కుందేలు-సింహం
ఒకానొక అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. ఆ అడవికి అదే రాజు. అది చాలా బలవంతమైనది, క్రూరమైనది కూడా. ఇచ్చవచ్చినట్టు ఆ అడవిలో యితర జంతువులన్నింటిని చంపి తినేస్తూ ఉండేది. దీని బాధపడలేక ఆ అడవిలో యితర జంతువులన్నీ భయపడిపోయి, ఒకసారి అన్నీ కలిసి దాని దగ్గరకు వెళ్ళాయి. నమస్కారాలు చేసి యిలా అన్నాయి : "ఓ మృగరాజా! నువ్వు మహా బలశాలివి. మేము బక్క ప్రాణులం. మాదొక చిన్న మొర. నువ్వు తల్చుకొంటే మమ్మల్నందర్నీ ఒక్క నిముషంలో చంపగలవు, సందేహం లేదు. కానీ మామీద దయతలచి మా ప్రార్థన విను. ఇకనించీ మేమే నీకు ఆహారంగా రోజుకో జంతువును పంపిస్తాం. దాన్ని యథేచ్ఛగా తినేసేయి. మిగిలిన జంతువుల్ని మాత్రం చంపబోకు. నువ్వు దీనికి ఒప్పుకొంటే మేము కొంచెం నిర్భయంగా శాంతితో బతకొచ్చు”.
వాటి అదృష్టం బాగుండి, సింహం దీనికి ఒప్పుకొంది.
ఆ తర్వాత ప్రతిరోజూ, యితర జంతువులు తమలో ఒక్క జంతువును సింహానికి ఆహారంగా పంపేవి.ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత, ఒకరోజు జంతువులు ఓ కుందేల్ని పిలిచి, “ఇవాళ సింహానికి ఆహారంగా పోవటానికి నీ వంతు వచ్చింది” అని చెప్పాయి. కుందేలు ఆ మాట వింటూనే భయంతో మూర్ఛపోయింది. కొంచంసేపటికి తెరుకొన్నది. “నా కర్మ యిలా ఉంటే నేను చేయగలిగింది మాత్రం ఏముంది?” అని తనను తను సమాధానపరచుకొని, ధైర్యం తెచ్చుకొని ఏమవుతుందో కానివ్వమనుకొని బయల్దేరింది. కుందేలు చాలా తెలివయినది. నడుస్తూ, నడుస్తూ “ఈ అపాయాన్ని నేను ఉపాయంతో ఎదుర్కొంటాను. దేవుడు మేలు చేస్తే ప్రాణం దక్కించుకొంటాను” అనుకుంటూ, ఒక ఉపాయం ఆలోచించింది.
మెల్లిగా నడుస్తూ, అటూ యిటూ తిరిగి కొంచెం ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది. ఆలస్యం వల్ల సింహం మంచి ఆకలిమీద ఉంది. అంత ఆలస్యం చేసినందుకు దానికి ఆ అడవిలో జంతువుల మీద కూడా మంచి కోపంగా ఉంది. కుందేలును చూడగానే దానికి ఆవేశం పెరిగి “ఇంత ఆలస్యంగా రావటానికి నీకెన్ని గుండెలు? నేను దయచూపించి రోజుకొక్క జంతువునే తింటానని ఒప్పుకోవడం వల్ల, మీ జంతువులు న్నింటికీ నేనంటే లెక్కలేకుండా పోయింది. అందుకే అంటారు. 'కుడితే తేలూ, కుట్టకపోతే కుమ్మరిపురుగూ' అని. ఇవాళ నేను ఈ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ చంపేస్తాను" అంటూ కేకలు వేయసాగింది.
"మృగరాజా! ఇందులో మా జంతువులు తప్పేమీ లేదు. అవి నన్ను ఆలస్యం లేకుండా సరయిన సమయానికే పంపాయి. అయితే నేను పరిగెత్తుకొంటూ నీ దగ్గరకు వస్తుంటే, దోవలో నాకు మరో సింహం ఎదురయింది. “ఓసి చెవులపిల్లి, మా ఎదురుగుండా యింత నిర్భయంగా పరిగెత్తడానికి నీకు ఎన్ని గుండెలూ? ఎంత కొవ్వెక్కకపోతే, నువ్వు నేనంటే లక్ష్యం లేకుండా పారిపోతావు? నిన్ను చంపేస్తాను చూడు!" అంటూ నా మీద కస్సుబుస్సులాడింది. నేను ఒక నమస్కారం పెట్టి 'మా అడవికంతా ఒకే రాజు. అది సత్వసారమనే సింహం. నేను ఆ మృగరాజు దగ్గరికే పరిగెడుతున్నాను. నువ్వు నన్ను ఆపకు. ఆయనకు కోపం వస్తుంది. ఆయనకు కోపం వస్తే ఈ లోకమే అల్లకల్లోలం చేసెయ్యగలడు' అన్నాను.
ఆ సింహం మండిపడి "ఈ అడవికి నేనే రాజును. ఇంకెవరయినా ఈ అడవికి రాజునంటే వాణ్ణి చీల్చి చెండాడేస్తాను. ఎక్కడున్నది ఆ సత్వసారం, చూపించు ఇప్పుడే వాణ్ణి చంపేస్తాను. చూపకపోతే నిన్ను చంపేస్తాను” అంటూ మిమ్మల్ని నానా తిట్లు తిడుతూ నన్ను మీ దగ్గరికి పంపింది. ఆ కారణం వల్ల నేను సమయానికి రాలేకపోయాను!" అంది కుందేలు.
సత్వసారం ఈ మాటలు విని భగ్గుమంది. "ఎక్కడుండా సింహం, యిప్పుడే దాన్ని చంపేస్తాను, చూపించు" అంది.
కుందేలు సత్వసారాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళి "యిదుగో ఈ బావిలో ఉన్నదా సింహం!" అన్నది. సత్వసారం బావిలోకి తొంగిచూసింది. ఏం కనబడుతుంది? దానికి నీళ్ళలో తన ప్రతిబింబమే కనిపించింది. విపరీతమయిన కోపంతో దాన్ని మరొక సింహం అనుకొని దాన్ని చంపడానికి బావిలో దూకేసింది. చాలా లోతయిన ఆ బావి నీళ్ళలో బుడుంగన మునిగిపోయి ప్రాణం విడిచింది.
అంటూ దమనకుడు ఒక కథ తర్వాత మరొకటి చెప్తూ, చివరికి యిలా అన్నాడు "కరటకా! ఎంత కార్యాన్నయినా బుద్ధిబలంతో సాధించవచ్చు. ఇప్పుడు ఆ పింగళకుడు, సంజీవకుణ్ణి మంత్రిగా చేసుకొని, మమ్మల్నందర్నీ మర్చిపోయాడు. చూస్తూ ఉండు, వీళ్ళ స్నేహాన్ని నేను యుక్తితో ఎలా చెడగొడతానో! పింగళకుడి దగ్గర యిదివరకు కాటకం, పాటకం అని రెండు నక్కలు ఉండేవి. పింగళకుడికి వాటి మీద కోపం వచ్చి వాటిని దూరంగా తరిమేశాడు. ఇప్పుడు నేను వాటిని పట్టుకుని కథ నడిపిస్తాను"...
"దమనకా, అలాగే చెయ్యి. నీకు తెలియని జిత్తులేం ఉన్నాయి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా!" అన్నాడు కరటకుడు.
దమనకుడు అక్కడి నించీ సరాసరి పింగళకుడి దగ్గరకు వెళ్ళాడు. నమస్కరించి, దీనంగా మొహం వేలాడేసుకొని నిలబడ్డాడు.
"ఏం దమనకా, ఏమయింది అలా దిగులుగా ఉన్నావు?" అన్నాడు పింగళకుడు.
"రాజా, నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. నన్ను మీరు క్షమించాలి. నేను అనగూడదు కానీ మన మంత్రి సంజీవకుడి ప్రవర్తన మునుపటిలాగా లేదు. అతను పూర్తిగా మారిపోయాడు. ఇదివరకు మీరంటే ఎంతో విశ్వాసంగా, గౌరవంగా ఉండేవాడు. ఎప్పుడూ మిమ్మల్ని పొగుడుతూ ఉండేవాడు. మేమెవరమన్నా మిమ్మల్ని పొగిడితే కూడా, అవునవునంటూ తల ఊపేవాడు. ఈ మధ్యన మీ గురించి మేమెవరమయినా పొగిడితే మాట్లాడకుండా, ముభావంగా ఉంటున్నాడు. అతనిలో ఈ మార్పుకు కారణం ఏమిటో నాకు అర్ధం కాలేదు. మొన్న మా స్నేహితులు కొందరు చెప్పారు. సంజీవకుడు ఈ మధ్య మీ శత్రువులయిన కాటక, పాటకాలతో జట్టుకట్టాడని, నాకు చాలా బాధ కలిగింది. ఈ విషయం మన అడవిలో జంతువులన్నిటికీ తెలుసుట, సంజీవకుడంటే భయం వల్ల, వాళ్ళు ఈ రహస్యం బయటికి చెప్పట్లేదు. నాకూ తెలియక ఈ విషయం ముందుగా మీకు చెప్పలేకపోయాను" అన్నాడు దమనకుడు.
పైగా, "రాజా, మీ కొలువులో ఎవరినయినా ఒకరిని పిలిచి ఈ విషయం అడిగి చూడండి" అని పింగళకుణ్ణి ఉసిగొలిపాడు.
పింగళకుడు వెంటనే ఒక సేవకుణ్ణి పిలిచి, “ఏమిరా, మన కొలువులో వాళ్ళెవరయినా కాటక, పాటకులతో స్నేహం చేస్తున్నారా?” అని అడిగాడు. ఆ సేవకుడు భయపడి నీళ్ళు నమలసాగాడు.
"భయపడబోకు, నిజం చెప్పు" అన్నాడు పింగళకుడు.
"సంజీవకుడు వాళ్ళతో జట్టు కట్టినట్టున్నాడు!" అని సేవకుడు గొణిగాడు. “సరే, ఈ ప్రశ్న నిన్నడిగినట్లు ఎవ్వరికీ తెలియనివ్వకు!”
అని పింగళకుడు వాణ్ణి పంపేశాడు.
దమనకుడు మళ్ళీ అందుకొన్నాడు. "రాజా! ఇంకా ఈ సంజీవకుడిని నమ్మటం అంత మంచిది కాదేమోనని నాకు తోస్తున్నది. అయితే చాలారోజులుగా యితను మీ మంత్రిగా ఉన్నవాడు. తెలిసో తెలియకో తప్పు చేశాడు. ఏదో పరాయివాడిలాగా అతన్ని శిక్షించడం కన్నా, అతను చేసిన ద్రోహం అతనికే వివరించి, మందలించి, మంత్రిపదవిలోంచి తీసేసి పొమ్మంటే సరిపోతుందని నాకనిపిస్తున్నది”.
పింగళకుడు ఆలోచనలో పడ్డాడు. కొంతసేపు తర్వాత "నిజమేనోయ్, దమనకా, నువ్వు చెప్పినట్టు అతన్ని మన కొలువునించీ గెంటేయటమే మంచిది” అన్నాడు.
దమనకుడు, “ఈ క్షణంలో మనిద్దరికీ అలాగే తోస్తున్నది.
కానీ రాజా, మన తొందరపడొద్దు. ఇంకెవరితోనైనా గూడా
ఈ విషయం చర్చించి, తర్వాత ఒక అంతిమ నిర్ణయం
తీసుకొంటే మంచిది" అన్నాడు. "మన కొలువులో వాళ్ళందరూ నీకు తెలుసు. ఎవరితో చర్చిస్తే బాగుంటుందంటావు?” అడిగాడు పింగళకుడు.
దమనకుడికి మంచి అవకాశం దొరికింది. కొంచెంసేపు ఆలోచించినట్టు నటించి, "మా అన్న కరటకుడు ఉన్నాడు. వాడు చాలా తెలివయినవాడు. మీరంటే విశ్వాసం గలవాడు. వాడితో చర్చిస్తే మంచిదేమో?” అన్నాడు.
పింగళకుడు రాజభటుణ్ణి పంపి కరటకుడిని పిలిపించాడు.
విషయమంతా విన్న కరటకుడు సలహా యిచ్చాడు : "మృగరాజుకు తెలియని నీతి ఏం చెప్పగలను నేను? అయినా మేము మంత్రులం గాబట్టి మాకు తోచింది చెప్పకపోతే నేరం అవుతుంది. రాజద్రోహం చేసిన వాడిని శిక్షించకుండా ఊరికే బయటికి పంపితే వాడు మన శత్రువులతో చేరి మనకే ఎసరు పెడతాడు. అలాగని పంపకుండా మనతో ఉంచుకొన్నా మళ్ళీ అలాంటి ద్రోహమే తలపెట్టి మనకి కీడు చేస్తాడు. మంచి ప్రవర్తన గలవాడికి కొలువులో స్థానం యివ్వాలి గానీ దుష్టుడికి ఆశ్రయం యిస్తే ఎప్పుడూ నష్టమే”.
దీనికి దృష్టాంతంగా కరటకుడు ఓ కథ చెప్పాడు.