ఆషాఢభూతి

 


                   ఆషాఢభూతి

అనగనగా ఒక కాలంలో దేవశర్మ అనే ఒక దొంగసన్యాసి ఉండేవాడు.అతనికి డబ్బు ఆశ చాలా ఎక్కువ.పైకి మాత్రం ఏ ఆశ లేని విరాగిలాగా నటిస్తూ,ఊరూరూ తిరిగి చక్కటి వేదాంతం ఉపన్యాసాలు ఇచ్చేవాడు.అవి వినటానికి ఎంతో మంది భక్తులు వచ్చేవారు.దేవశర్మ అసలు రూపం తెలియక ఎన్నో కానుకలు ఇచ్చేవారు.అవి తనకు ఇష్టం లేనట్టు తీసుకొని, భక్తులు వెళ్ళగానే ఆ సొమ్ముని భద్రంగా దాచి పెట్టేవాడు.కొంతకాలానికి అతని దగ్గర చాలా డబ్బు పోగైనది.ఆ డబ్బంతా ఒక బొంతలో దాచి దాన్ని తన వద్దే ఉంచుకొనేవాడు.
ఈ విషయం ఒక దొంగ గమనించాడు. ఎలాగైనా దేవశర్మ పోగు చేసిన డబ్బుని దొంగలించాలని వాడు ఒక ఉపాయం పన్నాడు.
ఒకరోజు దేవశర్మ భక్తులకు ధర్మం గురించి, మోక్షం గురించి ఉపన్యాసం వినిపిస్తున్నాడు.దొంగ పరమభక్తుడి వేషంలో వెళ్ళి ,ఆయన కళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి,ఆయనకు దగ్గర్లోనే, ఓ పక్కగా,చేతులు జోడించి నిలబడి దేవశర్మ చెబుతున్న విషయాలు వింటున్నట్టు నటించాడు.తనకెన్నాళ్ళనుంచో ఉన్న సందేహములు తోలగిపోయినట్టు అప్పుడప్పుడూ తల ఊపుతూ,ఇతర భక్తులు మాట్లాడరాదు అని చిరాకుపడుతూ సైగలు చేయటం  లాంటి చేష్టలు చేశాడు.
ఉపన్యాసం పూర్తవగానే "గురువుగారు చాలా అలసిపోయారు, భోజనం చేయాలి. మీరందరూ ఇక వెళ్లిపోండి!" అని ఇతర భక్తులందర్నీ పంపేసి, ఓ విసనకర్రతో వీస్తూ,దేవశర్మ శుశ్రూష చేస్తున్నట్టు నటించాడు.
దేవశర్మ అతని నటన చూసి మోసపోనేపోయాడు."ఎవరివోయ్ నువ్వు? నాకెందుకింత సేవా చేస్తున్నావ్?"అని అడిగాడు. 
దొంగ,"నా పేరు ఆషాఢభూతి. మీరు ఆర్జించుకొన్న జ్ఞానధనాన్ని మీకు శుశ్రూష చేసి మీ నుంచీ నేను పొందాలని ఆశపడుతున్నాను.అది మినహా నాకు మరేమీ అక్కర్లేదు.నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి" అన్నాడు.
"అలాగే!" అన్నాడు దేవశర్మ.
ఆనాటి నుంచీ ఆషాఢభూతి దేవశర్మకు సేవ చేస్తూ అతనితో పాటు ఊరూరా తిరిగేవాడు.సొమ్ము దొంగలించేందుకు సరయిన అవకాశం కోసం చూస్తూ ఉండేవాడు.పైకి మాత్రం ఎంతో భక్తి,వినయం,వైరాగ్యం నటిస్తుండేవాడు.
ఒకనాడు గురుశిష్యులు ఇద్దరు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి కాలి నడకన వెళుతుండగా, ఆషాఢభూతి తన పంచెకి అంటివున్న ఒక గడ్డిపరకను చేతిలోకి తీసుకొని, దేవశర్మకి చూపి," గురువుగారు! పెద్ద ఆపరాధం జరిగింది.నిన్న రాత్రి మనం బసచేసిన శాస్త్రిగారి ఇంట్లో నేను పడుకొని వుండగా ఈ గడ్డిపరక నా పంచెకు పట్టుకొంది.అది చూసుకోకపోవటం వల్ల ఆ గడ్డిపరక నాతో వచ్చేసింది.మీరు నడుస్తూ ఉండండి.నేను పరుగున వెళ్లి, వాళ్ళ గడ్డిపరక వారికి ఇచ్చేసి ,మళ్ళీ పరుగున వచ్చి ఓ గంటలో మిమ్మల్ని కలుస్తానూ" అన్నాడు.
దేవశర్మ ఆశ్చర్యపోయాడు,"గడ్డిపరక కోసం ఇప్పుడు వెనక్కి వెళ్లకపోతే ఏమిటి నష్టం?" అన్నాడు.
ఆషాఢభూతి గంభీరంగా ముఖంపెట్టి," అలా అనకండి,గురువుగారూ! పరులసొమ్ము గడ్డి పరకైనా,పుచికపుల్లైన అది వాళ్లకు చేర్చేదాకా నాకు మనసు మనసులో ఉండదు" అంటూ వెనక్కి పరుగెత్తాడు.కొన్ని మైళ్ళు వెళ్ళి ఆ పరకను దోవవెంట పారేసి, తిరిగి వచ్చి గురువుని కలిశాడు.
అతని ' నిజాయితీ' చూసి దేవశర్మకు తల తిరిగి పోయింది! ఆషాఢభూతి మీద పూర్తిగా నమ్మకం కుదిరింది.
పైగా రోజురోజకీ వయసు మీద పడి, సత్తువ తగ్గిపోతుంది.ఆయన బొంత బరువు కూడా దక్షిణలతో రోజురోజకూ పెరిగిపోతుంది.
" నాయనా ఆషాఢభూతీ! ఇకనుంచి మన ప్రయాణాలలో ఈ బొంతను నువ్వే తీసుకురా,నేను మోయాలేకపోతున్నాను"అన్నాడు ఒకరోజు దేవశర్మ.
"మహాప్రసాదం" అంటూ దాన్ని అందుకొన్నాడు ఆషాఢభూతి.దాన్ని చాలా జాగ్రత్తగా మోస్తూ,అవసరమైన చోట గురువుగారికి దాన్ని పరుపూ,దుప్పటిగా వేస్తూ,మరింత నమ్మకం కలిగించాడు కొన్నాళ్లపాటు.
ఒకనాడు గురుశిష్యులు నడుస్తుండగా, త్రోవలో ఒక చెరువు కనిపించింది.సాయంసంధ్య కోసం అక్కడ ఆగారు.గురువు చెరువులో దిగి స్నానసంధ్యలు పూర్తి చేసుకొన్నాడు.తిరిగి ఒడ్డుకు వస్తుండగా,ఒడ్డున రెండు గొర్రెపోతులు భయంకరంగా పొట్లాడుకుంటూ కనిపించాయి.శిష్యుడు రెండడుగులు ముందు వేస్తుండగా గురువుగారు గొర్రెపోతుల పోట్లాట వినోదం చూస్తూ కాసేపు నిలబడ్డాడు.
చూస్తుండగానే గొర్రెపోతులు తలలు కుమ్ముకొంటున్నాయి.వాటి తలల నించీ నెత్తురు కారి, నేలమీద పడి గడ్డ కడుతున్నది.ఇంతలో ఓ నక్క అటు వచ్చింది. అది నేలమీదపడ్డ రక్తాన్ని చూసి మాంసం ముద్ద అనుకొని ఆశపడ్డది.పొట్లతలో అప్పుడప్పుడూ రెండు గొర్రెపోతులూ,నాలుగడుగులు వెనక్కి వేసి మళ్ళీ ముందుకు వచ్చి ఢీ కొట్టుకుంటున్నాయి.నక్క జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ ఉంది.ఒక దశలో గొర్రెపోతులు వెనక్కి వెళ్ళగానే,నక్క మధ్యలోకి దూరింది.ఆ రక్తంలో మాంసం ఏమి తగలలేదు.ఆ వెతుకులాటలో నక్క వెనక్కి జరగటం ఆలస్యమైంది.వేగంగా పరుగెత్తుకొచ్చి ఢీ కొన్న గొర్రెపోతుల మధ్య నక్క తల ఇరుక్కుపోయి నక్క చచ్చిపోయింది.
దేవశర్మ ఇది చూశాడు."మాంసం మీద ఆశ పడి నక్క ప్రాణం పోయింది దురాశను మించిన దుర్గుణం మరోటి లేదంటారు!" అనుకొంటూ అక్కడి నుండి శిష్యుడి కోసం చూస్తూ ముందుకు సాగాడు.
ఏడి శిష్యుడు, కనబడితేనా? దేవశర్మకు గుండె ఆగినంత పనైంది "ఆషాఢభూతీ! ఆషాఢభూతీ !" అని అరుస్తూ పరుగెత్తాడు. ఇంకెక్కడి ఆషాఢభూతి,అతను బింతతో సహా ఎప్పుడో ఉడాయించాడు.పిలిచీ, పిలిచీ, వెతికీ, వెతికీ,దోవలో వచ్చిపోయే వాళ్ళందర్నీ అడిగి,అడిగి దేవశర్మ ఎంత శ్రమపడ్డా ఏం ఫలితం? శిష్యుడు పారిపోయాడూ, డబ్బు ఎగిరిపోయింది.
" గొర్రెపోతుల పోట్లాటలో ఆ నక్కలాగే, ఆషాఢభూతి వల్ల నేను కూడా స్వయంకృతం వల్లే చెడ్డాడు!" అని ఎంతో విచారించాడు దేవశర్మ.
దాంతో దమనకుడు చెప్తున్న కథ పూర్తి అయింది.
"అయితే, ఇంతకీ ఇప్పుడేం చేస్తావ్?" అన్నాడు కరటకుడు.
" ఇప్పుడేదైనా  ఎత్తు వేసి,ఆ పింగళకుడికీ ,సంజీవకుడికి మధ్య ఉన్న స్నేహం చెడగోట్టాలి. లేకపోతే నా గతి అధోగతే" అన్నాడు దమనకుడు.
"అదెలా సాధ్యం?"
ఉపాయం ఉంటే, అన్నీ సాధ్యమే. శరీరబలం వల్ల చేయలేనిది బుద్దిబలంతో సాధించవచ్చు. కాకీ-పామూ కథ విన్నావు గదా? లేదా? అయితే విను,అంటూ మరో కథ ఎత్తుకున్నాడు దమనకుడు.






సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...