాడు. వాడూ నేడో, రేపో రాగలడు. ఇంక ఇప్పుడేం చేస్తారో మీ యిష్టం. నేను వెళ్ళి వస్తాను" అంటూ ముగించాడు దీర్ఘముఖుడు, తన యాత్రా- విశేషాల వివరణ.

ఇదంతా విని హిరణ్యగర్భుడు, "దైవికంగా జరిగిన వాటికి దుఃఖపడకూడదు. ఆ చిత్రవర్ణుడికి సపరివారంగా చావాలని కోరిక కలిగింది కాబోలు, నీలాంటి మంచివాడిని బాధించాడు. రేపో మాపో మనమే వెళ్ళి వాడి పనిపడదాం. మునిగిపోయిందేం లేదు. ఇలాంటి కష్టాలు నీలాంటి మంచివాడికి రావటం దురదృష్టం" అన్నాడు.

ఇంతలో అక్కడ జంబూద్వీపంలో చిత్రపరడు, అరుణముఖుడిని పిలిచి, దూతగా చేయాల్సిందంతా అతనికి నూరిపోసి, అతన్ని కర్పూరద్వీపానికి పంపాడు. ఆ తర్వాత తన మంత్రితో ఏకాంతంగా కలిశాడు. మంత్రి మాట విని,మేఘవర్ణుడనే కాకిని పిలిపించాడు. 'నువ్వు నా గూఢచారిగా  కర్పూరద్వీపం వెళ్ళు ఎలాగయినా హిరణ్యగర్భుడితో స్నేహం కలువు. మంచిమాటలతో అతన్ని నమ్మించు. అక్కడ నువ్వు ఉండి మనమనుకొన్న పని జరిగేట్టు చూడాలి. అక్కడందరితోనూ నువ్వు స్నేహంగా మనలుకోవాలి. లేకపోతే నీమీద దాడీలు చెప్పి రాజుకూ, నీకూ విరోధం పుట్టిస్తారు. మన ప్రయత్నమంతా వృథా అవుతుంది. రాజుల మనస్సు చంచలంగా ఉంటుంది. అందువల్ల 'అయ్యా, బాబూ' అంటూ ముఖస్తుతులు చేస్తూ ఉండాలి. అనవసరపు విషయాల్లో కలుగజేసుకోవద్దు. ఇది కత్తి అంచు మీద నడక, చాలా జాగ్రత్తగా ఉండు.నీ రహస్యాలు ఎవరికీ చెప్పకు. ఇక్కడి విషయం ఏదీ అక్కడ తెలియగూడదు. నువ్వు తిరిగొచ్చేదాకా. నేను నీ కోసమే చూస్తుంటాను" ఇప్పుడేమిటి కర్తవ్యం? అని చెప్పి అతన్ని కూడా కర్పూరద్వీపానికి పంపాడు.

ఇక్కడ కర్పూరద్వీపంలో, దీర్ఘముఖుడు, రాజు దగ్గర్నించి వెళ్ళిపోగానే, రాజు హిరణ్యగర్భుడూ, అతని మంత్రి సర్వజ్ఞుడూ మంతనాలు జరిపారు. "చూశారా రాజా! ఈ మూర్ఖుడు దీర్ఘముఖుడు ఎంత అనర్థాన్ని తీసుకొచ్చాడో? తాచెడ్డ కోతి వనమెల్ల చెరచిందంటారు, దానికి వీడే ఉదాహరణ. తను చెడి, తన వాళ్ళకు కూడా కీడు తెచ్చాడు. ఏ కారణం లేకుండా. పై దేశంలో కలహానికి కాలుదువ్వి వచ్చాడు" అన్నాడు మంత్రి.

"పోనీలే, ఇప్పుడు అతన్ని నిందించి ఏం లాభం? కాలం బాగా లేకపోతే యిలాగే అవుతుంది. అతను మంచే చేద్దామనుకొన్నాడు, అతని తప్పేముంది? అష్టకష్టాలు పడి వచ్చారు. పాపం, అతని సంగతి వదిలెయ్. పైగా జరిగిపోయినదాన్ని గూర్చి తవ్వుకొని ఎంత బాధపడి ఏం లాభం? జరగాల్సింది ఆలోచించాలి" అన్నాడు రాజు.

"రాజా, ఇప్పుడు మనం జంబూద్వీపానికి ఒక గూఢచారిని పంపటం తక్షణ కర్తవ్యం. క్షుణ్ణంగా ఆలోచించకుండా ఏ పనీ చేయకూడదు. వైద్యం తొందరగా చేయాలి. యిలాంటి ముఖ్యమైన వ్యవహారం నిదానంగా చేయాలి. బాగా ఆలోచించి చేసే పనికి దైవం కూడా అనుకూలిస్తుంది. ముందు మనం శత్రువేం చేయబోతున్నాడో తెలుసుకోవాలి. దీనికోసం మనం ఒక గూఢచారిని పంపాలి. రాజుకు కళ్ళు గూఢచారులే, ఈ పనికి మన దీర్ఘముఖుడే. తగ్గవాడు. అతను ఉపాయం ఉన్నవాడు, విశ్వాసం కలవాడు, వేగంగా ప్రయాణం చేయగలడు, శత్రుదేశం రహస్యాలు తెలివిగా ఆరాలు తీసి మనకందించగలడు. అతన్నీ, అతనితో పాటు అతని తమ్ముడు ధవళాంగుణ్ణి మనం జంబూద్వీపానికి పంపుదాం. ఇదంతా అతి రహస్యంగా చేద్దాం. రాజవ్యవహారాలు చివరివరకూ రహస్యంగా ఉంచుకోకపోతే కష్టం. శత్రువు దగ్గర్లో ఉండగా, ఏమరుపాటు పనికిరాదు. అది చెట్టు చిటారుకొమ్మ మీదికెక్కి ఆదమరచి నిద్రపోయినంత ప్రమాదం. పైగా యిలాంటి యుద్ధ సమయాల్లో మన పరివారాన్నంతా సిద్ధంగా ఉంచుకోవాలి. ఎవ్వరినీ పూర్తిగా నమ్మకూడదు. ఆత్మరక్షణ విషయంలో యిరవయి నాలుగు గంటలూ జాగ్రత్తగా ఉండాలి. మన మంతనాలూ, వ్యూహాలూ రహస్యంగా ఉంచుకోవాలి. రాజు, తను నమ్మినమంత్రితో మాత్రమే జరగవలసిన పనుల గురించి చర్చించుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసినవయినా చెప్పటం మంత్రిగా నా బాధ్యత కనక చెప్పాను" అన్నాడు మంత్రి.

"సరిగానే చెప్పావు. మనకు గూఢచారి కూడా మంచివాడే దొరికాడు. పంపించు, ఆలస్యమెందుకు, శుభస్య శీఘ్రమ్!" అన్నాడు రాజు.

రాజూ, మంత్రీ యిలా మాట్లాడుకొంటుండగా ఓ సేవకుడు వచ్చి పంగి నమస్కారం చేసి "రాజా! జంబూద్వీపం నుంచి ఒక చిలుక వచ్చింది. మిమ్మల్ని కలవాలంటుంది. పంపమంటారా?” అని అడిగాడు.

"కొంతకాలం ఆగాలి. రాజుగారు చెప్పినప్పుడు పంపించవచ్చు" అన్నాడు మంత్రి..

సేవకుడు బయటికి వెళ్ళి "రాజుగారు, మంత్రిగారితో ముఖ్యమయిన పనుల్లో మునిగి ఉన్నారు. వారు పిలిచే రోజుదాకా మీరు వేచి ఉండాలి" అని అరుణముఖుడికి తగిన ఇల్లు చూపించి అక్కడ నివాసం ఏర్పాటు చేశాడు.

రాజు మంత్రితో, "చూశావా, ఇంక యుద్ధం వచ్చేసినట్లే! ఇది మన సైనికులలో వీరులదరికీ సంతోషం,పిరికివాళ్ళందరికీ విచారం, వీరులు తమ శక్తి చూపి, కీర్తి సంపాదించుకొనేందుకు మంచి అవకాశం. రాజ్యంలో
వీరులందరినీ యుద్ధానికి సిద్ధం చేయండి. వాళ్ళకు ఉత్సాహం పుట్టించండి" అన్నాడు. రాజుకప్పుడే, యుద్ధమనంగానే మంచి హుషారు వచ్చింది. 

మంత్రి మాత్రం, "రాజా, ఉపాయాలు నాల్గింటిలో (సామం, దానం, భేదం, దండం) దండోపాయం అధమమని మరిచిపోవద్దని పండితులెప్పుడూ చెప్తారు. మనంతట మనం యుద్ధం మొదలుపెట్టడం మంచిది కాదు. యుద్ధం మొదలయితే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ఎవరు చెప్పగలరు? యుద్ధం వచ్చేదాకా అందరూ శూరులే, అది వస్తేనే తెలుస్తుంది. మన వారిలో నిజమయిన వీరులు ఎంతమందో! వీలయినంత వరకూ యుద్ధంతో పనే లేకుండా, చిన్న ఉపాయాలతో పనులు చక్కబెట్టుకోవడం మంచిది. బండరాళ్ళు కొండమీదికి చేర్చాలంటే ఉపాయంతో కదా చేస్తాం. సరయిన సమయం వచ్చేదాకా ఆగితే చిన్న ప్రయత్నంతో వెయ్యిరెట్లు ఎక్కువ ఫలం సాధించవచ్చు. అలా కాకపోతే, పెద్ద యత్నం గూడా నిష్పలమౌతుంది. ఊరికే శపథాలు పలకటం, మాయమాటలు చెప్పటం, ప్రమాదం దగ్గరకొచ్చినప్పుడు పిరికితనం చూపటం ఇవన్నీ బుద్ధిహీనుల లక్షణాలు.

"చిత్రవర్ణుడూ బలవంతుడే. అతనికి బలవంతుల సహాయం ఉంది. ఇప్పుడతని మీదికి మనం యుద్ధానికి వెళ్ళటం మిడతలు నిప్పులో దూకినట్టే. శత్రువు మనమీదికి వస్తే యుద్ధం చేసి గెలవడం తేలిక గానీ, మనం శత్రువు మీదికి దూకటం మంచిది కాదు. మనమిప్పుడు కొంచెం ఓర్పుతో ఉండాలి, తొందరపాటు వద్దు, మనం ముందు త్వరగా కోట కట్టుకోవాలి. కోటలో ఉన్న ఒక్కడు, బయట ఉన్న వందమందిని ఎదిరించగలడు. మంచి కోట ఉన్న రాజును ఏ శత్రువు. గెలవలేడు. కోటలేని రాజును ఎవరయినా ఓడించేస్తారు. కోట తయారయేవరకు ఈ దూతకు దర్శనం ఇవ్వకపోవటమే మంచిది" అన్నాడు.

రాజు కూడా మంత్రి చెప్పిన మాటలు అంగీకరించాడు. "నిజమే, కాలయాపన లేకుండా కోట కట్టే ఏర్పాట్లు చేయించండి" అని ఆజ్ఞ యిచ్చాడు.

మంత్రి తక్షణం వీరవరుడనే ఒక పక్షిని పిలిపించాడు.

"వీరవరా! మాకు తొందరగా ఒక కోట కట్టిపెట్టాలి. ఈ పని నువ్వే చేయగలవు గాబట్టి నిన్ను పిలిచాను. రాజుగారి ఆజ్ఞ ప్రకారం కోట కట్టించి నీ ప్రతిభా, ప్రజ్ఞ చూపించు" అన్నాడు.

వీరవరుడు సందేహించాడు.

"నామీద గల అభిమానానికి కృతజ్ఞుడినే. కానీ నాకు కోట కట్టే అంత శక్తి లేదు. వేరే పని ఏదయినా చెప్తే చేసి పెడతాను” అన్నాడు.

రాజు కలగజేసుకొని “వీరవరా! నీ శక్తి ఎంతో మంత్రి నాకు చెప్పాడు. నువ్వు ఈ పని కాదనటానికి లేదు. ఇది చెయ్యగలవాళ్ళు మన రాజ్యంలో నువ్వు తప్ప మరెవరూ లేరు. వెంటనే పని మొదలెట్టు" అన్నాడు.

వీరవరుడికి ఒప్పుకోక మరి తప్పలేదు.

"రాజా, మీ ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాను. మన ఊరిపక్కనే ఒక పెద్ద కొండగుహ ఉన్నది. దాన్లో నీటి వసతికోసం ఒక చక్కటి కొలనుకూడా ఉన్నది. అది మీకు నచ్చితే, దాన్ని వెంటనే కోటగా తయారు చేయిస్తాను" అన్నాడు.

రాజుకు ఇది బాగా నచ్చింది. వీరవరుడికి మంచి బహుమానం యిచ్చి, మంత్రి వింటుండగా పదిసార్లు మెచ్చుకొని, "నీలాంటివాడు దొరకటం మా అదృష్టం. కోట రక్షణ కూడా నీకే అప్పచెప్తున్నాను. ఏమాత్రం అజాగ్రత్త లేకుండా, నా ఆజ్ఞల ప్రకారం, కోటకు నువ్వే కాపలా ఏర్పాటు చెయ్యాలి” అన్నాడు.

"రాజా!" అని వీరవరుడు వెళ్ళి నిద్రాహారాలు లేకుండా పగలూ, రాత్రి కోట కాపలాలో నిమగ్నుడై పోయాడు.

వీరవరుడు వెళ్ళిపోయిన తర్వాత, ద్వారపాలకుడు మళ్ళీ రాజు దగ్గరికి వచ్చాడు. నమస్కారం చేసి, "రాజా! సింహళద్వీపం నించీ నీలవర్ణుడనే కాకి వచ్చింది. మీ దర్శనం చేయాలట. పంపమంటారా?" అన్నాడు.

రాజుకో ఆలోచన వచ్చింది. "మనకి ఈ యుద్ధం సమయంలో మంచి సలహాలివ్వగల తెలివయిన వాళ్ళు అవసరమవుతారు. కాకులు తెలివిగా ఉంటాయి. మన పరివారంలో సలహాలిచ్చేటంత బుద్ధిమంతు లెవరున్నారు? సింహాన్ని వదిలిపెట్టి, వెయ్యి కుక్కలని మన చుట్టూ చేర్చుకొంటే వాటివల్ల మనకేం ఉపయోగం? మంచి సహాయకులు దొరికితే యింక మనకి ఎదురుండదు. ఏమంటావ్?" అన్నాడు మంత్రితో,

మంత్రికి ఎప్పుడూ రాజు మంచిని కోరి సలహాలు చెప్పటమే అలవాటు. అందుకే అన్నాడు "రాజా! మరోలా అనుకోవద్దు. కానీ, శత్రువులను గెలిచేందుకు, ముక్కూ మొహం తెలియని కొత్తవాళ్ళను నమ్మటం, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ప్రమాదకరం. కాకులు మనలాగా నీటిపక్షులు కావు. దాని సలహా వల్ల మనకు మంచికంటే చెడే ఎక్కువ. మన వాళ్ళను వదిలి, పై వాళ్ళ సలహాలు అనుసరిస్తే యిబ్బంది కలగవచ్చు. అలా చేసి, చెడిపోయిన ఓ నక్కకథ ఉన్నది, చెప్తాను వినండి" అని కథ ఆరంభించాడు.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...