కాకి - పాము 2
చివరికి చెరువు దగ్గర ఎండ్రకాయ ఒక్కటీ మిగిలిపోయింది. ఒకరోజు కొంగ వచ్చి, "చేపలన్నింటినీ భద్రంగా ఆ చెరువుకు చేర్చేశాను. నువ్వు కూడా నాతో వచ్చేయి. నిన్న అక్కడికే చేరుస్తాను" అంది.
కొంగ మోసం తెలియని ఎండ్రకాయ ఒప్పుకొంది. కొంగ దాన్ని ముక్కున కరచుకొని పైకి ఎగిరింది. కొంచెం పైకి ఎగిరిన తర్వాత, ఆ చుట్టుప్రక్కలంతా కొండలూ, గుట్టలే తప్పు, మరో చెరువేదీ లేదని ఎండ్రకాయకు తెలిసింది. దాంతో కొంగ మోసం కూడా అర్ధమయిపోయింది. అయితే చేపలకంటే ఎండ్రకాయ తెలివిగలది. అందుకే కొంగ ఎత్తుకు పై ఎత్తు వేసింది.
"కొంగబావా, నువ్వు యిలా తీసుకెళ్తుంటే నాకేమిటో భయంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయ్. కిందపడిపోతానేమో. ఇలాకాదు. నేనే నీ మెడని కరుచుకొని గట్టిగా పట్టుకుంటే మనం భద్రంగా వెళ్ళొచ్చు. ఒక్కసారి దించు" అంది. కొంగ సరేనంది. ఎండ్రకాయ కొంగ గొంతు కరచుకొని గట్టిగా పట్టుకొంది.
చివరికి కొంగ కొండగుట్ట మీద వాలబోయే ముందు ఎండ్రకాయ కొంగ మెడను తన గిట్టలతో కటుక్కున విరిచేసింది. కొంగ ప్రాణం పోయి, కింద పడిపోయింది. ఎండ్రకాయ తప్పించుకొని వెళ్ళిపోయింది.
అని నక్క కథ ముగించి, 'కనక కాకి బావా, శత్రువును చంపేందుకు నువ్వుకూడా సరయిన సమయం చూసి, మంచి ఉపాయం ఉపయోగించాలి' అంది. సరేనని కాకి తన యిల్లు చేరింది.
తర్వాత కొద్దిరోజులకు కాకికి అవకాశం దొరకనే దొరికింది.
కాకి ఉంటున్న చెట్టు దగ్గర్లో ఒక చెరువు ఉంది. ఓరోజు దగ్గరలో ఉన్న నగరం నుంచీ కొంతమంది రాజకుమార్తెలు జలక్రీడల కోసం ఆ చెరువుకు వచ్చారు. వాళ్ళు తమ నగలూ, బట్టలూ చెరువు ఒడ్డున ఉంచి సరదాగా జలక్రీడలాడుతుండగా, కాకి గమనించి వాళ్ళు ఒడ్డున వదలిన ఒక విలువయిన శ్రీ మణిహారాన్ని తన ముక్కున కరుచుకొని తీసుకుపోయింది. ఇది చూసిన రాజకుమార్తెలు కంగారుపడుతూ జలక్రీడలు ఆపేశారు. రాజభవనానికి వెళ్ళిపోయి, కొందరు రాజభటులను ఆ కాకిని వెతికి మణిహారాన్ని తిరిగి తెచ్చేందుకు పంపించారు. భటులు అడవిలోకి వచ్చారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించింది కాకి. మెల్లిగా ఎగురుతూ తనే ఆ భటుల కంట పడింది. భటులు కాకిని పట్టుకొనేందుకు దాన్ని వెంబడించారు. కాకి మెల్లిగా ఎగురుతూ వెళ్ళింది. భటులు దాని వెనకే వెళ్ళారు. కాకి తన చెట్టు కొమ్మదాకాచేరి, ముక్కున కరచుకొని పట్టుకొన్న హారాన్ని వాళ్ళు చూస్తుండగా మెల్లిగా చెట్టు మొదట్లో ఉన్న పాము పుట్టలోకి జారవిడిచింది. భటులకు కావల్సింది. మణిహారం కాని, కాకి కాదు గదా! వాళ్ళు కాకి సంగతి మర్చిపోయి, తమ ఆయుధాలతో ఆ పుట్టను బాగా తవ్వేశారు. పుట్టలో ఉన్న పాము బయటికి వచ్చి భటులను కరవబోయింది. భటులు దుడ్డుకర్రలతో పామును బాదేసి చంపేశారు. హారాన్ని చేజిక్కించుకొని రాజభవనానికి వెళ్ళిపోయారు. దాంతో కాకి జంటకు పాము బెడద తీరిపోయింది.
ఇలా దమనకుడు కాకి-పాము కథ పూర్తి చేశాడు. కానీ తన ఉపన్యాసం ఆపలేదు. "బుద్ధిబలం ఉన్నవాడికి శరీరబలం లేకపోయినా ఫరవాలేదు. తెలివిగల కుందేలు తన యుక్తితో సింహాన్ని చంపేసిన మరో కథకూడా చెబుతాను. విను” అంది. అని ఆ కథ మొదలుపెట్టాడు.