మిత్ర భేదం
కరటకుడు- దమనకుడు
అనగనగా దక్షిణ భారతదేశంలో రక్షావతి అనే ఊరు. ఆ ఊళ్ళో వర్ధమానుడనే వర్తకుడు ఉండేవాడు.
“అన్ని పురుషార్థాలలో డబ్బే ముఖ్యం. అదుంటే ఏమయినా చేయచ్చు. కాబట్టి మనిషన్నవాడు వ్యాయం తప్పకుండా చేతయినంత డబ్బు సంపాదించాలి, సంపాదనకి అన్నిటికంటే మంచిమార్గం వ్యాపారం. మన ప్రాంతంలో దొరికే సరుకులు, యితర ప్రాంతాలకి తీసుకెళ్ళి లాభాలకు అమ్మగలిగితే బోలెడంత డబ్బు దొరుకుతుంది” అని ఆలోచించి, వర్దమానుడు బండ్లమీదా, గుర్రాల మీదా, కంచరగాడిదల మీదా బోలెడు సరుకులు ఎక్కించుకొని, తగినంత మంది సేవకులతో సహా, ఉత్తరదేశం బయలుదేరాడు.
కొంతదూరం వెళ్ళిన తర్వాత ఒక అడవిమార్గంలో వెళుతుండగా, దురదృష్టం వల్ల, ఒక బండి లాగుతున్న ఓ ఎద్దుకు కాలు విరిగింది. ఆ ఎద్దు పేరు సంజీవకుడు. “అయ్యో, నాకున్న ఎద్దుల్లో యిది బలమయిన ఎద్దు. పాపం దీనికేదయినా కట్టు కట్టించి మందిప్పిద్ధామంటే మరీ నట్టడవిలో ఉన్నాం. ఇక్కడ అది సాధ్యం కాదు. చేసేదేముంది? దాని ఖర్మ అలా ఉన్నది. కష్టాలు వచ్చే సమయంలో అవి రాకమానవు. ఇప్పుడీ నట్టడవిలో నేను ఆగిపోతే మరీ ప్రమాదం” అని, వర్దమానుడు మిగిలిన సరుకు బళ్ళన్నింటినీ ముందుకు పంపించేశాడు. కొద్దిమంది సేవకుల్ని అడవిలో ఆగిపోయిన బండికి కాపలాగా ఉంచి, అడవికి దగ్గర్లో ఉన్న ఓ గ్రామంలో మరొక ఎద్దును కొని తెచ్చాడు. కొత్త ఎద్దుతో ఆగిన బండిని లాగించి దాంతో తన ప్రయాణం కొన సాగించాడు. సంజీవకుడిని అడవిలోనే అలా వదిలి వెళ్ళక తప్పలేదు.
కారడవిలో కదలలేక అలా కొన్నాళ్ళు ఉండిపోయినా సంజీవకుడికి ఏ ఆపదా రాలేదు. ఆయుష్షు గట్టిగా ఉంటే ఎంత ప్రమాదం జరిగినా ఏమీ కాదు, అది లేకపోతే కోటి దేవతలు కూడా చావు తప్పించలేరు. కొద్దిరోజుల్లో విరిగిన కాలు కూడా నయమయిపోయింది. సంజీవకుడు ఆ అడవిలోనే విచ్చలవిడిగా తింటూ, తిరుగుతూ పూర్తి ఆరోగ్యం సంపాదించు కోవటమే గాక, బాగా కండబట్టి బలిశాడు.
ఒక రోజు సంజీవకుడు అడవిలో నిల్చొని పెద్దగా ఒక రంకె వేశాడు. ఆరోగ్యంగా, పుష్టిగా ఉన్న ఎద్దు నిర్భయంగా అలా కేకపెడితే, ఆ కేక ఆ అడవి అంతా బిగ్గరగా ప్రతిధ్వనించింది.
ఆ అడవి చాలా పెద్దది. అడవిలో మరోదిక్కున చాలా జంతుపులున్నయ్. వాటిలో ఒక సింహం ఉంది. దానిపేరు పింగళకుడు. ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన జంతువులన్నింటికీ సింహమంటే, సహజంగానే హడలు. సంజీవకుడు రంకె వేసిన సమయానికి, పింగళకుడు అడవి పక్కనే ఉన్న యమునానది దగ్గర నీళ్ళు తాగుతున్నాడు.
అంత పెద్ద రంకె వినగానే, పింగళకుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ శబ్దం ఎక్కడ నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా తెలియక అలా నిశ్చేష్టంగా నిలబడిపోయాడు!
ఆ దగ్గర్లోనే కరటకుడు, దమనకుదు అనే రెండు నక్కలు గూడా కబుర్లు చెప్పుకుంటున్నాయి. రంకె విని వాటికి గూడా భయంతో వణుకు పుట్టింది. సంబాళించుకోవడానికి కొంచెంసేపు పట్టింది.
“ఇన్నాళ్ళుగా మనం ఈ అడవిలో ఉన్నాం. ఇంత భయంకరమయిన కూత ఎప్పుడూ వినలేదు” అన్నాడు కరటకుడు.
“మనమే కాదు, ఈ అడవికి రాజు పింగళకుడు కూడా ఇలాంటి రంకె ఎప్పుడు వినలేదు. చూడు ఎలా నిలబడిపోయాడో బొమ్మలాగా!” అన్నాడు దమనకుడు.
“అవును ఏదో భయంకరమయిన కొత్త జంతువు నిన్నొ మొన్నో మన అడవికి వచ్చి ఉంటాంది. ఇది దాని పనే అయ్యుంటుంది. దాని దెబ్బకు మనమంతా నిలువగలుగు తామో, లేదో తెలియదు. ఎలా బతుకుతామో, ఏమో?” అంది కరటకం.
దమనకుడికి కొంచెం ధైర్యం ఎక్కువ.
“కంగారుపడకు, ఈ అడవి మన సొంతిల్లా? అవసరమయితే యింకో చోటికి పారిపోతాం. అయినా యిప్పుడు మనకొచ్చిన కష్టమేమిటి? ఈ కూతపెట్టిన జంతువు తెల్లటిదో, నల్లటిదో, చిన్నదో, పెద్దదో మనకి తెలియదు. ఒక్కొక్కప్పుడు ‘పిట్ట కొంచెం, కూత ఘనంగా ఉండటం చూస్తూనే ఉంటాం. ఈ జంతువు కూడా మనం అనుకొంటున్నంత భయంకరమయినది కాదనిపిస్తున్నది. అసలు రంకె వినిపించిన దిక్కులో యితర జంతువులు భయపడి పారిపోతున్న అలికిడి ఏమీ కనబడటం లేదు. గమనించావా?” అన్నాడు.
కరటకుడు తల ఊపి, మౌనంగా ఉండిపోయాడు. కాసేపయిన తర్వాత అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది.
“అదీ కథ, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇందులో ఏమీ ప్రమాదం లేదు. కొన్నాళ్ళ క్రిందట, అడవికి ఆ పక్క ఓ వర్తకుడు కాలు విరిగిన ఎద్దును వదిలేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఎద్దు బాగా కోలుకొని అక్కడే తిరుగుతూ ఉండగా రెండు మూడు సార్లు నేను చూశాను. ఇది దాని రంకె. దానికే భయపడిపోయాం మనం. మనకంటే శూరుడు మన మృగరాజు పింగళకుదు, మనకంటే ఎక్కువ భయపడిపోయాడు!” అంది.
దమనకుడు మాత్రం “ఎంతయినా సింహం మనకు రాజు. మనం మంత్రులవంటి వాళ్ళం. భయం పోగొట్టి, ఆ నెపంతో రాజును మంచి చేసుకొంటే మనకు ఉపయోగం” అంది.
కరటకుడు ఒప్పుకోలేదు. “చూడు మిత్రమా, ఈ రాజు మనకు కొత్తకాదు. అందర్నీ వేధిస్తాడు. ‘ఎత్తువారి చేతిబిడ్డ’ లాగా ఎవరెలా చెప్తే అలా ఉంటాడు కానీ ఒక తీరుగా ఉండడు. ఇతనితో పడ్డ పాట్లు చాలు. పొట్ట పోసుకునేందుకు, ఒకరి దగ్గర ఊడిగం చేయటం కష్టమయిన పని. ఆ సేవక వృత్తిలో రాజు మెప్పుపొందితే కొంత నయం. ఆయన పట్టించుకోకపోతే మరీ కష్టం. చివాట్లు తిని భంగపడటం చావుతో సమానం. సేవతో సంపాదించే పాయసం కంటే, స్వేచ్ఛగా ఉండి సంపాదించుకొనే గంజి మేలు. ఇప్పుడు ఆ పింగళకుడి భయం పోగొట్టడం మన పని కాదు. లేనిపోని పనిబెట్టుకొంటే కష్టాల్లో పడతాం. ఇప్పుడు పింగళకుడికి చాలామంది సేవకులున్నారు. వాళ్ళు చెయ్యాల్సిన పని మనం చెయ్యభోతే పరాధికారం మీద వేసుకొన్న గాడిదలాగా తన్నులు తింటాం ఆ కథ తెలుసు గదా?” అన్నాడు.
చెప్పమన్నాడు దమనకుడు, కథ మొదలుపెట్టాడు కరటకుడు.
మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి..
ధన్యవాదలు...
ఇంకా ఉంది...
తరువాత కథ: 🐕 కుక్క- గాడిద
Please visit the blog.share and comment the story...enjoy by reading the story